నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ రంగ నాయకత్వం దిశగా పురోగమిస్తున్న భారత్


జపనీస్ కంపెనీలతో ఏసీఎంఈ గ్రూప్ చరిత్రాత్మక గ్రీన్ అమ్మోనియా-మిథనాల్ ఒప్పందం

प्रविष्टि तिथि: 02 JUL 2026 7:28PM by PIB Hyderabad

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారత్ కీలక ముందడుగు వేసింది. న్యూఢిల్లీలోని అటల్ అక్షయ్ ఊర్జా భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ జపనీస్ కంపెనీలైన ఐహెచ్ఐ కార్పొరేషన్ ఫర్ గ్రీన్ అమోనియా, మిత్సుబిషి గ్యాస్ కెమికల్ కంపెనీ ఫర్ గ్రీన్ మిథనాల్‌ సంస్థలతో ఏసీఎంఈ క్లీన్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏసీఎంఈ గ్రూప్) దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి 2023లో రూ.19,744 కోట్ల వ్యయంతో ఏర్పాటైంది. గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా నిలపడం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. ఈ మిషన్ కింద, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నిర్వహించే పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమం అందిస్తోంది. సైట్ కార్యక్రమం కింద, ఏసీఎంఈ గ్రూప్‌ కోసం సంవత్సరానికి 3,70,000 టన్నుల (370 కేటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కేటాయించారు. ఇది ఈ ఎగుమతి-ఆధారిత ఒప్పందాలకు పునాది వేసింది.

ఐహెచ్ఐ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... ఏసీఎంఈ సంవత్సరానికి మొత్తం 4,05,000 టన్నుల (405 కేటీపీఏల) గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేస్తుంది. ఎమ్ఈటీఐ నిర్వహణలోని... ‘తక్కువ-కార్బన్ గల అమ్మోనియా కోసం జపాన్స్ కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ (సీఎఫ్‌డీ) పథకం’ ఈ ఏర్పాటు కోసం మద్దతునిస్తుంది. ఇది జపనీస్ కొనుగోలుదారులకు ధర పరంగా మద్దతునందించడం ద్వారా అటువంటి దిగుమతుల దీర్ఘకాలిక వాణిజ్యానికి అవకాశాలను నిర్ధారిస్తుంది.

పారాదీప్ ప్లాంట్ నుంచి ఏసీఎంఈ సంస్థ 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 1,00,000 టన్నుల (100 కేటీపీఏ) గ్రీన్ మిథనాల్ సరఫరా చేయడం కోసం మిత్సుబిషి గ్యాస్ కెమికల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా సముద్ర రంగంలో ప్రపంచ డీకార్బనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. యూరోపియన్ రిన్యూయెబుల్ ఫ్యూయల్స్ ఆఫ్ నాన్-బయోలాజికల్ ఆరిజిన్ అవసరాలకూ, సముద్ర సంబంధ పరిశుద్ధ ఇంధనాల కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకూ అనుగుణంగా దీనిని రూపొందించారు.

"ఏసీఎంఈ-ఐహెచ్ఐ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం సీఎఫ్‌డీ ద్వారా అందిస్తున్న రాయితీ మద్దతును పొడిగించాలని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. భారత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థ పట్ల ప్రపంచానికి పెరుగుతున్న విశ్వాసాన్ని, ప్రపంచ పరిశుద్ధ ఇంధన పరివర్తనలో విశ్వసనీయ భాగస్వామిగా మన పురోగతిని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో... నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒక పటిష్ఠమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యవస్థను సృష్టిస్తోంది. ఇది ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తూ, అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మిస్తూ, భారతీయ గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాలకు కొత్త మార్కెట్లనూ అందుబాటులోకి తెస్తోంది," అని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు.

ఈ సందర్భంగా నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి మాట్లాడుతూ, మిషన్ దృక్కోణంలో ఈ ఒప్పందాలు మూడు కీలక ఫలితాలను అందించాయని అన్నారు. అవి గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ కోసం జపాన్‌తో మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరచి పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగించడం... భారతీయ పరిశుద్ధ ఇంధనాలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌కు విశ్వసనీయ సరఫరాదారుగా నిలవడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రంగం వాణిజ్యపరంగా పురోగతి సాధిస్తున్నదని చాటడం... అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి, సరఫరాల కోసం సమర్థమైన వ్యవస్థను సృష్టించడం అని శ్రీ సంతోష్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో జపాన్ ప్రభుత్వ ఎమ్ఈటీఐ ఉప మంత్రి శ్రీ టకేహికో మత్సువో ప్రసంగిస్తూ, పరిశుద్ధ ఇంధన రంగంలో భారత్-జపాన్ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంలో ఈ ఒప్పందం కీలకమైనదని పేర్కొన్నారు.

భారత్ నుంచి జపాన్‌కు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా, మిథనాల్ సరఫరా ఒప్పందాల్లో ఒకటిగా ఈ ఒప్పందం నిలుస్తుంది. ఇది పెరుగుతున్న భారత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థ వాణిజ్య పురోగతిని స్పష్టం చేయడమే కాకుండా, సైట్ కార్యక్రమం కింద స్థాపించిన ఉత్పత్తి సామర్థ్యాల దీర్ఘకాలిక డిమాండ్‌నూ బలపరుస్తుంది. భారత్ నుంచి తక్కువ కర్భన ఉద్గారాలు గల ఇంధనాల నిరంతర సరఫరాను నిర్ధారించడం ద్వారా ఈ భాగస్వామ్యాలు... జపాన్ ఇంధన పరివర్తన, ఇంధన భద్రతా లక్ష్యాలకూ దోహదం చేస్తాయి.

ఏసీఎంఈ గ్రూప్ ఈ ప్రాజెక్టు గురించిన సమగ్ర వివరాలను సమర్పించిన తర్వాత, ఇరు పక్షాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు... జపాన్ ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు... ఏసీఎంఈ గ్రూప్, ఐహెచ్ఐ కార్పొరేషన్, ఎంజీసీ అధినేతల సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

***


(रिलीज़ आईडी: 2280573) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi