ఆర్థిక మంత్రిత్వ శాఖ
త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిర్వహించిన రెండు వేర్వేరు దాడుల్లో లక్షకు పైగా కోడైన్ దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
ఒకరి అరెస్టు
प्रविष्टि तिथि:
05 JUL 2026 7:20PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి, మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థలను నిర్మూలించడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా... ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన రెండు వేర్వేరు దాడులలో భారీ సంఖ్యలో కోడైన్ ఆధారిత దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అగర్తలా వెళ్తున్న రైలు పార్శిల్ వ్యానులో రవాణా చేస్తున్న సరుకును 02.07.26న డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. కవర్ కార్గోగా ఉపయోగించిన పొడి పదార్థపు పొర కింద, 80 లోహపు డ్రమ్ముల్లో ఈ నిషేధిత సరుకును చాకచక్యంగా దాచి రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు కనుగొన్నారు. మొత్తం 55,626 కోడైన్ ఆధారిత దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ సహకారంతో ఈ దాడులను నిర్వహించారు. ఈ సరుకును స్వీకరించడానికి వచ్చిన ఒక వ్యక్తినీ అరెస్టు చేశారు.
దాదాపు అదే సమయంలో, పశ్చిమ బెంగాల్‌లోని దంకునీలో నిర్వహించిన మరో దాడిలో భాగంగా ఒక గిడ్డంగిలో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ సీల్ చేసిన 104 ఇనుప డ్రమ్ముల నుంచి 56,225 కోడైన్ ఆధారిత దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడకుండా ఉండేందుకు, ఆ సీసాలను డ్రమ్ముల లోపల చైనా క్లే పౌడర్ పొర కింద దాచి ఉంచారు. ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల కింద డీఆర్ఐ అధికారులు పెద్ద మొత్తంలో సరుకును సీజ్ చేశారు.
మొత్తంగా, ఈ రెండు ఆపరేషన్ల ద్వారా సుమారు 1.11 లక్షల కోడైన్ ఆధారిత దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
నల్లమందు నుంచి తయారు చేసే కోడైన్కు, నియంత్రిత ఔషధ తయారీలో చట్టబద్ధమైన చికిత్సా ఉపయోగం ఉంది. ఈ కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌లను అక్రమ వినియోగం కోసం మళ్లించినప్పుడు, వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న కారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు తరచుగా వీటిని లక్ష్యంగా చేసుకుంటాయి.
మాదక ద్రవ్యాలు కలిగిన ఔషధాలను వినూత్న పద్ధతులతో దాచి ఉంచి అక్రమ రవాణా కోసం మళ్లించడానికి వ్యవస్థీకృత స్మగ్లింగ్ సిండికేట్లు చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ స్వాధీనాలు స్పష్టం చేస్తున్నాయి. సమన్వయంతో కూడిన, నిఘా ఆధారిత కార్యకలాపాల ద్వారా ఇటువంటి ముఠాలను నిర్మూలించడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2281446)
आगंतुक पटल : 13