వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎఫ్ఐసీసీఐ మెర్సిడెస్-బెంజ్ భారత్ ఇన్నోవేషన్ - బిజినెస్ ఐడియాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్’ కింద అంకుర సంస్థలకు డీపీఐఐటీ చేయూత


ఎంపికైన ఏడు అంకురసంస్థలకు నిధుల సమీకరణ తరువాత నిర్మాణాత్మక మార్గదర్శనం, చేయూత

प्रविष्टि तिथि: 03 JUL 2026 4:21PM by PIB Hyderabad

 

‘ఎఫ్ఐసీసీఐ మెర్సిడెస్-బెంజ్ భారత్ ఇన్నోవేషన్ - బిజినెస్ ఐడియాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్’ కింద వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) భారత అంకుర సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థ బలోపేతం పట్ల తన నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించింది.

తయారీ, సుస్థిరత, విద్య, డీకార్బనైజేషన్, ఆటోమోటివ్, ఈవీలు సహా కీలక రంగాల్లో వినూత్నమైన, విస్తరించదగిన పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న అధిక సామర్థ్యం గల భారతీయ అంకుర సంస్థలను గుర్తించి, వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం లక్ష్యంగా ‘ఎఫ్ఐసీసీఐ మెర్సిడెస్-బెంజ్ భారత్ ఇన్నోవేషన్ - బిజినెస్ ఐడియాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీపీఐఐటీ అదనపు కార్యదర్శి శ్రీ అతీష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ), మెర్సిడెస్-బెంజ్ ఇండియాను అభినందించారు. ఈ కార్యక్రమం నానాటికీ మెరుగవుతున్న భారత ఆవిష్కరణల వ్యవస్థ బలాన్ని, దేశంలోని యువ పారిశ్రామికవేత్తల అపారమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. సకాలంలో సరైన మార్గదర్శనం, మద్దతును అందించడం ద్వారా... ఈ కార్యక్రమం జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని సాధించడానికి, ప్రపంచ ఆవిష్కరణల రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి సహకారాత్మక ప్రయత్నాలు చాలా అవసరమని శ్రీ అతీష్ కుమార్ సింగ్ జోడించారు.

ఎంపికైన ఏడు అంకురసంస్థల వృద్ధిని వేగవంతం చేయడానికి, పెట్టుబడి సంసిద్ధతను మెరుగుపరచడానికి గాను... నిధులు సమకూరిన వెంటనే వాటికి నిర్మాణాత్మక మార్గదర్శనం, చేయూతను అందించే వ్యవస్థను ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం కీలకమైన వ్యాపార నిర్వహణ, నియంత్రణ, ఆర్థిక, చట్టబద్ధత, పెట్టుబడి, సాంకేతిక రంగాల్లో అంకురసంస్థలకు అవసరమైన మద్దతును అందిస్తుంది. తద్వారా అంకురసంస్థలు విస్తరించగల, పటిష్ఠమైన, ప్రపంచంతో పోటీపడగల సామర్థ్యాలను సాధించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఈ విధాన ప్రణాళిక కింద ఎంపికైన అంకుర సంస్థలు ప్రభుత్వ నిబంధనలను, చట్టపరమైన విధులను పాటించడం... పన్ను విధానాలు, నిధుల వినియోగం... నిధుల సమీకరణ వ్యూహం... కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేసే విధానాలు... పెట్టుబడిదారులతో పెట్టుబడి నిబంధనలపై చర్చించడం... డేటా గోప్యత... సైబర్‌ సెక్యూరిటీ... మేధో సంపత్తి పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక మార్గదర్శనం అందుకుంటాయి.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక డెమో డేలూ భాగంగా ఉంటాయి. తమ ఆవిష్కరణలు, వ్యాపార నమూనాలు, అభివృద్ధి వ్యూహాలను పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, వ్యవస్థ సంబంధిత భాగస్వాముల ముందు ప్రదర్శించే అవకాశాన్ని ఈ డెమోలు అంకుర సంస్థలకు కల్పిస్తాయి. మార్కెట్ సంసిద్ధతను ధ్రువీకరించడానికి, వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, భాగస్వామ్యాలు-నిధుల సమీకరణకు గల అవకాశాలను పొందడంలోనూ ఇవి సహాయపడతాయి.

ఎంపికైన అంకుర సంస్థలు "సౌండింగ్ బోర్డ్ ప్రోగ్రామ్" ప్రయోజనాన్నీ పొందుతాయి. ఇది ఒక వ్యూహాత్మక మార్గదర్శన కార్యక్రమం. వారి వ్యాపార నమూనాలను మెరుగుపరచడానికి, వృద్ధి వ్యూహాలను పదును పెట్టడానికి, మార్కెట్ సంసిద్ధత-దీర్ఘకాలిక విజయం దిశగా వారి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి వారికి పరిశ్రమ సంబంధిత అవగాహనను, నిపుణుల మార్గదర్శనాన్ని, నాయకత్వ దృక్పథాలను అందించడం లక్ష్యంగా దీనిని రూపొందించారు. ఆవిష్కరణలు, కొత్త పరిశ్రమల ఏర్పాటులో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలవాలనే భారత దార్శనికతకూ ఇది దోహదపడుతుంది.

దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించిన ఈ కార్యక్రమంలో... దేశం నలుమూలల నుంచీ అంకుర సంస్థలు పాల్గొన్నాయి. పరిశ్రమ నిపుణులు, వ్యవస్థ భాగస్వాముల కఠినమైన బహుళ-దశల మూల్యాంకనం తర్వాత... 32 అంకురసంస్థలతో జాబితాను రూపొందించారు. జ్యూరీ, నాయకత్వ బృందం ఎదుట తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ అంకురసంస్థలను ఆహ్వానించారు. ఆవిష్కరణలు, విస్తరణ సామర్థ్యం, వ్యాపార సామర్థ్యం, ప్రభావం ఆధారంగా మొత్తం ఏడు అంకురసంస్థలను ఎంపిక చేశారు. వీటిలో ప్రతి అంకురసంస్థకు రూ. 30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా... నిధుల సమీకరణ తర్వాత నిర్మాణాత్మక మార్గదర్శనం, వ్యాపారపరమైన మద్దతునూ అందిస్తారు.

ప్రారంభ దశలోని ఆవిష్కరణల స్థాయిని దాటి, ప్రపంచంతో పోటీపడే సంస్థలను నిర్మించడానికి అంకురసంస్థలకు అసరమైన సహాయం అందించుటలో వ్యవస్థాగత మద్దతు, మార్గదర్శనం, పరిశ్రమల సహకారం ప్రాముఖ్యతను ఈ చర్చ ప్రధానంగా ప్రస్తావించింది. దేశంలో పటిష్ఠమైన అంకురసంస్థల వ్యవస్థను పెంపొందించడం పట్ల డీపీఐఐటీ నిరంతర నిబద్ధతనూ ఇది పునరుద్ఘాటించింది.


(रिलीज़ आईडी: 2280945) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil