ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 JUL 2026 8:09AM by PIB Hyderabad
ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఇరు దేశాల ప్రధానమంత్రులు పరిమిత, ప్రతినిధి బృందాల స్థాయిల్లో విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం-పెట్టుబడి, రక్షణ-భద్రత, వ్యవసాయ-సాంకేతికత, క్రీడలు, విద్య, పర్యాటకం, సంస్కృతి, ప్రజా సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాలూ ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించడానికి వారు అంగీకరించారు. ఇది భారత్-న్యూజిలాండ్ సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికింది. పరస్పర ప్రయోజనకరమైన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యాన్ని ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించుకున్నారు. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
చర్చల అనంతరం, ఇరు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో... రక్షణ, సముద్ర భద్రత, జలవిజ్ఞానం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పరిశ్రమ, పర్యాటకం, సముద్ర సంబంధిత వారసత్వం, సంస్కృతి, ఆహార సాంకేతికత, సముద్ర పరిశోధన రంగాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆ ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు [లింక్]. ద్వైపాక్షిక భాగస్వామ్య భవిష్యత్ కార్యాచరణపై ఒక సంయుక్త ప్రకటననూ ఇరువురు నేతలు ఆమోదించారు [లింక్].
తమ పట్ల చూపిన ఆప్యాయతకు, అందించిన ఆతిథ్యానికి న్యూజిలాండ్ ప్రధానమంత్రి లక్సన్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ మోదీ... భారత్‌లో పర్యటించాల్సిందిగా న్యూజిలాండ్ ప్రధానిని ఆహ్వానించారు.
***
(रिलीज़ आईडी: 2283665)
आगंतुक पटल : 7