యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గాంధీనగర్‌లో చరిత్రాత్మక ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్ కాంస్య పతకం సాధించిన భారత బృందాన్ని అభినందించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
పూల్ స్టేజ్‌లో ఓటమి చవిచూడకుండా సరికొత్త చరిత్రను సృష్టిస్తూ తొలిసారి ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌లో కాంస్యం గెలిచిన భారత్
కాంస్య పతకంలో మెరుగైన భారత ఎఫ్‌ఐవీబీ ప్రపంచ ర్యాంకింగ్.. 60 నుంచి 42వ స్థానానికి చేరుకున్న పురుషుల జట్టు
మొదటిసారిగా ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత్.. దేశీయ ఈవెంట్ నిర్వహణ సామర్థ్యాలు మరింత బలోపేతం
प्रविष्टि तिथि:
29 JUN 2026 3:07PM by PIB Hyderabad
ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్-2026లో దేశానికి తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన భారత జట్టును ఇవాళ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అభినందించారు.
క్రీడాకారులకు, కోచింగ్ సిబ్బందికి, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ "ఈ పతకం చరిత్రాత్మకమైనది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రతి విజయం మరింత బాధ్యతను, అంచనాలను పెంచుతుంది. మన అథ్లెట్లు పూర్తి సామర్థ్యాన్ని చాటుకునేందుకు, అంతర్జాతీయ వేదికపై రాణించేందుకు సహకరించటమే ప్రభుత్వం చేపట్టే ప్రతి విధానం, ప్రతి పెట్టుబడి, ప్రతి ప్రయత్న లక్ష్యం" అని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
భారత్ కనబరిచిన అద్భుతమైన ప్రతిభను ప్రశంసిస్తూ, సొంత గడ్డపై చరిత్రాత్మక విజయాన్ని అందుకోవటం దేశంలో వాలీబాల్ స్థిరమైన వృద్ధిని సూచిస్తోందని, పెద్దఎత్తున అంతర్జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించగల భారత్ సామర్థ్యాన్ని నిరూపిస్తోందని కేంద్ర క్రీడా మంత్రి అన్నారు.
ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్, ఆసియాలోనే అత్యున్నత వార్షిక పురుషుల వాలీబాల్ పోటీ. ఈ టోర్నమెంట్‌కు 2026లో భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వటం విశేషం. ఇది దేశ క్రీడా చరిత్రలో మరో కీలక అధ్యాయాన్ని జోడించింది.
14 మంది క్రీడాకారులతో కూడిన భారత జాతీయ జట్టు, కెప్టెన్ జెరోమ్ వినీత్ చార్లెస్, సెర్బియాకు చెందిన కోచ్ డ్రాగన్ మిహైలోవిక్ ఇవాళ గాంధీనగర్‌లో కేంద్ర క్రీడా మంత్రిని కలిశారు.
దీర్ఘకాలిక ప్రణాళికలు, అకాడమీల అభివృద్ధి, ప్రతిభావంతులను గుర్తించటం, క్రీడా సైన్స్ విస్తృతమైన వినియోగం, అథ్లెట్ల సంక్షేమం, వారికి అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన గుర్తింపును కల్పించటం ద్వారా మోదీ ప్రభుత్వం బలమైన క్రీడా వ్యవస్థను ఏర్పరుస్తోందని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ క్రీడాకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విభిన్న క్రీడా విభాగాల్లో స్థిరమైన అత్యుత్తమ ప్రదర్శనను కనబరచటం, ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దేశాల సరసన భారత్‌ను నిలిపేందుకు దేశ క్రీడా విజన్ దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
భారత వాలీబాల్ భవిష్యత్తుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, జట్టు సాధించిన ఈ చరిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని, అన్ని స్థాయిల్లో క్రీడా అభివృద్ధికి కొత్త ఊపును అందిస్తుందని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పూల్ దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా నిలవటమే కాకుండా, ఆసియాలోని కొన్ని బలమైన జట్లకు పోటీగా స్థిరత్వాన్ని, పట్టుదలను ప్రదర్శించింది.
మూడో స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో 3-1 తేడాతో బహ్రెయిన్‌ను ఓడించిన జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్ చరిత్రలోనే భారతదేశానికి తొలి పతకాన్ని, అత్యుత్తమ ముగింపును అందించింది.
జట్టు తరపున కెప్టెన్ జెరోమ్ వినీత్ చార్లెస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక పతకాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు.
"ప్రభుత్వం అందించిన నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి వసతులు, చక్కని శిక్షణా వాతావరణం, కోలుకోవటానికి చేసిన ఏర్పాట్లు, మొత్తం సహాయ సహకారాలు, మేము ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తిగా ఆట మీదే దృష్టి కేంద్రీకరించేలా చేశాయి" అని ఆయన తెలిపారు.
"ఈ చరిత్రాత్మక పతకం కేవలం మాది మాత్రమే కాదు, టోర్నమెంట్ వీక్షించేందుకు స్టేడియానికి తరలివచ్చి మాకు మద్దతుగా నిలిచిన ప్రతి భారతీయుడిది. వారు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రతి పాయింట్ కోసమూ పోరాడేలా మాలో పట్టుదలను, శక్తిని నింపింది" అని చెప్పారు.
భారతీయ క్రీడల పట్ల ప్రభుత్వానికున్న దీర్ఘకాలిక దార్శనికతను చీఫ్ కోచ్ డ్రాగన్ మిహైలోవిక్ ప్రశంసించారు. అంతర్జాతీయ క్రీడా రంగంలో భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "భారతీయ క్రీడా రంగం ప్రోత్సాహకర దిశలో పయనిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రణాళికలు, పెట్టుబడులు, క్రీడాకారుల మద్దతు వ్యవస్థలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నత స్థాయి క్రీడలకు సరిపోయేలా ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగితే ప్రతి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లోనూ భారత్ తప్పకుండా పతకాల పీఠంపై నిలుస్తుందనే నమ్మకం నాకుంది" అని తెలిపారు.
కాంస్య పతకం ద్వారా లభించిన విలువైన ఎఫ్‌ఐవీబీ వరల్డ్ ర్యాంకింగ్ పాయింట్లతో భారత పురుషుల వాలీబాల్ జట్టు 18 స్థానాలు మెరుగుపరచుకుని 60వ ర్యాంకు నుంచి 42వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ వాలీబాల్ వేదికపై భారతదేశ గుర్తింపును ఇది మరింత పెంచింది.
***
(रिलीज़ आईडी: 2279185)
आगंतुक पटल : 4