గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
‘భారతదేశంలో బొగ్గు ద్రవ్య ఆస్తి ఖాతాల తయారీకి విధానపరమైన పద్ధతులు’ అంశంపై చర్చాపత్రం
నాడు పోస్టు చేయడమైనది:
24 JUN 2026 1:11PM by PIB Hyderabad
‘‘భారతదేశంలో బొగ్గు ద్రవ్య ఆస్తి ఖాతాల తయారీకి విధానపరమైన పద్ధతులు’’ పేరుతో ఓ చర్చాపత్రాన్ని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసింది. అంతర్జాతీయ గణాంక ప్రమాణంగా ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ ఆమోదించిన పర్యావరణ-ఆర్థిక అకౌంటింగ్ కేంద్రీయ వ్యవస్థ (ఎస్‌ఈఈఏ)కు అనుగుణంగా ఈ పత్రాన్ని రూపొందించారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఎస్ఈఈఏ విధానాన్ని 2018 నుంచి ఎంవోఎస్‌పీఐ అనుసరిస్తోంది. ఎన్విస్టాట్స్ ఇండియా సిరీస్, ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా ద్వారా బొగ్గు, ఇతర ఖనిజాలు, ఇంధన వనరుల భౌతిక ఆస్తుల లెక్కలను ఈ మంత్రిత్వ శాఖ క్రోడీకరిస్తోంది. దీని ఆధారంగానే మరో ముందడుగు వేస్తూ... ఖనిజాలు, ఇతర ఇంధన వనరుల కోసం ప్రయోగాత్మక ద్రవ్య మదింపు, ద్రవ్య ఆస్తి పద్దుల సంకలనాన్ని ప్రారంభించింది.
భారత దేశంలో ఉన్న సహజ వనరుల ఆర్థిక విలువను పర్యావరణ ఆస్తుల మదింపు అంచనా వేస్తుంది. ఇది తరిగిపోతున్న వనరుల వ్యయాన్ని లెక్కించేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే వనరుల వెలికితీత ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను లెక్కించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు వివిధ పర్యావరణ ఆస్తుల మధ్య పోలికలను సులభతరం చేస్తుంది. సుస్థిరమైన మైనింగ్ పద్ధతులను జాతీయ ఖనిజ విధానం-2019 తప్పనిసరి చేసింది. ఫలితంగా ఇలాంటి మదింపు ప్రక్రియ భారతదేశ విధానాలకు అనుసంధానమై ఉంటుంది.
చర్చాపత్రం గురించి
ఎస్ఈఈఏ కేంద్రీయ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం పునరుత్పాదకం కాని ఖనిజ, ఇంధన వనరుల ద్రవ్య మదింపునకు సంబంధించిన వివరణాత్మక విధానాన్ని ఈ చర్చాపత్రం అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు ప్రత్యామ్నాయ అంతర్జాతీయ పద్ధతులైన - జాతీయ పద్దుల్లో సహజ వనరులను కొలతకు సంబంధించిన ఓఈసీడీ (2025) కంపైలేషన్ గైడ్, వరల్డ్ బ్యాంక్స్ ఛేజింగ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ (సీడబ్ల్యూఓఎన్-2024), ఫిలిప్పీన్స్ ఆధారిత పద్ధతి (2024)లను క్రమపద్ధతిలో సమీక్షిస్తూ పోల్చింది. భారతదేశ జాతీయ గణాంక వ్యవస్థకు అత్యంత అనువైన విధానాన్ని ఎంచుకోవడానికి... భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా పద్ధతుల్లోని ప్రధానాంశాలను, వాటికి అవసరమయ్యే సమాచారాన్ని, లభ్యమయ్యే వనరులను ఈ పత్రం పరిశీలిస్తుంది. దీంతో పాటు 2015-16 నుంచి 2023-24 కాలానికి భారతదేశంలో బొగ్గు భౌతిక ఆస్తి పద్దులను కూడా ఈ పత్రం సమర్పించింది. దీనికోసం ఎన్విస్టాట్స్ ఇండియా-2024, ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా-2025 ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందించిన డేటాను ఉపయోగించుకుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో బొగ్గుకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా దీనినే నమూనా అధ్యయనానికి ఎంచుకున్నారు. దేశీయంగా సమృద్ధిగా అందుబాటులో ఉన్న ఇంధన వనరుగా భారత దేశ విద్యుదుత్పత్తిలో బొగ్గు ప్రధాన వాటాను కలిగి ఉంది. అలాగే ఉక్కు, సిమెంటు, రసాయనాలు లాంటి ఎన్నో కీలక పరిశ్రమలకు తోడ్పాటునందిస్తోంది. 2024-25లో 1,047.523 మిలియన్ టన్నుల ముడి బొగ్గును, 45.133 మిలియన్ టన్నుల లిగ్నైట్ ఉత్పత్తిని భారత్ సాధించింది. ఇది భారత దేశ ఇంధన భద్రతలో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యసాధనలో ఈ వనరుకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. అదే సమయంలో పునరుత్పాదకం కాని వనరు కావడంతో.. దీని సుస్థిర వినియోగానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీనివల్ల ద్రవ్య ఆస్తి మదింపు మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది.
