ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
21 JUN 2026 11:37AM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ ఆర్ ఎన్ రవి, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి సువేందు అధికారి, నౌకాదళ ప్రధానాధికారి కృష్ణ స్వామినాథన్, ఇతర విశిష్ట అతిథులు అందరికీ,
ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
సముద్ర భద్రతా సామర్థ్యం లేకుండా ఏ దేశమూ గొప్ప శక్తిగా ఎదగలేదనే దానికి ఈ ప్రపంచమే సాక్ష్యం. అభివృద్ధి సముద్రాలతోనే ముడిపడి ఉంది. భద్రత కూడా సముద్రంతోనే అనుసంధానమై ఉంది. సంక్షేమమూ సముద్రంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో అత్యధిక శాతం సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. ప్రపంచాన్ని అనుసంధానించే విస్తృతమైన డేటా నెట్‌వర్కులు కూడా మహాసముద్రాల అంతర్భాగం నుంచే వెళుతున్నాయి. భవిష్యత్తులో కీలకమైన ఖనిజాలు, సముద్ర అంతర్భాగంలోని వనరులు, సరికొత్త ఇంధన వనరులు కూడా సముద్రాలతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఒక దేశానికి సముద్ర శక్తి ఎంత బలంగా ఉంటే.. ఆ దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం అంత బలంగా ఉంటుంది. భారతదేశం ఈ వాస్తవాన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకోసమే తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఈ రోజు.. మన సామర్థ్యాలకూ, నైపుణ్యాలకూ సాక్ష్యంగా నిలుస్తుంది.
మిత్రులారా,
కొన్నేళ్ల క్రితం, ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంలో సముద్ర రక్షణ రంగంలో నూతన అధ్యాయాన్ని భారత్ ప్రకటించింది. ఇది ప్రపంచానికి మన సామర్థ్యాలను చాటి చెప్పడమే అవుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రయాణం.. కొత్త యుద్ధ నౌకల గురించి మాత్రమే కాదు. ఇది వృద్ధి చెందుతున్న స్వయంసమృద్ధి ప్రయాణం గురించి కూడా. ఇప్పుడు ఈ ప్రయాణానికి ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ కొత్త వేగాన్ని జోడించాయి. భారతదేశానికి ఉన్నమూడు ముఖ్యమైన సంకల్పాలకు ఈ మూడు నౌకలూ ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి భారతదేశంలోనే తయారయ్యాయి. వీటి నమూనాలు సైతం ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. వీటి నిర్మాణంలో భారతీయ పరిశ్రమల ప్రతిభ, భారతీయ ఇంజినీర్ల నైపుణ్యం, భారతీయ శ్రామికుల కష్టం కలగలసి ఉన్నాయి. ఇదే నవ భారత దేశానికున్న విశిష్ట శక్తి.
మిత్రులారా,
రక్షణ రంగంలో కొనుగోలుదారుగా మాత్రమే ఉండాలని భారత్ అనుకోవడం లేదు. మన సైనిక శక్తిని ప్రపంచానికి ఒక వ్యాపార కేంద్రంగా మార్చలేం. మన గుర్తింపు మార్కెట్టుగా ఉండటంలో కాదు. మన స్వయంసమృద్ధిలో ఉంటుంది. తయారీదారుగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. తయారీదారులుగా మనం ఎప్పుడు ఎదుగుతామో.. అదే రోజు మనం అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తాం. ఈ దిశగా మనం అత్యంత వేగంగా ముందుకు వెళుతున్నాం. ఇటీవలి సంవత్సరాల్లో 40కి పైగా మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌకలనూ, జలాంతర్గాములనూ నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. అంటే ప్రతి కొన్ని వారాలకూ నూతన సామర్థ్యాలను భారత నౌకాదళం పెంచుకుంటోంది. ప్రస్తుతం, 45 ప్రధాన నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. ఇది సంఖ్య మాత్రమే కాదు. ఇది భారతదేశపు పారిశ్రామిక సామర్థ్యానికి నిదర్శనం. ఇది భారతదేశ భవిష్యత్తుకు సంకేతం.
మిత్రులారా,
భవిష్యత్తులో లక్షలాది కొత్త ఉద్యోగాలను అందించే సామర్థ్యం భారతీయ సముద్ర వాణిజ్య రంగానికి ఉంది. అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చెందిన భారత దేశానికి ఉపాధి ఇంజిన్‌గా మేం పరిగణిస్తున్నాం. ఒక ఆధునిక నౌక నిర్మాణానికి వందలాది టన్నుల ఉక్కు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాలు, వేలాది విడిభాగాలు అవసరమవుతాయి. వీటిని తయారు చేయడానికి వేలాది సంస్థలు పనిచేస్తాయి. అంటే వేల సంఖ్యలో యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ రోజు సముద్ర జలాల్లో ప్రవేశపెట్టిన మూడు నౌకల నిర్మాణ ప్రక్రియలో 200కు పైగా ఎంఎస్ఎంఈలు సహకారాన్ని అందించాయి. ఈ 200 ఎంఎస్ఎంఈల్లో, ఈ చిన్న తరహా పరిశ్రమల్లో ఏ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగిందో మనం ఊహించుకోవచ్చు.
మిత్రులారా,
నౌకావాణిజ్య శక్తిగా తదుపరి దశలోకి భారత్ ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే, నౌకా నిర్మాణ రంగంలో నూతన దార్శనికతతో దేశం ముందడుగు వేస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ రంగంలో అనేక విధాన సంస్కరణలను తీసుకొచ్చాం. దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్చలు తీసుకున్నాం. ఇప్పుడు నౌకా నిర్మాణాన్నీ, నౌకా మరమ్మత్తులనూ, నౌకల రీసైక్లింగునూ, ఎంఆర్వోనూ ప్రధాన జాతీయ కార్యక్రమంలో భాగంగా పరిగణిస్తున్నాం.
మిత్రులారా,
షిప్పింగ్ రంగం కోసం రూ.70,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించడం.. ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు. ఇది భారతదేశ నౌకా వాణిజ్య రంగ భవిష్యత్తుకూ, భారతదేశ పారిశ్రామిక విస్తరణకూ పెడుతున్న పెట్టుబడి.
మిత్రులారా,
నౌకా వాణిజ్య రంగాన్ని భారత దేశం ప్రస్తుతం బలోపేతం చేసుకుంటోంది. అందుకే తన ఓడరేవులను ఆధునీకరిస్తోంది, నూతన సామర్థ్యాలను పెంపొందించుకుంటోంది. నూతన రవాణా మార్గాలను నిర్మిస్తోంది. నదీ మార్గాలను విస్తరిస్తోంది. బహుళ విధ సరకు రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఈ సమగ్ర దార్శనికతలో సాగరమాల లాంటి కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి. ఇది వాణిజ్య వ్యయాన్ని తగ్గిస్తోంది. పరిశ్రమలకు సరికొత్త వేగాన్ని ఇస్తోంది. తీరప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.
మిత్రులారా,
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటిగా భారత్ ఉండేది. ఇలా ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల వ్యూహాత్మకమైన, భద్రతాపరమైన సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. 2014లో మా ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం, ఈ పరిస్థితిని మార్చాలని మేము సంకల్పించుకున్నాం. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున విధానపరమైన సంస్కరణలను చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చాం. ఫలితంగా ప్రస్తుతం రక్షణ రంగంలో డిజైన్, తయారీ, ఎగుమతుల్లో అనేక నూతన అవకాశాలు పుట్టుకొచ్చాయి. దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2014 వరకు సుమారు రూ.40,000 కోట్లుగా ఉంటే, ప్రస్తుతం దాదాపు రూ.1,80,000 కోట్లకు పెరిగింది.
మిత్రులారా,
ఒకవైపు దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు మన రక్షణ రంగ ఎగుమతులు అపూర్వమైన రీతిలో అత్యంత వేగంగా పెరిగాయి. 2014 వరకు భారతదేశం సుమారు రూ.700 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య సుమారు రూ.40,000 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భారతదేశంలో తయారైన రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
మిత్రులారా,
స్వయం సమృద్ధి సాధించే దిశగా చేస్తున్న ఈ ప్రయాణంలో చేయాల్సింది చాలానే ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. విధానాలు స్పష్టంగా ఉన్నప్పడు, సరైన మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు, అందరూ సమష్టి కృషి చేసినప్పుడు.. దేశంలో భారీ మార్పు సాధ్యమవుతుందని గత 12 ఏళ్లలో సాధించిన ప్రగతి నిరూపిస్తోంది.
మిత్రులారా,
నౌకా వాణిజ్య వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సహజంగానే బెంగాల్ పేరు మెదడుకు స్ఫురిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానించడంలో ఈ ప్రాంతం కీలకపాత్ర పోషించింది. చరిత్ర పునఃలిఖితమవడానికీ, వాణిజ్యంలో సరికొత్త అధ్యాయాల ప్రారంభానికీ, అభివృద్ధిలో నూతన ప్రయాణాల ఆరంభానికీ హుగ్లీ నదీ ప్రవాహాలు సాక్ష్యంగా ఉన్నాయి. ఈ ఓడరేవుకు బెంగాల్ ముద్దుబిడ్డ, దేశ తొలి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టడం యాదృచ్ఛికం.
మిత్రులారా,
నౌకావాణిజ్య రంగంలో నూతన శకంలో భారత్ చేస్తున్న ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ పాత్ర చాలా కీలకమైనది. సముద్ర ఆర్థిక వ్యవస్థను నూతన శిఖరాలకు చేర్చే సత్తా ఇక్కడి ఓడరేవుల సామర్థ్యానికీ, పారిశ్రామిక నైపుణ్యానికీ, ప్రతిభకూ ఉంది. భవిష్యత్తులో భారతదేశపు సముద్ర ఆర్థిక వ్యవస్థకూ, నౌకా తయారీ రంగానికీ, సరకు రవాణాకూ, తీరప్రాంత అభివృద్ధికీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
సముద్రాన్ని పరస్పర సహకారానికి మాధ్యమంగా భారత్ ఎల్లప్పుడూ పరిగణిస్తుంది. అయితే శాంతిని పరిరక్షించేందుకు సామర్థ్యం కూడా అంతే అవసరమని భారత్‌కు బాగా తెలుసు. సంక్షేమానికి భద్రత కీలకం. అలాగే భవిష్యత్తును నిర్మించడానికి స్వావలంబన అనివార్యం. ఈ రోజు భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు ఈ స్ఫూర్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇవి 21వ శతాబ్దంలో తన స్వశక్తిని గుర్తించి, తన సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచి, సరికొత్త ఆత్మవిశ్వాసం, వేగం, శక్తి, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న నవ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ సందర్భంగా నౌకాదళంలో పనిచేస్తున్న నా మిత్రులకూ, నా తోటి ప్రజలకూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ నౌకా దళానికీ, శాస్త్రవేత్తలకూ, ఇంజినీర్లకూ, కార్మికులకూ, దేశ ప్రజలకూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2276408)
आगंतुक पटल : 9