యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జేఎల్ఎన్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించనున్న డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, అక్షయ్ కుమార్


దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ కేంద్రాల్లో యోగా వేడుకలు.. 15,000 మందికి పైగా భాగస్వామ్యం

प्रविष्टि तिथि: 20 JUN 2026 3:40PM by PIB Hyderabad

భారత్‌లోనే అత్యంత భారీగా నిర్వహించే ఆరోగ్య సంరక్షణ, ముందస్తు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రజా ఉత్సవాలలో ఒకటైన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై) వేడుకలు రేపు ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ (జేఎల్ఎన్) స్టేడియంలో జరగనున్నాయి. 'ఆరోగ్యకరంగా ఎదిగేందుకు యోగా' ఇతివృత్తంతో జరిగే ఈ సామూహిక యోగా సెషన్‌లో కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడలు, కార్మిక- ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ.. ప్రముఖ నటుడు, ఫిట్‌నెస్ నిపుణుడు అక్షయ్ కుమార్‌లు పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 3000 మంది పాల్గొననున్నారు.

క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రాంతీయ కేంద్రాలు, నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, సాయ్ శిక్షణ కేంద్రాలు, ఖేలో ఇండియా సంస్థలన్నింటిలోనూ ఏకకాలంలో సమన్వయంతో కూడిన యోగా సెషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 15,000 మందికి పైగా పాల్గొంటారన్న అంచనా ఉంది. యోగాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మొత్తం క్రీడా రంగాన్ని ఒకే తాటిపైకి తెస్తూ జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర క్రీడా శాఖలు, క్రీడా విశ్వవిద్యాలయాలు తదితర సంస్థలు కూడా ఒకే సమయంలో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి.

“మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదనను అనుసరించి 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆమోదించినప్పటి నుంచి ఈ వార్షిక వేడుక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించే ప్రపంచవ్యాప్త ఉత్సవంగా ఎదిగింది" అని డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. "ఈ రోజు వివిధ ఖండాల్లోని కోట్ల మంది యోగా సాధకులను ఒకచోటికి చేరుస్తోంది. యోగా భౌగోళిక సరిహద్దులను దాటి ఒక ప్రపంచ అంశంగా మారింది" అని ఆయన వ్యాఖ్యానించారు. 

దేశ రాజధానిలో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక 'ఫిట్ ఇండియా' కార్యక్రమంలో సుమారు 3,000 మంది పాల్గొంటారన్న అంచనా ఉంది. ఫిట్‌నెస్ ప్రేమికులతో పాటు ప్రముఖులలో సైతం యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రసిద్ధ సెలబ్రిటీ యోగా శిక్షకురాలు అన్షుక పర్వాణీ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక యోగా సెషన్ ప్రత్యేకంగా నిలవనుంది. 

ఆదివారం జరిగే ఈ యోగా వేడుకల్లో అథ్లెట్లు, విద్యార్థులు, వృద్ధులు, ఫిట్‌నెస్ ప్రియులు, యోగా సాధకులు, కుటుంబాలు అంతా కలిసి పాల్గొననున్నారు. యోగాకు ఉన్న పరివర్తనాత్మక శక్తిని చాటిచెప్పేలా ఈ సామూహిక ప్రదర్శన సాగనుంది.

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరగనున్న ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐడీవై) వేడుకల్లో 180కి పైగా దేశాల నుంచి కొన్ని కోట్ల మంది పాల్గొంటారని భావిస్తున్నారు.

గడిచిన దశాబ్ద కాలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ ఉద్యమాలలో ఒకటిగా రూపాంతరం చెందింది. దీనికి భారత్ నాయకత్వం వహిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యం, నివారణ ఆరోగ్య సంరక్షణను వేడుకగా చేసుకోవటానికి వివిధ ఖండాల్లోని దేశాలు కలిసికట్టుగా ముందుకు వస్తున్న తరుణంలో 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్', 'యోగా డే' వంటి కార్యక్రమాలు ప్రపంచానికి మరింత ఆరోగ్యకరమైన, చురుకైన, సుస్థిర జీవన విధానాన్ని అందించడంలో భారత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2275791) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam