గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జూలై 1న ఆంధ్రప్రదేశ్ నుంచే ‘వీబీ-జీ రామ్ జీ’ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ బేటీ
‘‘ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ నమూనా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
‘‘జియో-ట్యాగింగ్, ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా గ్రామీణాభివృద్ధి పథకాలకు సంబంధించిన పనులన్నీ దాదాపు పూర్తి’’: శ్రీ పవన్ కళ్యాణ్
प्रविष्टि तिथि:
16 JUN 2026 7:00PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నేడు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ఉపాధి కల్పన, జీవనోపాధి మెరుగుదల, పంచాయతీల అభివృద్ధి, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక కార్యక్రమాల ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో వీటిని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అనుసరించాల్సిన ప్రణాళికల సమీక్షపైనే ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ భేటీలో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. ‘వికసిత్ భారత్-రోజ్‌గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ)’ జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం 2026 జూలై 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆయా రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు.
ఈ జాతీయ స్థాయి కార్యక్రమం సందర్భంగా పాల్గొనే వారందరికీ ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక’ గురించి వివరిస్తారని శ్రీ చౌహాన్ చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసిన ఆదర్శ పంచాయతీలు, వ్యర్థ రహిత గ్రామ పంచాయతీల పనితీరు, వారు సాధించిన విజయాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ పరిపాలన, సుస్థిర అభివృద్ధి, సమాజ భాగస్వామ్యం వంటి రంగాల్లోఆంధ్రప్రదేశ్ సాధించిన అత్యుత్తమ నమూనాలు, వినూత్న పద్ధతులను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు. తద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ సాధించిన ఈ విజయవంతమైన అనుభవాల నుంచి నేర్చుకునేందుకు వీలవుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణాన్ని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని, అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను చాలా వేగంగా తీసుకోవడంలో ఏపీకి మంచి పేరు ఉందని ఆయన కొనియాడారు. గ్రామీణాభివృద్ధి రంగంలో రాష్ట్రం మరిన్ని సరికొత్త ఆవిష్కరణలు చేయాలని, తద్వారా ఇతర రాష్ట్రాలు కూడా దాని నుంచి స్ఫూర్తి పొందవచ్చని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిన విజయవంతమైన నమూనాలు, ఆవిష్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకుంటామని.. తద్వారా గ్రామీణాభివృద్ధిలో అత్యుత్తమ విధానాలు దేశమంతటా విస్తృతంగా వ్యాప్తి చెంది, అందరూ అవలంబించేలా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణాభివృద్ధి పనులు, పథకాల పురోగతిని వివరించారు. గ్రామీణాభివృద్ధి పథకాల కింద చేపట్టే అన్ని పనుల్లో పూర్తి పారదర్శకతను నిర్ధారించడానికి, ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడటానికి అన్ని పనులను ‘జియో-ట్యాగింగ్’ చేశామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం ముఖ గుర్తింపు ఆధారిత సాంకేతిక వ్యవస్థ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’ కింద గ్రామీణ రహదారులు, గృహాల నిర్మాణం చాలా వేగంగా పురోగమిస్తోందని వివరించారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో పశువుల కోసం తాగునీటి సదుపాయాలను కల్పించామని, ఇది గ్రామీణ పశుపోషకులకు ఎంతో మేలు చేస్తూ వారి జీవనోపాధి పరిస్థితులను మెరుగుపరుస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
వీబీ-జీ రామ్ జీ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,700 కోట్లకు పైగా రికార్డు స్థాయి తాత్కాలిక నిధులను కేటాయించినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం అందించిన ఈ భారీ ఆర్థిక మద్దతు రాష్ట్రంలో వివిధ గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఏపీ ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయాలు, ప్రగతిపై కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా అవసరమైన పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి నమూనాలను స్వీకరించి, వాటిని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కింద కాఫీ తోటల పెంపకం కార్యకలాపాలను కూడా చేర్చినట్లు తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త జీవనోపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రైతుల ఆదాయ వనరులలో వైవిధ్యం వస్తుందని పేర్కొన్నారు. వీటితో పాటు సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం కోసం కోస్తా తీర ప్రాంతాల్లో ఆదర్శ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.
జూన్ 28, 29 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ‘జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు’కు హాజరు కావాల్సిందిగా ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానించారు. ఈ సదస్సులో వీబీ-జీ రామ్‌జీ పథకం సమర్థవంతమైన అమలు, వివిధ రాష్ట్రాల అనుభవాల మార్పిడి, గ్రామీణాభివృద్ధిలో సరికొత్త ఆవిష్కరణలపై లోతైన చర్చలు జరగనున్నాయి. ఈ జాతీయ వేదిక అన్ని రాష్ట్రాల మధ్య అత్యుత్తమ విధానాలను పంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కాన్సల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలలో ఆదర్శ పంచాయతీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ తరఫున సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కోస్తా తీర ప్రాంతాలలో అభివృద్ధి చేస్తున్న ఈ నమూనాలు, గ్రామీణాభివృద్ధిని, స్థానిక వనరులను ఎలా మెరుగ్గా ఉపయోగించుకోవాలో చూపడానికి ఇతర ప్రాంతాలకు కూడా ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ జీవనోపాధిని పెంపొందించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా.. 'లఖ్‌పతీ దీదీలు'గా పేరొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాహనాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సమావేశంలో వెల్లడించారు. దీనికి సంబంధించి 'దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే అవసరమైన అనుమతులను మంజూరు చేసింది. ఈ కీలక చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని, వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రోహిణి ఆర్ భాజిభాకరేతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఫలప్రదమైన చర్చల్లో వారు కూడా తమ వంతు కీలక సూచనలు అందించారు.
***
(रिलीज़ आईडी: 2273867)
आगंतुक पटल : 9