ముఖ్యమైన ఫలితాలు, సిఫారసలు చేసిన పద్ధతి
సమీక్షించిన మూడు పద్ధతుల్లో భారతీయ నేపథ్యానికి అత్యంత అనువైనదిగా ఓఈసీడీ (2025) విధానాన్ని గుర్తించారు. విధానపరమైన కచ్చితత్వాన్ని కలిగి ఉండటం, ఎస్ఈఈఏ కేంద్రీయ వ్యవస్థ, జాతీయ పద్దుల వ్యవస్థ (ఎస్ఎన్ఏ-2025) ఆధారంగా రూపొందించడం, ప్రస్తుత భారత దేశ సమాచార మౌలిక సదుపాయాలకు ముఖ్యంగా ఎంఓఎస్‌పీఐ క్రోడీకరించిన జాతీయ పద్దుల గణాంకాలకు (ఎన్ఏఎస్) అనుగుణంగా ఉండటం వల్ల దీనిని అమలు చేయడం సులభం. ఈ విధానం జాతీయ పద్దుల మొత్తాల ఆధారంగా పనిచేస్తుంది. మిగులు విలువ పద్ధతి ద్వారా భవిష్యత్తు వనరుల అదనపు నికర రాబడిని అంచనా వేస్తుంది. దానికి నికర ప్రస్తుత విలువ (ఎన్‌పీవీ) విధానాన్ని వర్తింప చేస్తుంది.
నిపుణులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి సలహాలను, అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ఈ చర్చాపత్రాన్ని విడుదల చేశారు. దీనిపై వచ్చే స్పందనలు... భారతదేశ జాతీయ పద్దుల వ్యవస్థలో పునరుత్పాదకం కాని ఖనిజ వనరుల ద్రవ్య మదింపునకు ఒక ప్రామాణిక విధానాన్ని ఖరారు చేయడంలో సహాయపడతాయి. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో సహజ వనరుల గణనపరంగా భారతదేశాన్ని ముందు వరసలో నిలబెడుతుంది. భారతదేశ ఖనిజ, ఇంధన వనరుల ఖచ్చితమైన, పారదర్శకమైన ద్రవ్య మదింపు... సమాచార ఆధారిత విధాన రూపకల్పనకు, సుస్థిరాభివృద్ధికి ఒక ప్రాథమిక వనరుగా ఉపయోగపడుతుంది.
ssd-mospi[at]gov[dot]in ద్వారా ఎంఓఎస్‌పీఐలోని సామాజిక గణాంకాల విభాగం పరిధిలో ఉన్న పర్యావరణ విభాగానికి అభిప్రాయాలను సమర్పించవచ్చు.
|
చర్చాపత్రం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది. www.mospi.gov.in
|
చర్చా పత్రాన్ని పొందడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

|
(రిలీజ్ ఐడి: 2277680)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19