పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎయిరిండియా విమానం ఏఐ-171 ప్రమాద దర్యాప్తు పురోగతిపై ఏఏఐబీ మధ్యంతర ప్రకటన
प्रविष्टि तिथि:
12 JUN 2026 5:53PM by PIB Hyderabad
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ-171 (బోయింగ్ 787-8) గతేడాది (12 జూన్ 2025న) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఘటన వల్ల బాధితులు అనుభవిస్తున్న బాధను, తీరని లోటును ఈ సందర్భంగా సంస్థ గుర్తుచేసుకుంది.
సవరించిన విమాన (ప్రమాదాలు, సంఘటనల దర్యాప్తు) నియమాలు 2017, ఐసీఏఓ అనుబంధం-13లో ఉన్న ప్రమాణాలు, సిఫార్సు చేసిన విధానాలకు అనుగుణంగా ఏఏఐబీ ఈ దర్యాప్తును నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికను ప్రమాదం జరిగిన నెల రోజులకు 12 జూలై 2025న విడుదల చేసింది.
గడిచిన ఏడాది కాలంగా దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి గల సాంకేతిక, కార్యాచరణ, సంస్థాగత, మానవ తప్పిదాల కోణాలను అత్యంత లోతుగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో సంబంధిత సంస్థల నుంచి గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, నిపుణులు మద్దతునిచ్చారు. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్ భాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు అన్ని కీలక ఆధారాలను విశ్లేషించడంలో దర్యాప్తు బృందం గణనీయమైన పురోగతిని సాధించింది.
ప్రస్తుతం సేకరించిన ఆధారాలను, పరీక్షల ఫలితాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. దర్యాప్తులోని అన్ని పరిశోధనలు, నివేదికలు, ధ్రువీకరించిన ఆధారాలు, శాస్త్రీయ విశ్లేషణతో కూడి ఉండేలా చూసేందుకు అవసరమైన అదనపు సాంకేతిక మూల్యాంకనాలను, నిపుణుల పరీక్షలను నిరంతరం కొనసాగిస్తున్నారు.
ఈ దర్యాప్తును అత్యంత నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, సాక్ష్యాధారాల ఆధారంగా నిర్వహించేందుకు ఏఏఐబీ కట్టుబడి ఉంది. దర్యాప్తు ప్రక్రియలన్నీ పూర్తయి, ఏసీఏఓ అనుబంధం-13 ప్రకారం అవసరమైన అంతర్జాతీయ సమీక్ష, సంప్రదింపులు ముగిసిన తర్వాతే తుది నివేదికను విడుదల చేయనున్నారు.
ఈ ప్రమాద దర్యాప్తు ఏకైక ఉద్దేశ్యం భవిష్యత్తులో విమాన ప్రయాణ భద్రతను మెరుగుపరచడం, అవసరమైన భద్రతా సూచనలను జారీ చేయడం మాత్రమే తప్ప, ఎవరిపైనా నిందలు మోపడం లేదా బాధ్యులను చేయడం కాదని ఏఏఐబీ స్పష్టం చేసింది. అందుకే దర్యాప్తు కొనసాగుతున్న కాలంలో మీడియా, ప్రజలతో సహా వాటాదారులందరూ ఎలాంటి ముందస్తు అంచనాలకు లేదా ఊహాగానాలకు తావివ్వకూడదని ఏఏఐబీ విజ్ఞప్తి చేసింది.
వృత్తి నైపుణ్యం, పారదర్శకత, అత్యున్నత ప్రమాణాలతో ఈ విచారణను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు సంస్థ పునరుద్ఘాటించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తున్నామని.. దీని ద్వారా వచ్చే ఫలితాలు, భద్రతా సిఫార్సులు పౌర విమానయాన రంగాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయని ఏఏఐబీ పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 2272447)
आगंतुक पटल : 20