వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యావరణానికి సంబంధించిన చర్యలు, ఎఫ్‌టీఏలపై రెండు రోజుల జాతీయ చింతన శిబిరం న్యూఢిల్లీలో ప్రారంభం


పర్యావరణ సంబంధిత నూతన వాణిజ్య అవకాశాలు, అవి భారత ఎగుమతి పోటీతత్వంపై చూపే ప్రభావంపై ఆసక్తిదారుల చర్చలు

प्रविष्टि तिथि: 22 JUN 2026 6:00PM by PIB Hyderabad

‘‘పర్యావరణంతో ముడిపడిన టారిఫేతర చర్యలు: అవి డబ్ల్యూటీఓ నియమాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ)లపై చూపే ప్రభావం’’ అంశంపై రెండు రోజుల జాతీయ కార్యశాల/చింతన శిబిరాన్ని న్యూఢిల్లీ.. ఐఐఎఫ్‌టీ భవన్‌లో గల నలందా హాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్ (సీడబ్ల్యూఎస్)తో పాటు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు చెందిన సెంటర్ ఫర్ రిసర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీఆర్ఐటీ-ఐఐఎఫ్‌టీ)ల సహకారంతో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విభాగం నిర్వహిస్తోంది.
ఈ వర్క్‌షాపులో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాణిజ్య నిపుణులు, డబ్ల్యూటీఓ ప్రతినిధులు, పరిశ్రమ రంగం ప్రతినిధులు, బహుళ పక్ష, ద్విపక్ష వాణిజ్య సంప్రదింపులతో అనుబంధాన్ని కలిగి ఉన్న ఆసక్తిదారులు పాల్గొంటున్నారు. వారు పర్యావరణ సంబంధిత టారిఫేతర చర్యల వల్ల తలెత్తగల సరికొత్త సవాళ్లు, ఆ సవాళ్లు భారత వాణిజ్యంపైనా, ఎగుమతి పోటీతత్వంపైనా ప్రసరింప చేయగల ప్రభావంపై చర్చిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ, వాతావరణ సంబంధిత వాణిజ్య చర్యలు రోజు రోజుకూ మారుతున్న నేపథ్యంలో వాటిపై అవగాహనను పెంచడం, ఆ చర్యలు భారత ఎగుమతులపై చూపగల ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రాథమిక ప్రణాళిక, భారత ఎఫ్‌టీఏల ద్వారా అమలుచేసేందుకు వ్యూహాత్మక విధానాలను రూపొందించడం.. ఇవీ ఈ వర్క్‌షాపు నిర్వహణలో ముఖ్యోద్దేశాలు. మార్కెట్టు లభ్యతను సంరక్షించుకోవడం, ఎగుమతులకు సంబంధించి పోటీతత్వాన్ని పటిష్ఠపరచడం, దీర్ఘకాలం పాటు అమల్లో ఉండగల పద్ధతులను ప్రోత్సహించే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ చర్చలు తోడ్పడతాయని భావిస్తున్నారు.
వాణిజ్యంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల (టెక్నికల్ బారియర్స్ టు ట్రేడ్.. టీబీటీ)తో ముడిపడిన డబ్ల్యూటీఓ నియమాలు, దీర్ఘకాల ప్రాతిపదికతో ముడిపడిన టారిఫేతర చర్యలు, కర్బనానికీ, అడవుల నరికివేతకీ సంబంధించిన వాణిజ్య ప్రధాన చర్యలు, ఆసక్తిదారులతో పాటు పరిశ్రమ రంగం దృష్టికోణాలు, బహుళ పక్ష వ్యవస్థ, ద్విపక్ష వ్యవస్థలతో ఎదురయ్యే వాణిజ్య సంబంధిత సమస్యల్ని పరిష్కరించడానికి రూపొందించవలసిన విధానాల వంటి ముఖ్య అంశాలు ఈ చర్చల్లో చోటు చేసుకొంటున్నాయి. 2026 జూన్ 23న ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడంతో వర్క్‌షాపునకు తెర పడనుంది.
సీడబ్ల్యూఎస్ అధిపతి డాక్టర్ ప్రీతమ్ బెనర్జీ ప్రసంగంతో మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వారికి వాణిజ్య విభాగ ఉప కార్యదర్శి రిచా ప్రకాశ్ చౌదరి స్వాగతం పలికారు. ఆమె వర్క్‌షాపు లక్ష్యాలను కూడా వివరించారు. వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ ఉజ్జ్వల్ కుమార్ ప్రత్యేక ప్రసంగాన్నిస్తూ దీర్ఘకాలిక అభివృద్ధితో జతపడిన వాణిజ్య చర్యలు, మార్పులకు లోనవుతున్న ప్రపంచ నియంత్రణ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని భారత్ తీసుకోదగిన చర్యలను ఇప్పటితో పోలిస్తే బలోపేతం చేయడానికి ప్రాధాన్యాన్నివ్వాలని సూచించారు. సీఆర్ఐటీ-ఐఐఎఫ్‌టీ ప్రొఫెసర్, పాలనాధికారి డాక్టర్ మురళీ కల్లూమల్ వందన సమర్పణతో మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు.
వర్క్‌షాపులో అనేక మంది నిపుణులు పాల్గొన్నారు. వారిలో జెనీవా డబ్ల్యూటీలో టీబీటీ సెక్షను అధిపతి శ్రీ ఎరిక్ విక్‌స్ట్రామ్, డబ్ల్యూటీఓ టీబీటీ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీ అన్వర్ షేక్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (ఎన్ఏబీసీబీ) మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, యూఎన్ఎఫ్‌సీసీసీ సీడీఎమ్ అక్రెడిటెషన్ ప్యానల్ సభ్యుడు శ్రీ అనిల్ జౌహరీ, సర్వదా లీగల్ సహ సంస్థాపకుడు శ్రీ అతుల్ శర్మ, వాణిజ్య విధాన నిపుణుడు శ్రీ ప్రణవ్ కుమార్‌తో పాటు వాణిజ్య విభాగం ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

***


(रिलीज़ आईडी: 2277077) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil