నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తొలి మేడ్-ఇన్-ఇండియా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్‌తో నౌకా వాణిజ్య రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ కీలక ముందడుగు
దేశంలో అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య రంగ తయారీ వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ... మరో 1,000 మేడ్-ఇన్-ఇండియా కంటైనర్లకు ఆర్డర్ ఇచ్చిన మేయస్క్
మనం కేవలం నౌకాయాన కంటైనర్లను మాత్రమే కాదు... వికసిత్ భారత్ కోసం ప్రపంచంతో పోటీపడగల నౌకా వాణిజ్య రంగ తయారీ వ్యవస్థనూ నిర్మిస్తున్నాం
వార్షిక కంటైనర్ తయారీ సామర్థ్యాన్ని 7.9 లక్షల టీఈయూలతో పది రెట్లు పెంచడం సీఎంపీఎస్ పాలసీ లక్ష్యం: శ్రీ సర్బానంద సోనోవాల్
प्रविष्टि तिथि:
03 JUL 2026 6:17PM by PIB Hyderabad
భారత నౌకా వాణిజ్యం-తయారీ రంగాల్లో భారత్ కీలక ముందడుగు వేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో గల మాయెస్క్-కాంకార్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో వేదికగా తొలి దేశీయ ఎగ్జిమ్ కంటైనర్‌ను బారత్ ఈ రోజు ఆవిష్కరించింది. ప్రపంచ నౌకాయాన దిగ్గజ సంస్థ ఏ.పీ. మోల్లర్-మాయెస్క్ కోసం దేశీయంగా తయారు చేసిన ఈ తొలి ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) షిప్పింగ్ కంటైనర్‌ను కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వయం సమృద్ధ భారత్, మేక్ ఇన్ ఇండియా, మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 దార్శనికతలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడంలో భారత ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తుంది.
దేశంలో అభివృద్ధి చెందుతున్న కంటైనర్ తయారీ వ్యవస్థ పట్ల తమ బలమైన విశ్వాసాన్ని చాటుతూ... మాయెస్క్ సంస్థ భారత్‌లో తయారయ్యే మరో 1000 షిప్పింగ్ కంటైనర్ల కోసం డీసీఎం శ్రీరామ్ గ్రూప్‌కు ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచ నౌకా వాణిజ్య రంగ సమగ్ర వాణిజ్య కార్యకలాపాల్లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యానికి ఇది నాంది పలికింది.
ఏ.పీ. మోల్లర్-మేయస్క్ పర్యవేక్షక మండలి ఛైర్మన్ రాబర్ట్ మేయస్క్ ఉగ్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరిలో జరిపిన చర్చల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైంది. భారత్‌లో ప్రపంచ స్థాయి కంటైనర్ తయారీ వ్యవస్థ అభివృద్ధికి మద్దతునివ్వాలని చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఆ కంపెనీని కోరారు. కేవలం పదహారు నెలల్లోనే ఈ దార్శనికత కార్యరూపం దాల్చింది. దేశంలో తయారైన తొలి ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్‌ను విజయవంతంగా విడుదల చేయడంతో పాటు అంతర్జాతీయ విక్రయాన్నీ పూర్తి చేశారు. వ్యూహాత్మక ఉద్దేశాన్ని సకాలంలో అమలులోకి తీసుకురాగల భారత ప్రభుత్వ సామర్థ్యాన్ని ఇది స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, భారత్ ఒక విశ్వసనీయమైన ప్రపంచస్థాయి తయారీదారుగా, నౌకా వాణిజ్య శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ నౌకాయాన సంస్థ కోసం దేశంలో తయారైన తొలి ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్‌ను ఆవిష్కరించడం స్వయం సమృద్ధ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన ముందడుగు. ఇది భారత తయారీ సామర్థ్యాలపై ప్రపంచ పరిశ్రమలకు పెరుగుతున్న విశ్వాసాన్నీ, నౌకా వాణిజ్య రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం పట్ల మన నిబద్ధతనూ ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.
ఐఎస్‌వో నిర్దేశాలు, సురక్షిత కంటైనర్ల అంతర్జాతీయ ఒప్పందం (సీఎస్‌సీ)తో సహా అంతర్జాతీయంగా ఆమోదం పొందిన నాణ్యత-భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో తొలి కంటైనర్‌ను రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్త వినియోగానికీ అనువుగా ఉంటుంది.
"ప్రభుత్వ విధానపరమైన కార్యక్రమాలు, పారిశ్రామిక భాగస్వామ్యం, సకాలంలో కార్యకలాపాల అమలు ద్వారా... తయారీ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి సామర్థ్యాల కోసం కొత్త అవకాశాలను ఎలా సృష్టించవచ్చో ఈ విజయం నిరూపిస్తుంది. ప్రపంచంలోనే అగ్రగామి వాణిజ్య దేశంగా భారత్ ఎదగడానికి తోడ్పడే పటిష్ఠమైన, స్వయం సమృద్ధిగల నౌకా వాణిజ్య వ్యవస్థను సృష్టిస్తూ... ప్రతి లక్ష్యాన్నీ నిర్దేశిత కాలపరిమితుల్లో వాస్తవరూపంలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దేశీయ కంటైనర్ తయారీ కోసం కేంద్ర బడ్జెట్-2026లో ప్రకటించిన రూ.10,000 కోట్ల కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం (సీఎంపీఎస్) ప్రణాళికతో సహా, విధానపరమైన చర్యల ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించడానికి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకూ ఈ పరిణామం అనుగుణంగా ఉంది. దిగుమతి చేసుకున్న కంటైనర్లపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం, సరుకు రవాణా వ్యవస్థ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచంతో పోటీపడగల తయారీ వ్యవస్థను సృష్టించడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందని భావిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కంటైనర్ తయారీ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ సౌకర్యాలను విస్తరించడానికి మూలధన వ్యయ (క్యాపెక్స్) మద్దతును అందించడం... దేశీయ తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రతీ కంటైనర్‌కు అయ్యే ఖర్చులో వ్యత్యాసాన్ని పూడ్చేందుకు నిర్వహణ వ్యయాల (ఒపెక్స్) మద్దతును అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. పరిశోధన, పరీక్ష, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాలను పెంపొందించుటను ప్రోత్సహించడానికి పరిశోధనాభివృద్ధి పరమైన (ఆర్&డీ) మద్దతును మరింత విస్తరించడం దీని ఉద్దేశం.
సామర్థ్యాన్ని పెంపొంపెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ శ్రీ సోనోవాల్... "మూలధన సహాయం, కార్యాచరణ ప్రోత్సాహకాలు, పరిశోధన, పరీక్షలు, సాంకేతిక అభివృద్ధిపరమైన మద్దతుతో వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచి 7.5 లక్షల టీఈయూల వరకు చేర్చడం సీఎంపీఎస్ పథకం లక్ష్యం. ఇది ఒక బలమైన దేశీయ తయారీ వ్యవస్థను సృష్టించడం, ఉపాధిని కల్పించడం, సాంకేతికతను పంచుకోవడాన్ని ప్రోత్సహించడం సహా భారత సరుకు రవాణా వ్యవస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. కంటైనర్ల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేయడం, నాణ్యమైన కంటైనర్లకు మన దేశాన్ని ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతి కేంద్రంగా నిలపడం దీని లక్ష్యం" అని అన్నారు.
భారత నౌకా వాణిజ్య తయారీ రంగంలో జరగబోయే ఒక బృహత్ పరివర్తనకు ఈ విజయం నాంది అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ నౌకాయాన కంపెనీల భాగస్వామ్యం పెరగడం, అనుకూలమైన విధాన వాతావరణం, అభివృద్ధి చెందుతున్న దేశీయ సామర్థ్యాలతో... షిప్పింగ్ కంటైనర్ల తయారీకి ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా మారడానికి భారత్ సిద్ధంగా ఉంది.
వ్యాపార సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం కోసం శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బారత ప్రభుత్వం 'ఒకే దేశం ఒకే పోర్ట్ ప్రక్రియ' (ఓఎన్ఓపీ), 'మారిటైమ్ సింగిల్ విండో' 'ఇ-సముద్ర' వంటి పరివర్తనాత్మక డిజిటల్ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. 'మర్చంట్ షిప్పింగ్ యాక్ట్-2025', 'కోస్టల్ షిప్పింగ్ యాక్ట్-2025', 'ఇండియన్ పోర్ట్స్ యాక్ట్-2025' వంటి చరిత్రాత్మక చట్టాలనూ ప్రభుత్వం ఆమోదించింది. రూ.70,000 కోట్ల నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ ప్యాకేజీ, ప్రతిపాదిత 'భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్' మద్దతుతో... ప్రపంచంలోనే అగ్రగామి షిప్ రీసైక్లింగ్ దేశంగా భారత్ ఆవిర్భవించింది. 'కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక-2025'లో మూడు భారతీయ పోర్టులు... ప్రపంచంలోని టాప్ 30 ఓడరేవుల సరసన స్థానం సంపాదించాయి. వధావన్ పోర్ట్, గాలథియా బే వద్ద గల అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, ట్యూనా టెక్రా కంటైనర్ టెర్మినల్, ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో... భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచస్థాయి సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రపంచ స్థాయి నౌకా వాణిజ్య వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
నెదర్లాండ్స్ రాయబారి గౌరవ మరిసా గెరార్డ్స్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్, ఏపీ మోల్లర్ మాయెస్క్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ థీయూవెస్, మాయెస్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ హసన్, నౌకాశ్రయాలు-నౌకాయానం-జల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులుతో పాటు నౌకా వాణిజ్య రంగం, డీసీఎం శ్రీరామ్ గ్రూప్, కాంకార్ సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2280954)
आगंतुक पटल : 9