రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశీయ ఆధునిక గగనతల సంచార నిఘా-నియంత్రణ వ్యవస్థ ‘నేత్ర’ వినియోగంపై భారత వైమానిక దళానికి తుది అనుమతి

प्रविष्टि तिथि: 25 JUN 2026 6:08PM by PIB Hyderabad

   రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఈ రోజు ఓ కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ మేరకు దేశీయ ఆధునిక గగనతల సంచార నిఘా-నియంత్రణ వ్యవస్థ ‘నేత్ర’ నిర్వహణ-వినియోగంపై భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) తుది అనుమతి (ఎఫ్‌ఓసీ) ధ్రువీకరణనిచ్చింది. గగనతలంలో పటిష్ట నిఘా, పరిస్థితులపై తక్షణ అవగాహన, యుద్ధ నిర్వహణ సామర్థ్యం గణనీయ మెరుగుదల లక్ష్యంగా ‘ఐఏఎఫ్’, ‘డీఆర్‌డీఓ’ సహా అనుబంధ పరిశ్రమల సన్నిహిత సహకారంతో ఈ వ్యవస్థను దేశీయంగా రూపొందించారు. దీని రూపకల్పన కోసం 2017లో ప్రాథమిక నిర్వహణానుమతి (ఐఓసీ) ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సంపూర్ణ అనుమతి దఖలు పడింది. అత్యాధునిక ఏరోస్పేస్-రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వావలంబన దిశగా భారత్‌ ప్రస్థానంలో ఇదొక కీలక మలుపు.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ‘ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి’ అధ్యక్షత వహించారు. ‘ఎయిర్ చీఫ్ మార్షల్’ (రిటైర్డ్‌) ఆర్.కె.ఎస్.భదౌరియా, డీఆర్‌డీఓ పూర్వ చైర్మన్ డాక్టర్ ఎస్.క్రిస్టఫర్, ‘ఐఏఎఫ్’ ప్రస్తుత, రిటైర్డ్ సీనియర్ అధికారులు, ‘సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్ (సీఏబీఎస్‌) అవుట్‌స్టాండింగ్ సైంటిస్ట్ అండ్‌ డైరెక్టర్ శ్రీమతి పి.సంధ్య, ‘అవుట్‌స్టాండింగ్ సైంటిస్ట్-చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌వర్దీనెస్) శ్రీ ఎ.పి.వి.ఎస్.ప్రసాద్, ‘నేత్ర ఎఫ్‌ఓసీ’ సైంటిస్ట్‌ ‘జి’ అండ్ హెడ్‌ శ్రీ ఎ.ఎస్.కుమారన్, ‘డీఆర్‌డీఓ’లోని ఇతర సీనియర్ అధికారులు, పారిశ్రామిక భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి ప్రసంగిస్తూ- స్వదేశీ నిఘా, అప్రమత్తత వ్యవస్థ ‘నేత్ర’ ‘ఎఫ్‌ఓసీ’ని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ దాడుల సమయంలో ఈ వ్యవస్థ నిర్వహణాత్మక వినియోగం, విశ్వసనీయతను ఆయన ప్రస్తావించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ- నానాటికీ మారే యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పుల ద్వారా ఈ వ్యవస్థను సానుకూలం చేసుకోగల సౌలభ్యం ఉందని ఆయన గుర్తుచేశారు. డీఆర్‌డీఓ, ఐఏఎఫ్,  పరిశ్రమ భాగస్వాముల మధ్య సమన్వయమే ఈ విజయానికి దోహదం చేసిందని హర్షం ప్రకటించారు.

అనంతరం ‘నేత్ర’ విజయ ప్రస్థానం గురించి డీఆర్‌డీఓ ఏరోనాటిక్స్ క్లస్టర్ విశిష్ట శాస్త్రవేత్త-డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె.రాజలక్ష్మి మీనన్ వివరించారు. కార్యక్రమ లక్ష్యాల సాధన సహా ‘ఐఏఎఫ్‌’కు ఆచరణాత్మక సమర్థ వ్యవస్థను సమకూర్చడంలో ఎదురైన సవాళ్లను, వాటి పరిష్కారం దిశగా తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ఆమె ప్రస్తావించారు. సిస్టమ్ ఇంజనీరింగ్ ప్రాధ్యాన్ని, ఫ్లైట్-టెస్టుల ప్రణాళిక, అమలులో అది సహాయపడిన తీరును కొనియాడారు.

డీఆర్‌డీఓ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌ సంబంధిత విశిష్ట శాస్త్రవేత్త-డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి.కె.దాస్ మాట్లాడుతూ- భాగస్వాములందరి మధ్య సంపూర్ణ సమన్వయమే ఈ ఘనతకు మూలస్తంభమని పేర్కొన్నారు. ‘నేత్ర ఏఈడబ్ల్యూ అండ్‌ సీ’ స్వయంసమృద్ధికి, ‘వికసిత భారత్’ వైపు ముందడుగుకు ఒక నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

కీలక పాత్రధారులపై ప్రశంసల జల్లు

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించిన సంస్థలు, యూనిట్లకు ప్రముఖులందరూ ప్రత్యేక ప్రశంసలు, అభినందనలు తెలిపారు. ‘నేత్ర’ వ్యవస్థను ఒక భావన దశ నుంచి ఆచరణాత్మక తుది అనుమతి స్థాయికి చేర్చడంలో ఈ భాగస్వాములందరి సహకారం అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు.

స్వదేశీ సామర్థ్య విస్తరణలో కీలక ఘట్టం

‘నేత్ర’ వ్యవస్థ విజయవంతంగా ఆచరణాత్మ వినియోగానికి సిద్ధం కావడమన్నది సాంకేతిక పరిజ్ఞానాల దేశీయీకరణపై డీఆర్‌డీఓ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రక్షణ రంగ వినూత్న  సేవల దిశగా ఆవిష్కరణలు సహా సామర్థ్య వికాసాన్ని ఇది స్పష్టం చేసింది. అలాగే, అంతిమ వినియోగదారులు (ఐఏఎఫ్‌), శాస్త్రవిజ్ఞాన సంస్థలు, రక్షణ ఉత్పాదన సంస్థల సమన్వయానికి ఇదొక ఉజ్వల ఉదాహరణగా నిలిచింది.

***


(रिलीज़ आईडी: 2277964) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil