రక్షణ మంత్రిత్వ శాఖ
హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రతలకు హామీ ఇచ్చే ప్రధాన దేశమే భారత్: రక్షణ మంత్రి
సముద్రయాన ప్రయోజనాలను కాపాడుతున్న నౌకాదళంపై రక్షణ మంత్రి ప్రశంసలు
భవిష్యత్తు సంఘర్షణలు ఊహించని రూపాల్లో ఎదురుకావచ్చు... సైనికులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి: రక్షణ మంత్రి
రక్షణ దళాలకు ప్రపంచ స్థాయి ఆయుధాలను సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
10 JUL 2026 9:01PM by PIB Hyderabad
అంతకంతకూ సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడుతూ మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్న భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. “హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు హామీ ఇచ్చే ప్రధాన దేశంగా భారత్ నిలుస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ 17ఏ కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఆరో స్టెల్త్ ఫ్రిగేట్ 'మహేంద్రగిరి'ని భారత నౌకాదళంలోకి చేర్చే కార్యక్రమం సందర్భంగా 2026 జూలై 10 నాడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన 'బడాఖానా' కార్యక్రమంలో ఆయన నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్) వ్యూహాత్మక ప్రాధాన్యతను రక్షణ మంత్రి ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ మొత్తం వాణిజ్యంలో 90 శాతం కంటే ఎక్కువ సముద్ర మార్గాల ద్వారానే సాగుతుందని ఆయన గుర్తుచేశారు. దేశ ఇంధన భద్రత, ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్), ద్వీప భూభాగాలు దేశ ఆర్థిక వృద్ధికి, జాతీయ ప్రయోజనాలకు ఎంతగానో దోహదపడుతున్నాయని చెబుతూ... అందుకే సముద్ర భద్రత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పోటీ, ఈ ప్రాంతంలో ఇతర బాహ్య శక్తుల ఉనికి పెరగడం వల్ల సముద్ర తీరాల్లో మరింత అప్రమత్తత అవసరమని ఆయన చెప్పారు. “ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత నౌకాదళం మన సముద్ర సరిహద్దులను రక్షిస్తూ కీలకమైన సముద్ర మార్గాలకు భద్రత కల్పిస్తోంది. ఈ ప్రాంతం అంతటా దేశ ప్రయోజనాలను సగర్వంగా కాపాడుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశమే అతిపెద్ద, అత్యంత బాధ్యతాయుతమైన భాగస్వామి అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సురక్షితమైన సముద్ర వాతావరణాన్ని పెంపొందించడానికి దేశం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. “ఈ ప్రాంతం మన ఇంటి వాకిలి లాంటిది. మన వాకిలిని కాపాడుకోవడం మన ప్రాథమిక బాధ్యత” అని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా దేశం సాధిస్తున్న పురోగతిని రక్షణ మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'మహేంద్రగిరి' యుద్ధనౌక నౌకాదళంలో చేరడం అనేది భారత్‌లో పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు మరో అద్భుతమైన ఉదాహరణ అని ఆయన అభివర్ణించారు. దేశాన్ని బాహ్య ముప్పులు, సవాళ్ల నుంచి రక్షించే విషయంలో మన రక్షణ దళాలు చూపిస్తున్న శౌర్యం, నిబద్ధత, దేశభక్తిని ఆయన కొనియాడారు. మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రాలను ఎదుర్కొనేందుకు మన జవాన్లు నిరంతరం తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అత్యాధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలని, ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
యుద్ధాల స్వభావం చాలా వేగంగా మారుతోందని చెప్పిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. భవిష్యత్తు సంఘర్షణలు కొత్త, ఊహించని రూపాల్లో ఎదురుకావచ్చని హెచ్చరించారు. మన సైనికులు శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని.. నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సరికొత్త సాంకేతికతలపై పట్టు సాధించాలని ఆయన అన్నారు. “అధికారికంగా యుద్ధ ప్రకటన లేకుండానే కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. రేపటి శత్రువు నిన్నటి శత్రువులా ఉండకపోవచ్చు. మన సైనికులకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆయుధాలు, సాంకేతికత, వనరులను అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి లోటు లేకుండా చూస్తుంది. అయితే కేవలం ఆయుధాలు మాత్రమే యుద్ధాలను గెలవలేవు.. ఆ ఆయుధాలను ప్రయోగించే సైనికులే విజయాలను అందిస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, భారత నౌకాదళానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2283662)
आगंतुक पटल : 10