రక్షణ మంత్రిత్వ శాఖ
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ రంగ భద్రతావసరాల బాధ్యతను మనమే తీసుకోవాలన్న రక్షణ మంత్రి
నాగ్‌పూర్‌లోని ‘వైఐఎల్’లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్‌కు భూమి పూజ చేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
నిర్దేశించుకున్న రూ. 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి, రూ. 50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాలను అనుకున్న తేదీ కంటే ముందే సాధించే దిశగా దూసుకుపోతున్న భారత్: రక్షణ మంత్రి
కార్పొరేటీకరణ తర్వాత పెరిగిన ఓఎఫ్‌బీ ఉత్పత్తి.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,755 కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 26,282 కోట్లకు పెరుగుదల: రక్షణ మంత్రి
రూ. 81 కోట్ల నుంచి ఏకంగా రూ. 4,561 కోట్లకు దూసుకెళ్లిన రక్షణ ఎగుమతులు: రక్షణ మంత్రి
ఒక పారిశ్రామిక సంస్థను ముందుకు నడిపించడంలో పరిశోధన-అభివృద్ధి, మూలధన పెట్టుబడులు అత్యంత కీలకం: రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2026 2:12PM by PIB Hyderabad
సొంత అవసరాలను తీర్చుకోగల సామర్థ్యం ఉన్న దేశం తన ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అత్యంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2026 జూన్ 19న నాగ్‌పూర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) విభాగానికి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంబాఝరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి అత్యాధునిక 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్‌కు భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి కీలకమైన వాటిని దేశీయంగానే తయారు చేసుకునే భారతదేశ వ్యూహాత్మక మార్పును ఈ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ తెలియజేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటే రక్షణ రంగ అవసరాలను మన చేతుల్లోకి తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని ఆయన అభివర్ణించారు.

ఈ ప్రతిపాదిత ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ దేశంలోనే అత్యంత అత్యాధునికమైన కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. రక్షణ వ్యవస్థలు- ప్లాట్‌ఫామ్‌లు, ఏరోస్పేస్- విమానయాన నిర్మాణాలు, క్షిపణి కార్యక్రమాలు, రైల్వేలు- రవాణా రంగాలు, ఇతర వ్యూహాత్మక పారిశ్రామిక అనువర్తనాలకు అవసరమైన భారీ, సంక్లిష్టమైన అల్యూమినియం మిశ్రమ (అల్లాయ్) ప్రొఫైల్‌ల తయారీకి ఇది ఎంతగానో దోహదపడుతుంది. కీలకమైన అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్‌ల విషయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ ప్రాజెక్టు సహాయపడనుంది. ఇది దేశీయ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే స్వదేశీ ఉత్పత్తి ద్వారా వ్యూహాత్మక రంగాల భవిష్యత్తు అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది.
“ఈ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఒక కీలకమైన అవసరాన్ని తీరుస్తుంది. ఆధునిక ఫైటర్ జెట్లు, క్షిపణులు, అత్యాధునిక అంతరిక్ష కార్యక్రమాలకు అత్యంత కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకోగల తేలికగా ఉండే బలమైన లోహాలు అవసరం. ఇటువంటి లోహాలు ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా తయారవుతాయి. లోహం నాణ్యత అద్భుతంగా ఉంటే అది ప్రతి పరిస్థితిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది" అని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
'ఆపరేషన్ సిందూర్' విజయంలో భారత్‌లో తయారైన పరికరాలు పోషించిన కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. మన రక్షణ దళాల శౌర్యపరాక్రమాలకు చేదోడుగా నిలిచేలా అత్యంత బలమైన హార్డ్‌వేర్ విషయంలో స్వదేశీ తయారీని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెద్ద పెద్ద యంత్రాల అసలైన బలం వాటిలో ఉండే వేలాది కీలకమైన విడిభాగాలపైనే ఆధారపడి ఉంటుందన్న ఆయన.. ఈ క్లిష్టమైన రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చడంలో ఈ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
నేడు యుద్ధాల స్వభావం మారటంతో పాటు శత్రువులను కనిపెట్టడం మరింత కష్టతరం అవుతోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ సంప్రదాయ యుద్ధ పద్ధతులు, వాటికి సంబంధించిన వనరులు 1947లో ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో నేడు అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని.. 2047 లో కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని ఆయన అన్నారు. బలమైన సైనిక-పారిశ్రామిక ఆధారానికి ఉన్న ప్రాముఖ్యత చాలా కాలం పాటు కొనసాగుతుందని.. భవిష్యత్తు అవసరాలను మనసులో ఉంచుకొని ఒక పెద్ద జాతీయ అవసరాన్ని తీర్చే దిశగా ఈ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఒక కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత, మానవ వనరులు, విజ్ఞానం, దేశంపై నమ్మకం అనే నాలుగు ముఖ్యమైన అంశాలపై ఏకకాలంలో పనిచేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కన్న 'ఆత్మనిర్భర్ భారత్' కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని.. 2014 లో కేవలం రూ. 46,000 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2014లో భారత్ కేవలం రూ. 1,000 కోట్ల కంటే తక్కువ విలువైన ఆయుధాలు, రక్షణ పరికరాలను ఎగుమతి చేయగా.. ఇప్పుడు అది ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 38,424 కోట్లకు దూసుకెళ్లిందని ఆయన తెలిపారు. “ఇది కేవలం సంఖ్యలలో వచ్చిన పెరుగుదల మాత్రమే కాదు భారత సామర్థ్యాలలో వచ్చిన వృద్ధి. ఇది దేశపు ఆత్మవిశ్వాసానికి దక్కిన ప్రోత్సాహానికి నిదర్శనం. రాబోయే 2-3 సంవత్సరాల కోసం మనం నిర్దేశించుకున్న లక్ష్యాలైన రూ. 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి, రూ. 50,000 కోట్ల రక్షణ ఎగుమతులను ప్రణాళిక కంటే ముందే సాధించే దిశగా మనం సిద్ధంగా ఉన్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
స్వయంసమృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అందిస్తోన్న విశేష సహకారాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మారుతున్న కాలం, అత్యాధునిక సాంకేతికతలను దృష్టిలో ఉంచుకొని రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం, వేగవంతం చేయడానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ) కార్పొరేటీకరణను చేపట్టినట్లు తెలిపిన ఆయన.. దీని ఫలితమే ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అని పేర్కొన్నారు. “కార్పొరేటీకరణ తర్వాత ఏర్పడిన కొత్త సంస్థలు తగినంత కార్యాచరణ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటూ ఆవిష్కరణలు, రిస్క్ తీసుకోవడం, పరిశోధనలు, ఎగుమతుల రంగాల్లో రాణించేలా అవకాశాలను అందుకోవాలని మేం ఆకాంక్షించాం. కొత్త రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (డీపీఎస్‌యూ) అన్నీ విజయవంతంగా అదే దిశలో ముందడుగు వేశాయి. కార్పొరేటీకరణకు ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,755 కోట్లుగా ఉన్న ఓఎఫ్‌బీ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 26,282 కోట్లకు పెరిగింది. అలాగే రక్షణ ఎగుమతుల విషయానికి వస్తే కార్పొరేటీకరణకు ముందు ఇది కేవలం రూ. 81 కోట్లుగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రూ. 4,561 కోట్లకు దూసుకెళ్లింది. ఇందులో వైఐఎల్ వాటా రూ. 397 కోట్లుగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో ఒక పారిశ్రామిక సంస్థను ముందుకు నడిపించడంలో 'పరిశోధన-అభివృద్ధి', 'మూలధన పెట్టుబడులు' అత్యంత కీలకమైన అంశాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఒక సంస్థ దీర్ఘకాలంలో పురోగమించాలన్నా, పోటీని తట్టుకొని నిలబడాలన్నా పరిశోధన-అభివృద్ధి (ఆర్-డీ) అనేది చాలా ముఖ్యమని.. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునే సంస్థలే భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. మూలధన పెట్టుబడుల గురించి మాట్లాడిన ఆయన.. సరికొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం లేదా ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టడం వల్ల అత్యంత కీలకమైన సాంకేతిక అనుసంధానం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. “ఆధునిక యంత్రాల ద్వారా కొత్త సాంకేతికతలు తయారీ వ్యవస్థలో భాగమవుతాయి. దీనివల్ల ఉత్పత్తి ప్రక్రియలలో సామర్థ్యం పెరుగుతుంది.. నాణ్యత మెరుగుపడుతుంది. తద్వారా ఈ రక్షణ వ్యవస్థ మరింత ఆధునికంగా, సమర్థవంతంగా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్తు పోటీని తట్టుకొని నిలబడాలంటే సరికొత్త సాంకేతికత, అధునాతన ఉత్పత్తి వ్యవస్థల్లో పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరమన్న రక్షణ మంత్రి.. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు సమర్థవంతమైన యంత్రాల స్థాపనకు, ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా చెప్పారు. ఇది కార్పొరేట్ సంస్థలు జాతీయ అంచనాలను అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాల పరంగా తమ బలమైన ఉనికిని చాటుకునేలా చేస్తుందని ఆయన అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు సాగడానికి అవసరమైన ప్రతిచోటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని అవలంబించాలని ఆయన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలకు (డీపీఎస్‌యూ) పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మార్గదర్శకత్వంలో 'ఆత్మనిర్భర్', 'వికసిత్ భారత్' దార్శనికతను సాధించే దిశగా ఈ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఒక కీలక పురోగతి అని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల భారత్ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతిదారుగా స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని.. దీనివల్ల దేశ రక్షణ రంగం సాధిస్తున్న వృద్ధిని నేడు ప్రపంచం గుర్తిస్తోందని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ అనేది నవ భారత సాంకేతిక నైపుణ్యానికి, విశిష్ట సామర్థ్యాలకు ఒక ప్రస్ఫుటమైన నిదర్శనమని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (డీపీఎస్‌యూ), ప్రైవేట్ రంగాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశాన్ని సరికొత్త శిఖరాలను అధిరోహించే స్థాయికి తీసుకెళ్తోందని ఆయన అన్నారు. రక్షణ రంగ తయారీలో స్వయంసమృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో నాగ్‌పూర్, ఈ మొత్తం ప్రాంతం ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఈ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఎంతగానో దోహదపడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, రక్షణ ఉత్పత్తి శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ గరిమా భగత్, వైఐఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్)- సీఎండీ (అదనపు బాధ్యతలు) శ్రీ విజయ్‌కుమార్ అయ్యర్, డీడీపీ- వైఐఎల్‌కి చెందిన ఇతర ఉన్నతాధికారులు, రక్షణ దళాల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2275379)
आगंतुक पटल : 9