ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జూన్ 29న 16వ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి సదస్సును నిర్వహించనున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా అధ్యక్షతన 16వ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి సదస్సు

ఎన్‌హెచ్‌ఎం-ఎస్‌డీజీ లక్ష్యాలు, ప్రాధాన్యతలు, ఆహార, ఔషధ సంస్కరణలు, అనుబంధ ఆరోగ్య సేవలపై చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 27 JUN 2026 11:20AM by PIB Hyderabad

 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో  జూన్ 29న  16వ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి సదస్సును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది.  సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రులు శ్రీమతి అనుప్రియ పటేల్, శ్రీ ప్రతాపరావు జాదవ్ హాజరుకానున్నారు.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులను, పార్లమెంటు సభ్యులను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులను, ప్రభుత్వేతర సభ్యులను, ప్రముఖ నిపుణులను ఈ సదస్సు ఒకచోటకి చేర్చుతుంది. ఇందులో ఆరోగ్య రంగానికి సంబంధించిన కీలక విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించటంతో పాటు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ ఏడాది నిర్వహించే సదస్సులో "జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) - ఎస్‌డీజీ లక్ష్యాలు, ప్రాధాన్యతలు", "ఆహార, ఔషధ సంస్కరణలు", "అనుబంధ ఆరోగ్య సేవలు" ఇతివృత్తంతో సాగే అంశాలపై సమావేశాలు దృష్టి సారిస్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలను సమీక్షించటం, ఉత్తమ పద్ధతులను పంచుకోవటం, సవాళ్లను గుర్తించటం, దేశవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరిచేందుకు సమన్వయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించటమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత సలహా సంస్థ. ఈ మండలి వైద్య, ప్రజారోగ్య రంగాలకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాల అమలును సమీక్షిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది.

ఆరోగ్య రంగంలో సహకార సమాఖ్య విధానాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు కీలక సంస్థాగత వేదికగా పనిచేస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు, యూటీల మధ్య నిర్మాణాత్మక చర్చలు, విధానపరమైన సంప్రదింపులకు ఇది వేదికలా నిలుస్తుంది దీని ద్వారా ప్రజారోగ్య కార్యక్రమాల ప్రణాళిక, అమలులో మరింత సమన్వయం సాధించేందుకు వీలవుతుంది.

 

***

 

(రిలీజ్ ఐడి: 2278531) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Punjabi , Gujarati , Tamil