సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి.. స్మారక కార్యక్రమాన్ని రేపు కోల్‌కతాలో నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కార్యక్రమ ముఖ్య అతిథిగా కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
05 JUL 2026 7:01PM by PIB Hyderabad
భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి రేపు.. అంటే 2026 జులై 6న. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రెండు సంవత్సరాల పాటు అధికారిక స్మారక కార్యక్రమాలను నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఒక ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఈ నెల 6న ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యటన శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ మనోజ్ అగర్వాల్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ సహా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకొని రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్త స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు 2025లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దార్శనికత కలిగిన రాజనీతికోవిదుడు, విద్యావేత్త, పార్లమెంట్ సభ్యుడు, జాతీయవాద నేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిరకాల వారసత్వాన్ని గౌరవించుకొనే లక్ష్యంతో ఈ దేశవ్యాప్త కార్యక్రమాలను ప్రకటించారు. భారత్ రాజకీయ, సాంస్కృతిక, విద్యా, పారిశ్రామిక రంగాల రూపురేఖలను తీర్చిదిద్దడంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ విశేష తోడ్పాటును అందించారు.
ముఖ్య అతిథి శ్రీ అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖులు కోల్‌కతా.. భవానీపూర్లో ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నివాసంలో పుష్పాంజలి ఘటించి రేపటి కార్యక్రమానికి శుభారంభాన్ని అందిస్తారు. దీని తరువాత, ముఖ్య అతిథి శ్రీ షా ఇకో పార్కుకు వెళ్లి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 అడుగుల ఎత్తు విగ్రహానికి శంకుస్థాపన చేస్తారు. ఈ విగ్రహం దేశానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అందించిన చిరకాల తోడ్పాటును గౌరవించుకొనే దిశగా చేపడుతున్న ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా నిలుస్తుంది.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితంతో పాటు ఆయన వారసత్వానికి అంకితం చేసిన ఒక ప్రత్యేక ప్రదర్శనను కూడా మిలన్ మేళా ప్రాంగణంలో ప్రారంభిస్తారు. అరుదైన ఫోటోలు, పాత దస్తావేజులు, ఆకర్షణీయ మల్టీమీడియా ప్రదర్శనలు ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఉంటాయి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవన యాత్ర, ఆదర్శాలు, విద్యారంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, భారత్ ప్రజాస్వామ్య సంస్థలతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ ఎగ్జిబిషన్ వివరిస్తుంది.
మిలన్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసే స్మారక కార్యక్రమంలో వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. సీసీఆర్టీ ఆధ్వర్యంలో ‘‘సుర్, సంస్కృతి ఏవమ్ రాష్ట్ర’’ పేరిట ఒక ఘన సంగీతమయ శ్రద్ధాంజలిని సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భారత శాస్త్రీయ, జానపద, సంప్రదాయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించే 57 మంది నిపుణులైన కళాకారులు పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమం భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకతా భావనకు అద్దం పడుతుంది. ఒక సంగీత రూపకంగా సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సాంస్కృతిక జాతీయవాదం, జాతీయ సమైక్యత, విద్య, నాగరికతా సంబంధిత విలువలతో కూడిన శాశ్వత ఆదర్శాలను పండుగ చేసుకొనేలా నిర్వహించనున్నారు. సంగీత రూపకానికి పద్మశ్రీ తరుణ్ భట్టాచార్య దర్శకత్వం వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్నీ, తోడ్పాటునీ ప్రతిబింబించే ఒక లఘు చిత్ర ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతో పాటు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి చెందిన ప్రతిపాదిత 125 అడుగుల ఎత్తు విగ్రహానికి శంకుస్థాపన సన్నివేశాన్ని కళ్లకు కట్టే ప్రత్యేక వీడియోను కూడా ఆవిష్కరిస్తారు.
దేశమంతటా రెండు సంవత్సరాల పాటు నిర్వహించే ఈ స్మారకోత్సవం దేశ అగ్రగామి రూపకర్తలలో ఒకరి చిరకాల వారసత్వాన్ని సంరక్షిస్తూ, ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను చాటనుంది. అలాగే ఈ ఉత్సవం.. జాతీయవాదం, ప్రజాసేవ, భారత సమైక్యత, ప్రగతి పట్ల తిరుగులేని అంకితభావాన్ని చాటిన మహనీయుని ఆదర్శాల స్ఫూర్తిని వర్తమాన తరంతో పాటు భావి తరాల వారికి కూడా స్ఫూర్తిని అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2281443)
आगंतुक पटल : 10