సహకార మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లో “భారత్ టాక్సీ” పేరిట సహకార టాక్సీ సేవకు జూన్ 27న కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా శ్రీకారం
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ‘సహకారంతో స్వావలంబన’ ప్రాతిపదికగా ‘సారథే యజమాని’ ప్రాధాన్యంతో సమష్టి యాజమాన్యం ద్వారా డ్రైవర్లకు ఆర్థిక సాధికారత సాకారం
గుజరాత్‌లో ఇప్పటిదాకా 1.5 లక్షల మందికిపైగా డ్రైవర్లు.. 7 లక్షల మందికిపైగా వినియోగదారులు ‘భారత్ టాక్సీ’లో చేరగా నిత్యం 3,500కు ట్రిప్పులు పూర్తవుతున్నాయి
గుజరాత్‌లోని 14 ప్రధాన నగరాల్లో సేవల సౌలభ్యం.. వచ్చే నెలాఖరులోగా రాష్ట్రమంతటా విస్తరించాలన్నది లక్ష్యం
ఈ కార్యక్రమానికి హాజరు కానున్న 4,000 మందికి పైగా డ్రైవర్లు.. సహకార ఆధారిత రవాణా నమూనా విజయం
సాకారం కానుంది
ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లకు వాటా ధ్రువీకరణ పత్రాల ప్రదానం... సహకార ఆధారిత యాజమాన్య విధానం మరింత బలోపేతం
प्रविष्टि तिथि:
26 JUN 2026 8:31PM by PIB Hyderabad
దేశంలోనే తొలిసారిగా “భారత్ టాక్సీ” పేరిట గుజరాత్‌లో సహకార ఆధారిత టాక్సీ సేవలందించే సహకార సంఘానికి కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా జూన్ 27న ప్రారంభోత్సవం చేస్తారు. ఈ మేరకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ‘భారత్ టాక్సీ’ విధానాన్ని 2025 డిసెంబరులో లాంఛనంగా ప్రారంభించారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశత ‘'సహకారంతో స్వావలంబన’ దార్శనికతను రవాణా-చలనశీలత రంగానికి విస్తరించే దిశగా ఇదొక కీలక ఘట్టం కానుంది. ‘భారత్ టాక్సీ’ సహకార సూత్రాధారిత డిజిటల్ రవాణా వేదిక. ‘సారథే యజమాని’ భావనకు ఇది వాస్తవ రూపమిస్తుంది. ఈ విధానం కింద టాక్సీ డ్రైవర్లు కేవలం సేవా ప్రదాతలుగానే కాకుండా ఈ వేదిక ద్వారా భాగస్వాములు, యజమానులుగా మారుతారు. తద్వారా ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, యాజమాన్య ప్రయోజనాలు వారి సొంతమవుతాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూతాని, వ్యవసాయ- రైతు సంక్షేమ, సహకారం పశుసంవర్ధక, గోవుల పెంపకం, మత్స్య, ప్రోటోకాల్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి శ్రీ జితుభాయ్ సావ్జీభాయ్ వాఘాని సహా సహకార రంగంలోని సీనియర్ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ‘భారత్ టాక్సీ’తో ముడిపడిన 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
భారత్ టాక్సీ భారత తొలి డ్రైవర్-యాజమాన్య రవాణా సేవ ప్రదాన సహకార సంస్థ. ఇది సహకార సూత్రాల ప్రాతిపదికగా ‘సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ ద్వారా రూపొందిన ఒక వేదిక. దేశంలోని 8 ప్రధాన సహకార సంస్థలు- ‘ఎన్‌సీడీసీ, జీసీఎంఎంఎఫ్ (అమూల్), ఎన్‌డీడీబీ, నాఫెడ్, ఇఫ్కో, క్రిభ్‌కో, నాబార్డ్, ఎన్‌సీఈఎల్’ మద్దతుతో ఇది ‘సారథే యజమాని’ భావనకు రూపం ఏర్పడుతుంది. ఈ విధానం కింద టాక్సీ డ్రైవర్లు సేవా ప్రదాతలుగానే కాకుండా భాగస్వాములుగా, యజమానులుగానూ రూపొందుతారు. తద్వారా ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత సహా యాజమాన్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను ధ్రువీకరణ పత్రాలతో సత్కరిస్తారు. అలాగే, వివిధ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు.
దేశవ్యాప్త సహకార ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గుజరాత్ రాష్ట్రం ‘భారత్ టాక్సీ’ విస్తరణలోనూ గణనీయ ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా గల 7 లక్షల మంది డ్రైవర్లలో గుజరాత్ నుంచి 1.5 లక్షల మందికి పైగా ఇందులో చేరారు. ఇక దేశమంతటా 37 లక్షల మందికి పైగా వినియోగదారులు ‘భారత్ టాక్సీ’ సేవలను వినియోగించుకుంటున్నారు.
గుజరాత్‌లోని 14 ప్రధాన నగరాలు- అహ్మదాబాద్, సూరత్, ద్వారక, వడోదర, రాజ్‌కోట్, సోమనాథ్, వల్సాద్, ఆనంద్, జామ్‌నగర్, భావ్‌నగర్, నడియాడ్, జునాగఢ్, మెహసానా, అమ్రేలిలలో ‘భారత్ టాక్సీ’ ప్రారంభమవుతుంది. వచ్చే నెలాఖరులోగాఈ రాష్ట్రంతటా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నారు.
బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002 కింద ‘భారత్ టాక్సీ’ నమోదు కాగా, 2025 జూన్ 6న ప్రారంభమైంది. ఈ వేదిక ‘జీరో-కమీషన్’ పద్ధతిలో పనిచేస్తుంది.. ఈ సేవల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా డ్రైవర్లకే గరిష్ఠ ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా డ్రైవర్లకు బీమా, రుణాలు, పెన్షన్ సహా వివిధ ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల ప్రయోజనం కూడా అందుతుంది. వినియోగదారుల కోసం గుజరాత్ పోలీసుల సహకారంతో రద్దీ రహిత ధరల విధానం సహా సురక్షిత, విశ్వసనీయ ప్రయాణానికి భారత్ టాక్సీ భరోసా ఇస్తుంది. ప్రయాణికులు తమ సౌకర్యం మేరకు బైక్, ఆటో, కారు వంటి వివిధ రవాణా సాధనాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు.
దేశ రవాణా రంగంలో సహకార ఆధారిత ప్రగతి, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత దిశగా భారత్ టాక్సీ ఓ వినూత్న నమూనా. రవాణా రంగంలో సార్వజనీనత, స్వావలంబనలో ఓ కొత్త అధ్యాయం లిఖిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు, ప్రధాన నగరాలన్నిటికీ ఈ విధానం విస్తరణను ‘భారత్ టాక్సీ’ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సహాయ కేంద్రాల ఏర్పాటు, డ్రైవర్లకు మరింత సామాజిక భద్రత, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలతో అనుసంధానం ద్వారా సమ్మిళిత-సహకారాధారిత రవాణా వ్యవస్థను ఆవిష్కరించాలని కృతనిశ్చయంతో ఉంది.
***
(रिलीज़ आईडी: 2278321)
आगंतुक पटल : 10