శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని ‘సీఎస్ఐఆర్-ఐఐసీటీ’ ప్రాంగణంలో ₹44.46 కోట్లతో హాస్టల్‌ నిర్మాణానికి డాక్టర్ జితేంద్ర సింగ్ శంకుస్థాపన


ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు అత్యాధునిక పరిశోధన-అభివృద్ధి కేంద్రాలు ప్రారంభం

“భారత్‌ ఆర్థిక వృద్ధిలో తదుపరి దశకు సారథ్యం వహించేది వ్యవసాయ పరిశోధన-పరిశ్రమల భాగస్వామ్యమే”

“వ్యవసాయ పరిశోధన... వ్యర్థం నుంచి సంపద సృష్టించే సాంకేతికతలు… పరిశోధనల ఫలితాలు రైతులకు చేరువ కావడంతోపాటు రైతులు, అంకుర సంస్థలు.. ‘ఎంఎస్ఎంఈ’లకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి”

प्रविष्टि तिथि: 30 JUN 2026 5:41PM by PIB Hyderabad

వ్యవసాయ పరిశోధనలు-పరిశ్రమలకు మధ్య బలమైన భాగస్వామ్యం శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలతో అధిక విలువను సృష్టించడం ద్వారా భారత ఆర్థిక వృద్ధిలో తదుపరి దశకు సారథ్యం వహిస్తాయని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్‌లోని ‘సీఎస్ఐఆర్-ఐఐసీటీ’ ప్రాంగణంలో ఈ రోజు ₹44.46 కోట్లతో 200 మంది విద్యార్థులకు ఆధునిక వసతులతో హాస్టల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, నాలుగు అత్యాధునిక పరిశోధన-అభివృద్ధి కేంద్రాలను కూడా ప్రారంభించారు.

దేశ వ్యవసాయ రంగంలో అపార సామర్థ్యం ఉందని, దీన్ని ఇంకా పూర్తిస్థాయిలో మనం వినియోగించుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ శాస్త్రవిజ్ఞాన ప్రాధాన్యాలు పంటల మెరుగుదలకే పరిమితం కావడం లేదని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను, పంటల అవశేషాలను విలువైన ఉత్పత్తులుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన దిశగానూ ప్రభుత్వం ప్రాముఖ్యం ఇస్తున్నదని చెప్పారు. తద్వారా రైతులు, పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు అంది వస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లోని ‘సీఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) ప్రాంగణంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఫ్లోరోకెమికల్స్ కోసం అధునాతన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే, సిరిపురం చేనేత సముదాయం కోసం 500 ‘కేఎల్‌డీ’ వికేంద్రీకృత వ్యర్థజల శుద్ధి కర్మాగారాన్ని, పారిశ్రామిక రసాయనాల కోసం నిరంతర ప్రాసెసింగ్ వేదిక సహా సుస్థిర ఇంజనీరింగ్ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం చేశారు.

యువ పరిశోధకుల కోసం నివాస మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా ₹44.46 కోట్లతో హాస్టల్ సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. శాస్త్రవిజ్ఞాన నైపుణ్యాన్ని పారిశ్రామిక ఆవిష్కరణగా, ఆర్థిక విలువగా మార్చడానికి ప్రాధాన్యం పెరుగుతున్నదని ఈ సందర్భంగా అన్నారు. నేటి కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, సాంకేతిక భాగస్వామ్య సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘సీఎస్ఐఆర్-ఐఐసీటీ’ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి సహా ‘సీఎస్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్‌ వినయ్ కె.నందికూరి, ‘సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ’ డైరెక్టర్ డాక్టర్‌ ప్రకాష్ కుమార్, ‘సీఎస్ఐఆర్-నీరి’ డైరెక్టర్ డాక్టర్‌ ఎస్.వెంకట మోహన్, ‘సీడీఎఫ్‌డీ’ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ తదితరులు కూడా హాజరయ్యారు.

పరిశోధనలను ఆర్థిక విలువగా మార్చడంలో శాస్త్రవిజ్ఞాన సంస్థలు పరిశ్రమలతో చేయి కలపడం అత్యావశ్యకమని డాక్టర్‌ జితేంద్ర సింగ్ అన్నారు. భాగస్వామ్యాలతో నిమిత్తం లేని ప్రయోగశాలలకు నేటి కాలంలో తావుండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఆవిష్కరణలు, వాణిజ్యీకరణ తదితరాలను వేగిరపరచాలంటే పరిశ్రమలు, ‘ఎంఎస్ఎంఈ’లు, అంకుర సంస్థలు, సాంకేతిక భాగస్వామ్య సంస్థలతో జోడు కట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రస్తావిస్తూ- మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం నుంచి వ్యవసాయ వ్యర్థాల ఉత్పాదక వినియోగం దాకా మొత్తం విలువ వ్యవస్థలో శాస్త్రీయ పరిశోధన, విలువ జోడింపు, గ్రామీణ వ్యవస్థాపన, సుస్థిర పారిశ్రామిక వృద్ధికి కొత్త అవకాశాలు అందివస్తాయని ఆయన అన్నారు.

ఒక అద్భుత శాస్త్రవిజ్ఞాన రూపాంతరీకరణకు భారత్‌ ఒక సాక్ష్యంగా నిలుస్తోందని, జాతీయ ప్రగతికి కీలక చోదకాలుగా ఆవిష్కరణలు రూపొందుతున్నాయని మంత్రి అన్నారు. రక్షణ రంగ తయారీ, విమానయానం, అంతరిక్షం, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన ఇటీవలి విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ సాంకేతికతను అనుకరించే దేశం స్థాయి నుంచి వినూత్న ఆవిష్కరణలకు రూపుదిద్దగలదిగా పురోగమిస్తోందని చెప్పారు. ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక స్వావలంబన, ప్రపంచ పోటీతత్వం దిశగా విజ్ఞాన శాస్త్రం శక్తియుత సారథిగా ఆవిర్భవిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

శాస్త్రీయ పరిశోధనలు జాతీయ ప్రాధాన్యాలకు ఉపకరిస్తూనే, పరిశ్రమలతోపాటు సమాజానికి ఆచరణాత్మక పరిష్కారాలను అందించగలవని ‘సీఎస్ఐఆర్’ నిరంతరం నిరూపిస్తూనే ఉన్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు. ఆహార-వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపీడన బయోగ్యాస్‌ ఉత్పాదన, సంగ్రహిత కార్బన్ డయాక్సైడ్‌ను డైమిథైల్ ఈథర్‌గా మార్చడంలో ఈ సంస్థ ఇటీవల వినూత్న సాంకేతికతలను ఆవిష్కరించిందని గుర్తుచేశారు. కాలుష్య రహిత ఇంధనం, వర్తుల ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నుంచి విలువైన జాతీయ వనరుల రూపకల్పన దిశగా ఇనుమడిస్తున్న భారత్‌ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి సాంకేతికతలు జాతీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా పారిశ్రామిక ప్రగతికి, పర్యావరణ సుస్థిరతకు కొత్త బాటలు వేస్తాయని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో నేడు ప్రారంభించిన ఫ్లోరోకెమికల్స్ సంబంధిత ఆధునిక పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఒక వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా ఆయన అభివర్ణించారు. ఫ్లోరినేషన్ సాంకేతికతలో భారత దేశీయ సామర్థ్యాలను ఇది గణనీయంగా బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ-ప్రత్యేక-ఎలక్ట్రానిక్ రసాయనాలు, శీతలీకరణ-అధునాతన పదార్థాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని మంత్రి అన్నారు. దిగుమతి పరాధీనత తగ్గడంతోపాటు రక్షణ, ఎలక్ట్రానిక్స్, అంతరిక్షం వంటి కీలక రంగాలకు మద్దతునిస్తూ సాంకేతిక స్వావలంబన సాకారంపై దేశ సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు.

శాస్త్ర విజ్ఞానసాంకేతికత విభాగం (డీఎస్‌టీ) సహకారంతో సిరిపురం చేనేత క్లస్టర్ కోసం అభివృద్ధి చేసిన 500 కేఎల్‌డీ వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి కేంద్రం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. శాస్త్రీయ ఆవిష్కరణలు సాంప్రదాయ పరిశ్రమలనుస్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రత్యక్షంగా బలోపేతం చేసే తీరుకు ఈ ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని ఆయన అన్నారు. స్వదేశీ సాంకేతికతతో తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఈ శుద్ధి ప్రక్రియ వల్ల కాలుష్యం తగ్గుతుందనిభూగర్భ జలాల సంరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నీటిని తిరిగి ఉపయోగించుకునే వీలుంటుందని… పర్యావరణహితమైన వస్త్ర ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. పారిశ్రామిక వృద్ధిపర్యావరణ బాధ్యత రెండూ కలిసి ముందుకు సాగొచ్చన్న విషయాన్ని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

కంటిన్యూయస్ ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్’ గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ… రసాయన, ఔషధ పరిశ్రమల భవిష్యత్తుకు ఇటువంటి నిరంతర ఉత్పాదక సాంకేతికతలు దిక్సూచిగా నిలుస్తాయని అన్నారు. ఇవి భద్రతను మెరుగుపరచడమే కాకుండా ఉత్పాదకతను పెంచుతాయని, ఉత్పత్తుల్లో నాణ్యతాపరమైన స్థిరత్వాన్ని కాపాడుతూ, పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమలు ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఉత్పాదక విధానాలను అవలంబించడానికి ఈ సదుపాయం ఎంతగానో సహాయపడుతుందని మంత్రి చెప్పారు. ప్రయోగశాలల్లో జరిగే ఆవిష్కరణలను వాణిజ్యపరంగా లాభదాయకమైన సాంకేతికతలుగా మరింత వేగంగా మార్చడానికి ఇది దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

నేడు ప్రారంభించిన కార్యక్రమాల్లో 'సుస్థిర ఇంజనీరింగ్ సముదాయం' (సస్ట్‌ఈసీ) భవిష్యత్తుపై అత్యంత దృష్టి సారించే ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. చక్రీయ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ సాగిస్తున్న ప్రయాణాన్ని ఈ సదుపాయం తెలియజేస్తోందని ఆయన అన్నారు. వ్యర్థ ప్లాస్టిక్‌లు, జీవ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, పారిశ్రామిక ఉప-ఉత్పత్తులను ఇంధనాలు, హైడ్రోజన్, అధునాతన పదార్థాలు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా ఈ సముదాయం సరికొత్త మార్గాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణను, పారిశ్రామిక పోటీతత్వాన్ని, ఆర్థిక విలువను ఏకకాలంలో ఎలా పెంపొందించగలవో ఇది నిరూపిస్తోందని చెప్పారు. స్వదేశీ శాస్త్రీయ పరిష్కారాల ద్వారా 'నెట్ జీరో' లక్ష్యాన్ని సాధించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇటువంటి సాంకేతికతలు మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలను పారిశ్రామిక వినియోగానికి అనుగుణంగా మార్చడమే ఈ నాలుగు సదుపాయాలను అనుసంధానించే ప్రధాన సూత్రమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఫ్లోరోకెమికల్స్, స్వచ్ఛ తయారీ, పర్యావరణ సాంకేతికతలు లేదా సుస్థిర ఇంజనీరింగ్ వంటి ఏ రంగంలోనైనా స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ప్రాజెక్ట్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వీటిని ముఖ్యంగా అంకురాలు, ఎంఎస్ఎంఈలు, నవ పారిశ్రామికవేత్తలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు మద్దతుగా నిలిచేలా రూపొందించినట్లు చెప్పారు. శాస్త్రీయ మానవ వనరులకు అసలైన కొలమానం కేవలం పరిశోధనా పత్రాల ప్రచురణ మాత్రమే కాదని.. ఉపాధిని సృష్టించే, భారతీయ పరిశ్రమలను బలోపేతం చేసే, సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచే సాంకేతికతలను అందించడమేనని ఆయన స్పష్టం చేశారు.

సీఎస్ఐఆర్-ఐఐసీటీ’లో దాదాపు 70 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో కలిపి మొత్తం 90 మంది శాశ్వత సిబ్బందిని ఇటీవల నియమించుకోవడాన్ని కేంద్ర మంత్రి స్వాగతించారు. శాస్త్రీయ నైపుణ్యాలు కలిగిన మానవ వనరులపై పెట్టే పెట్టుబడులకు అనుగుణంగా, అంతర్జాతీయ స్థాయి పరిశోధనా మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొత్త హాస్టల్ భవన సముదాయం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో దేశానికి అవసరమైన శాస్త్రీయ నాయకులను తీర్చిదిద్దడానికి, పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి, యువ పరిశోధకులు స్వేచ్ఛగా సరికొత్త ఆవిష్కరణలు చేసే వాతావరణాన్ని సృష్టించడానికి నాణ్యమైన వసతి సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వంటి కార్యక్రమాలతో పాటు డీప్ టెక్నాలజీస్‌కు అందిస్తున్న విస్తృత మద్దతు ద్వారా దేశంలో ఒక సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం సృష్టిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, అంకురాలు, పరిశ్రమలు అన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకోగల సాంకేతికతలను అభివృద్ధి చేస్తాయని ఆయన అన్నారు. భారతీయ ప్రయోగశాలలు ప్రపంచ శాస్త్రీయ పరిశోధనలకు నాయకత్వం వహించాలని, భారతీయ పరిశ్రమలు అత్యంత విలువైన సాంకేతికతలను ఉత్పత్తి చేయాలన్న ఆయన…  దేశ ఆవిష్కరణలు ప్రపంచ సవాళ్లకు సరైన పరిష్కారాలను అందించాలనేదే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

సీఎస్ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బందిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. పరిశ్రమలతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకులుగా నిలవాలని, ప్రయోగశాలలో పుట్టే ప్రతి అద్భుతమైన ఆవిష్కరణ మార్కెట్లోకి చేరేలా చూడాలని ఆయన వారిని కోరారు. పరిశోధనలను వ్యాపారాలుగా, వ్యాపారాలను ఆర్థిక వృద్ధిగా, ఆవిష్కరణలను సామాన్యుడి మెరుగైన జీవన ప్రమాణాలుగా మార్చడంలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ నిరంతరం అగ్రగామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా ప్రపంచ శాస్త్రీయ రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకునే ప్రయాణంలో ఈ సంస్థ తనదైన ముద్ర వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

***


(रिलीज़ आईडी: 2279540) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil