ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఆరోగ్య యాప్ అయిన 'ఆరోగ్య సేతు 2.0'ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా

ఆరోగ్య సేవలను పొందేందుకు ఏకైక పౌర కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేయనున్న ఆరోగ్య సేతు 2.0

వ్యక్తులు, కుటుంబాల కోసం ఒక 'వ్యక్తిగత ఆరోగ్య రికార్డు'గా పనిచేయనున్న ఆరోగ్య సేతు 2.0

ఏబీడీఎం సేవల జాతీయస్థాయి అవగాహన, వినియోగాన్ని పెంచే ఒక ప్లాట్‌ఫామ్‌గా కూడా ఉపయోగపడనున్న ఈ యాప్

प्रविष्टि तिथि: 29 JUN 2026 4:49PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మూలాలను గుర్తించటం (కాంటాక్ట్ ట్రేసింగ్), పొంచి ఉన్న ముప్పులపై అవగాహన కల్పించటం, ప్రజా భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం 'ఆరోగ్య సేతు' యాప్‌ను ఒక జాతీయ ప్రజా ప్రయోజన డిజిటల్ సాధనంగా అభివృద్ధి చేసింది. మహమ్మారి నివారణ సాధనంగా దీని పాత్ర ముగిసిన తర్వాత భారత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో దీనిని దీర్ఘకాలిక అవసరాల కోసం ఉపయోగించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) దీనిని జాతీయ ఆరోగ్య అధికార సంస్థకు (ఎన్‌హెచ్ఏ) అధికారికంగా బదిలీ చేసింది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఇప్పుడు 'వ్యక్తిగత ఆరోగ్య రికార్డు' (పీహెచ్ఆర్), పౌరులకు ఉపయోగపడే డిజిటల్ ఆరోగ్య అప్లికేషన్‌గా సరికొత్త రూపంలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా పునర్నిర్మించిన 'ఆరోగ్య సేతు 2.0' యాప్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు దిల్లీలో ప్రారంభించారు.

వ్యూహాత్మక ఆరోగ్య సేతు 2.0

ఏబీడీఎం కింద భారతదేశపు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇందులో ప్రాథమికమైన 'ఏబీహెచ్ఏ' వంటి సేవలు ఇప్పుడు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ డిజిటల్ సౌకర్యాలపై ప్రజల్లో అవగాహనను పెంచడానికి, వారు వీటిని విస్తృతంగా వినియోగించుకునేలా చేయడానికి సరళమైన, నమ్మకమైన, అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఒక ప్లాట్‌ఫాం అవసరం ఎంతైనా ఉంది.

ఈ అవసరాన్ని తీరుస్తూ ఆరోగ్య సేతు 2.0 కింది విధాలుగా ఉపయోగపడుతుంది:

  • ఆరోగ్య సేవలను పొందేందుకు ఏకైన పౌర కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది.

  • వ్యక్తులు, కుటుంబాల కోసం ఒక నమ్మకమైన 'వ్యక్తిగత ఆరోగ్య రికార్డు'గా ఉపయోగపడుతుంది.

  • ఏబీడీఎం సేవల జాతీయస్థాయి అవగాహన, వాటి వినియోగాన్ని పెంచే ఒక వేదికగా నిలుస్తుంది. 

దాదాపు 20 కోట్ల డౌన్‌లోడ్‌లతో ఇప్పటికే ఉన్న భారీ సంఖ్యలోని వినియోగదారులతో పాటు కొత్తగా వస్తున్న వారి కలయికతో ఈ యాప్ ప్రజల్లో డిజిటల్ సేవల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది అన్ని ప్రాంతాల్లో డిజిటల్ ఆరోగ్య సేవల వాడకాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే కాకుండా ‘ఏబీడీఎం’ను మన దైనందిన ఆరోగ్య సంరక్షణ అవసరాలలో ఒక భాగంగా మారుస్తుంది.

ఆరోగ్య సేతు 2.0లోని ముఖ్యమైన ఫీచర్లు:

'ఏబీహెచ్ఏ' ఐడీల సృష్టి, ఆరోగ్య రికార్డుల నిర్వహణ, ఎలాంటి అవాంతరాలు లేని డిజిటల్ నమోదు కోసం 'స్కాన్, షేర్' వంటి ఏబీడీఎం సేవల సౌకర్యం ఇందులో ఉంది.

  • పీడీఎఫ్ లేదా ఇమేజ్ రూపంలో ఉన్న ల్యాబ్ రిపోర్టులు వంటి వైద్య ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికతను ఉపయోగిస్తూ రోగుల పాత వైద్య చరిత్ర ఆధారంగా ఒక వ్యక్తిగతీకరించిన (Personalized) హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ను అందిస్తుంది.

  • వినియోగదారులు తమ శరీరంలోని ముఖ్యమైన సంకేతాలు, వ్యక్తిగతీకరించిన రిమైండర్లు, వైద్యారోగ్య లక్ష్యాల ట్రాకింగ్, చేతికి పెట్టుకునే స్మార్ట్ పరికరాల అనుసంధానం ద్వారా అడుగులు, క్యాలరీలు, గుండె కొట్టుకునే వేగం, గ్లూకోజ్ స్థాయిలను సులభంగా పర్యవేక్షించుకోవచ్చు. 

పీఎం-జేఏవై వ్యాలెట్: ఈ ఫీచర్ ద్వారా మొత్తం బీమా పాలసీ బ్యాలెన్స్, వినియోగించిన మొత్తం, కుటుంబ సభ్యుల వారీగా ఖర్చయిన మొత్తం వంటి ఆరోగ్య సంరక్షణ కవరేజ్ వివరాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా మిగిలి ఉన్న కవరేజ్ మొత్తాన్ని ట్రాక్ చేయడానికి, భవిష్యత్తు వైద్య అవసరాలను మెరుగ్గా ప్రణాళిక చేసుకోవటానికి సహాయపడుతుంది. 

సీఏపీఎఫ్: ఈ ఫీచర్ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) పాలసీకి సంబంధించిన వివరాలను చూపిస్తుంది. ఇందులో పాలసీ సమాచారం, ఆ పాలసీ పరిధిలోకి వచ్చే కుటుంబ సభ్యుల జాబితా, క్లెయిమ్ రీయింబర్స్‌మెంట్ మొత్తం వంటి వివరాలు ఉంటాయి.

ప్రైవేట్ బీమా వివరాలు: ప్రైవేట్ ఆరోగ్య బీమాకు సంబంధించిన వ్యాలెట్ బ్యాలెన్స్, క్లెయిమ్ వివరాలను ఇందులో చూసుకోవచ్చు.

అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందేలా చూడటం కోసం మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులను తెలుసుకోవచ్చు.. ‘ఈ-రక్తకోష్' ద్వారా ఏ బ్లడ్ బ్యాంకులో ఏ గ్రూప్ రక్తం అందుబాటులో ఉందో తక్షణమే తెలుసుకోవచ్చు. దీనితో అంబులెన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

స్కాన్, షేర్ ఫీచర్: ఎలాంటి అవాంతరాలు లేకుండా వైద్య సేవలను పొందేందుకు వీలుగా యాప్ ద్వారా ప్రొఫైల్ వివరాలను పంచుకోవడం, చెల్లింపులు చేయడం, వైద్యారోగ్య రికార్డులను పంచుకోవటం వంటి పనులను ఈ ఫీచర్ సులభతరం చేస్తుంది.

కుటుంబ సభ్యుల ప్రొఫైల్ నిర్వహణ: ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ తల్లిదండ్రులు, జీవితభాగస్వామి లేదా పిల్లల ప్రొఫైల్‌లను ఒకే అకౌంట్ కింద నిర్వహించుకోవచ్చు. దీనివల్ల ప్రతి ఒక్కరికీ విడివిడిగా లాగిన్ అవ్వాల్సిన అవసరం తప్పుతుంది.

మందుల రిమైండర్: డాక్టర్లు సూచించిన సమయానికి క్రమం తప్పకుండా మందులు వేసుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. మందుల చిట్టీ ఫొటో ద్వారా లేదా నేరుగా మందుల వివరాలను నమోదు చేయవచ్చు. ఏ రోజు ఏ సమయానికి ఎన్నిసార్లు మందులు వేసుకోవాలో తగిన మోతాదుతో సహా ఇందులో రిమైండర్లను సెట్ చేసుకోవచ్చు.

దగ్గరలోని ఆరోగ్య సేవలు: ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు జీపీఎస్ సహాయంతో తమకు సమీపంలో ఉన్న ఆసుపత్రులు, వైద్యులను కనుగొనచ్చు. దూరం ఆధారంగా (5 నుంచి 50 కిలోమీటర్ల వరకు) ఫిల్టర్ ఆప్షన్లను ఉపయోగించి ఆస్పత్రులు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, డాక్టర్ల వివరాలను తెలుసుకోవచ్చు.

పీఎం-జేఏవై అనుబంధ ఆసుపత్రుల అన్వేషణ: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పథకంతో ఈ ఫీచర్ అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా నగదు రహిత చికిత్స అందించే గుర్తింపు పొందిన ఆసుపత్రులను తెలుసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, స్పెషాలిటీ, పిన్‌కోడ్ లేదా ఆసుపత్రి పేరు ఆధారంగా ఫిల్టర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది. ఇది అర్హత కలిగిన ఆసుపత్రులను సులభంగా కనుగొనడానికి, ఉచిత లేదా రాయితీ వైద్య సేవలను పొందడానికి ప్రజలకు సహాయపడుతుంది.

మై కన్సెంట్: ఈ 'మై కన్సెంట్' ఫీచర్ వినియోగదారుల ఆరోగ్య సమాచార గోప్యతను కాపాడుతుంది. మీ ఆరోగ్య సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు ఆ అనుమతులను మీరే స్వయంగా నియంత్రించుకునేలా, నిర్వహించుకునేలా ఇది సహాయపడుతుంది. ఇప్పటివరకు వచ్చిన అభ్యర్థనలలో మీరు ఆమోదించినవి, పెండింగ్‌లో ఉన్నవి, తిరస్కరించినవి, గడువు ముగిసిన అనుమతుల (కన్సెంట్) వివరాలన్నింటినీ ఇందులో ట్రాక్ చేయొచ్చు. భారతదేశ డిజిటల్ ఆరోగ్య గోప్యతా నిబంధనల ప్రకారం వినియోగదారుని పూర్తి అనుమతి ఉంటేనే వివరాలు పంచుకునేలా ఇది చూసుకుంటుంది. 

 

***


(रिलीज़ आईडी: 2279189) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil