రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల నిర్వహణ, పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు 'ముందస్తు అంచనా ఆధారిత నిర్వహణ’ విధానం వైపు అడుగులు వేస్తోన్న ఎన్‌హెచ్ఏఐ

प्रविष्टि तिथि: 16 JUN 2026 6:25PM by PIB Hyderabad

సమర్థవంతమైన, ఉన్నత ప్రమాణాలు కలిగిన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) రహదారుల కార్యకలాపాలు, నిర్వహణ (ఓ-ఎం) విధానంలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'ముందస్తు అంచనా ఆధారిత నిర్వహణ (ప్రిడిక్టివ్ అసెట్ మేనేజ్‌మెంట్)' విధానాన్ని అవలంబిస్తోంది. సంప్రదాయ పద్ధతుల నుంచి ఈ ముందస్తు అంచనా ఆధారిత నిర్వహణ విధానం వైపు మారుతుండటం.. ఒకవైపు భారీ ఎత్తున జాతీయ రహదారులను నిర్మిస్తూనే మరోవైపు వాటి నిర్వహణను అత్యున్నత ప్రమాణాలతో కొనసాగించాలనే ఎన్‌హెచ్ఏఐ ద్వంద్వ లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ముందస్తు అంచనా ఆధారిత నిర్వహణ విధానం వల్ల రహదారులు పాడైపోవడాన్ని ముందే గుర్తించి సరైన సమయంలో మరమ్మతులు చేపట్టడానికి వీలవుతుంది. తద్వారా జాతీయ రహదారులను ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉంచొచ్చు. 

ఈ మార్పు మూడు వ్యూహాత్మక అంశాలపై ఆధారపడి ఉంది. ఇందులో మొదటిది 'భారీ ఎత్తున రహదారి సంపద స్థితిగతులను పర్యవేక్షించడం'. రహదారి ఉపరితల స్థితిగతులైన గరుకుదనం, గుంతలు పడటం, పగుళ్లు, నిర్మాణపరమైన లోపాలను గుర్తించడానికి కార్యకలాపాలు, నిర్వహణలో (ఓ-ఎం) ఉన్న జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ వ్యాప్తంగా 'నెట్‌వర్క్ సర్వే వెహికల్స్'ను (ఎన్ఎస్‌వీ) ఎన్‌హెచ్ఏఐ రంగంలోకి దించింది. జాతీయ రహదారి ఆస్తుల డిజిటల్ జాబితాను రూపొందించడానికి, నిర్మాణాలను పర్యవేక్షించడానికి, ఆక్రమణలను గుర్తించడానికి 'డ్రోన్ అనలిటిక్స్ పర్యవేక్షణ వ్యవస్థ'ను (డీఏఎంఎస్) ఉపయోగిస్తున్నారు. రోడ్లపై ఎలాంటి లోపాలు బయటకు కనిపించకముందే వాటి అంతర్గత నిర్మాణ బలాన్ని అంచనా వేయడానికి, బలహీనపడుతున్న భాగాలను గుర్తించడానికి 'ఫాలింగ్ వెయిట్ డిఫ్లెక్టోమీటర్' (ఎఫ్‌డబ్ల్యూడీ) పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ డేటా సేకరణను మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతీయ రహదారులపై కృత్రిమ మేధ ఆధారిత 'డ్యాష్‌క్యామ్ అనలిటిక్స్ సర్వీసెస్'ను (డీఏఎస్‌) ఎన్‌హెచ్ఏఐ ప్రారంభించింది. దీని ద్వారా రోడ్లపై గుంతలు, దెబ్బతిన్న క్రాష్ బారియర్లు, లైటింగ్ లోపాలు, డ్రైనేజీ సమస్యల వంటి అనేక రకాల లోపాలను ఆటోమేటిక్‌గా గుర్తించొచ్చు.

రెండో వ్యూహాత్మక అంశం.. 'కేంద్రీకృత రహదారి ఆస్తుల సమాచార వ్యవస్థ'ను (సెంట్రలైజ్డ్ అసెట్ ఇంటెలిజెన్స్ ఈకోసిస్టమ్) ఏర్పాటు చేయడం. ఎన్‌ఎస్‌వీలు, డ్రోన్లు, డ్యాష్‌క్యామ్‌లు, ఎఫ్‌డబ్ల్యూడీ సర్వేల ద్వారా సేకరించిన డేటా మొత్తాన్ని ఒకే వ్యవస్థలోకి తీసుకువస్తున్నారు. తద్వారా జాతీయ రహదారుల నెట్‌వర్క్ వ్యాప్తంగా ఉన్న రహదారి ఆస్తుల స్థితిగతులకు సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట లభ్యమవుతుంది. ఇది కార్యకలాపాలు, నిర్వహణ (ఓ-ఎం) వ్యవస్థలోని వివిధ విభాగాలు, భాగస్వాములకు బహుళ ప్రయోజనాల కోసం ఈ డేటాను ఉపయోగించుకునేలా చేస్తుంది. ఫలితంగా విడివిడిగా జరిపే అరకొర తనిఖీల పద్ధతిని పక్కనబెట్టి జాతీయ రహదారుల స్థితిగతులను నిరంతరం అప్‌డేట్ చేసే ఒక సమగ్ర డిజిటల్ వ్యవస్థను రూపొందించుకోవడానికి ఎన్‌హెచ్ఏఐకి వీలవుతుంది.

ఇక మూడో వ్యూహాత్మక స్తంభం... 'ముందస్తు అంచనా పర్యవేక్షణ, ప్రమాదాల ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం' (ప్రిడిక్టివ్ మానిటరింగ్ అండ్ రిస్క్-బేస్డ్ డిసిషన్ మేకింగ్). రోడ్డు స్థితిగతుల విషయంలో గత డేటా, తనిఖీ రికార్డులు, ప్రస్తుత రహదారి పర్యవేక్షణ సమాచారాన్ని కలపడం ద్వారా జాతీయ రహదారుల ధోరణిని ఎన్‌హెచ్ఏఐ ముందే గుర్తించగలుగుతుంది. దీనివల్ల ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న రోడ్డు భాగాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు మరింత జటిలంగా మారకముందే సరైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది.

ప్రామాణిక నిర్వహణ నిబంధనలు, మెరుగైన నిర్వహణ ఒప్పందాలు, బలమైన వ్యవస్థాగత మద్దతు ద్వారా సాధ్యమయ్యే ముందస్తు నివారణ చర్యలు, పనితీరు నిర్వహణలే ఈ మూడు వ్యూహాత్మక అంశాలకు బలమైన పునాదిగా నిలుస్తాయి.

ఈ సరికొత్త చొరవ జాతీయ రహదారుల కార్యకలాపాలు, నిర్వహణ (ఓ-ఎం) విభాగానికి ఒక అధునాతన, డేటా ఆధారిత విధానాన్ని అందిస్తుంది. అధునాతన పర్యవేక్షణ సాంకేతికతలు, కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, పనితీరు ఆధారిత నిర్వహణ వ్యవస్థల కలయిక ద్వారా జాతీయ రహదారుల మన్నికను పెంచడం, వాటి నిర్వహణను మరింత మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల వినియోగదారులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఎన్‌హెచ్ఏఐ పనిచేస్తోంది.

***


(रिलीज़ आईडी: 2273759) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil