హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలోని పలు ప్రాంతాల్లో 'ఎల్ నినో' కారణంగా తలెత్తిన వర్షాభావ పరిస్థితిని, దాని ప్రభావాన్ని సమీక్షించిన కేంద్ర మంత్రులు


సమీక్ష నిర్వహించిన హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా... వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

దేశవ్యాప్తంగా రుతుపవన వర్షపాత పరిస్థితులను, 'ఎల్ నినో' కారణంగా తలెత్తే అవకాశమున్న కరువు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, భారీ జల వనరులతో పాటు భూగర్భ జల మట్టాలను పర్యవేక్షించాలని జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించిన కేంద్ర హోం మంత్రి

పశుగ్రాసం, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచన

దేశంలో బియ్యం, గోధుమలు సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి... నిత్యావసర వస్తువుల ధరలూ స్థిరంగా ఉన్నాయని ప్రకటన

प्रविष्टि तिथि: 03 JUL 2026 7:42PM by PIB Hyderabad

'ఎల్ నినో' కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితిని, దాని ప్రభావాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సహా పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... ఎల్ నినో కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితి, సంభావ్య కరువు పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. ఈ సమయంలో సాగు చేయాల్సిన సరైన పంటల గురించి రైతులకు సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యవసాయ మంత్రిత్వ శాఖను, సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటినీ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జలాశయాలను పర్యవేక్షించాలని జలవనరుల శాఖ అధికారులను శ్రీ షా ఆదేశించారు. పశుగ్రాసం, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్ సరఫరా సజావుగా, తగినంత స్థాయిలో జరిగేలా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిని శ్రీ అమిత్ షా ఆదేశించారు.

దేశంలో బియ్యం, గోధుమలు సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయనీ, నిత్యావసర వస్తువుల ధరలూ స్థిరంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు.

ఈ సమావేశానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ... జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ... వినియోగదారుల వ్యవహారాల శాఖ... మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ... పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ... విద్యుత్ మంత్రిత్వ శాఖ... గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ... శాస్త్ర సాంకేతిక శాఖల కార్యదర్శులతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సభ్యులు, పలు విభాగాల అధిపతులు, భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) డైరెక్టర్ జనరల్, కేంద్ర జల సంఘం ఛైర్మన్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహా పలు శాఖల అధికారులు హాజరయ్యారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. అస్సాంలోని పలు జిల్లాల్లో వరద నీరు పెరుగుతుండగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసుకుపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అంతర్-మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లకు పంపాలని ఆయన ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, మానవ నివాసాలకు జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేయడానికి ఐఎంసీటీ నిర్వహించే ఈ క్షేత్రస్థాయి అంచనా చాలా అవసరం.

 

***


(रिलीज़ आईडी: 2280957) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam