రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దక్షిణ సైనిక దళం కమాండ్-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2026 3:02PM by PIB Hyderabad

   భారత దక్షిణ సైనిక దళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ (అతి విశిష్ట సేవా మెడల్‌-ఏవీఎస్ఎం, విశిష్ట సేవా మెడల్‌-వీఎస్ఎం గ్రహీత) ఈ రోజు 2026 జూలై 1) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ (ఏవీఎస్ఎం, ఎస్ఎం గ్రహీత) స్థానంలో ఆయన నియమితులయ్యారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అక్కడ శిక్షణానంతరం 1978 డిసెంబరులో 74వ సాయుధ దళంలో నియమితులయ్యారు. అటుపైన నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట, మార్గదర్శక రీతిలో సైనిక బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్నేళ్ల తన సేవా కాలంలో విభిన్న భౌగోళిక, కార్యాచరణ వాతావరణాల నడుమ విస్తృత శ్రేణి కమాండ్, స్టాఫ్, బోధన బాధ్యతలలో రాణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో “II కార్ప్స్” జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ, దళాన్ని వ్యూహాత్మకంగా నడిపించారు.

ఓ కార్యాచరణ ప్రాంతంలోని సాయుధ దళానికి, వ్యూహాత్మక స్వతంత్ర సాయుధ బ్రిగేడ్‌కు, ఒక పదాతిదళ విభాగానికి, పశ్చిమ సెక్టార్‌లోని ప్రముఖ ‘స్ట్రైక్ కార్ప్స్‌’కు ఈ జనరల్ ఆఫీసర్ నాయకత్వం వ్యవహరించారు. ఆయన నిర్వహించిన కీలక సిబ్బంది బాధ్యతలలో ఒక ‘స్ట్రైక్ కార్ప్స్‌’లో కల్నల్ మిలిటరీ సెక్రటరీగా, పశ్చిమ సెక్టార్‌లోని సాయుధ విభాగానికి కల్నల్ జనరల్ స్టాఫ్‌గా, ఒక ‘స్ట్రైక్ కార్ప్స్‌’కు బ్రిగేడియర్ క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా, ఒక ‘ఆపరేషనల్ కమాండ్‌’కు బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్‌గా, సాయుధ దళాల అదనపు డైరెక్టర్ జనరల్‌గా, ‘టెరిటోరియల్ ఆర్మీ’ డైరెక్టర్ జనరల్‌గా విశిష్ట సేవలందించారు. అంతేగాక ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీలో బోధకుడిగానూ పనిచేశారు.

భూటాన్‌ వెళ్లిన భారత సైనిక శిక్షణ బృందంలోనూ, అటుపైన అర్మేనియా, బెలారస్‌ల గుర్తింపు నేపథ్యంలో మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అండ్ మిలిటరీ అటాచీగా రెండుసార్లు పనిచేసిన అంతర్జాతీయ అనుభవం రాజేష్‌ పుష్కర్‌కు ఉంది. జాతీయ రక్షణ అకాడమీ నుంచి పట్టా పొందడంతోపాటు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా సాధించారు. సివిల్ విద్యాభ్యాసంలో భాగంగా ‘డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌’లో, ‘మేనేజ్‌మెంట్ స్టడీస్‌’లో మాస్టర్స్ సహా ‘డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌’లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాలు సాధించారు. సైన్యంలో ఆయన ప్రదర్శించిన కర్తవనిష్టకు గుర్తింపుగా ‘అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్‌ఎం), విశిష్ట సేవా పతకం (వీఎస్‌ఎం) సహా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసాపత్రం, మూడు ఆర్మీ కమాండర్ ప్రశంసపత్రాలు కూడా లభించాయి.

ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ ఇవాళ కమాండ్-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘సదరన్ కమాండ్ వార్ మెమోరియల్’ వద్ద వీరజవాన్లకు నివాళి అర్పించి, కమాండ్ ప్రధాన కార్యాలయం వద్ద గౌరవ వందనం స్వీకరించారు. విభిన్న ప్రాంతాల్లో, విభిన్న బాధ్యతలలో ప్రదర్శించిన అత్యున్నత స్థాయి కార్యాచరణ సంసిద్ధతను కొనసాగిస్తానని, సదరన్ కమాండ్ అచంచల నిబద్ధతను ఇనుమడింపజేస్తానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మెరుగైన సమన్వయం, స్వదేశీ సామర్థ్య అభివృద్ధి, పురోగమన సాంకేతిక పరిజ్ఞానాల సత్వర ఏకీకరణ ద్వారా దళాల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. భారత సైన్యంలోని అన్ని స్థాయులలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బంది సుసంపన్న సైనిక సంప్రదాయాలను కొనసాగిస్తూ, దేశ సేవలో అత్యున్నత కార్యాచరణ నైపుణ్య ప్రమాణాలను పాటిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2280117) సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil