శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పట్టణ రహదారుల ఆధునీకరణ: సుస్థిరమైన రోడ్ల పునరుద్ధరణ,


తక్షణ గుంతల నివారణకు సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, ఎంసీడీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 12 JUN 2026 1:59PM by PIB Hyderabad

ఢిల్లీ నగరంలో రోడ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ), సీఎస్ఐఆర్- సీఆర్ఆర్ఐ (కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ) మధ్య 2026 జూన్ 10న ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శాస్త్రీయ పద్దతుల్లో ఢిల్లీలోని రోడ్ల పనితీరును, నిర్మాణ నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు, ఎంసీడీ ఇంజనీర్లు, సిబ్బందికి అత్యాధునిక సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ఓ ద్వైపాక్షిక సాంకేతిక నిర్వహణ ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు కుదుర్చుకున్నాయి. దీని ద్వారా సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సరికొత్త ఈకోఫిక్స్ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయనున్నారు. ఇనుము, ఉక్కు పరిశ్రమల వ్యర్థాల ఆధారంగా తయారు చేసిన ఈ సరికొత్త మిశ్రమంతో రోడ్లపై పడే గుంతలను తక్షణమే, అత్యంత మన్నికగా పూడ్చవచ్చు.

 

శాస్త్రీయ పద్ధతుల్లో రోడ్ల పనితీరును పరిశీలించడం, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం, వినూత్న నిర్వహణ పద్ధతులను అవలంబించడం ద్వారా ఢిల్లీ నగర రహదారుల మన్నికను, నాణ్యతను మెరుగుపరచడమే ఈ భాగస్వామ్య ముఖ్యలక్ష్యం.

 

ఈ సందర్భంగా ఎంసీడీ కమిషనర్ శ్రీ సంజీవ్ ఖిర్వార్ (ఐఏఎస్) మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో రోడ్ల ప్రణాళిక, నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని చెప్పారు. సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐతో కుదిరిన ఈ ఒప్పందం ఎంసీడీ సాంకేతిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకోఫిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా రోడ్ల మరమ్మతులను అత్యంత వేగంగా, మన్నికగా పూర్తి చేయడానికి వీలవుతుందని తెలిపారు.

 

ఈ సందర్భంగా సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ రవి శేఖర్ అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు రవాణా రంగంలో తమ సంస్థ గత ఏడు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను గుర్తుచేశారు. ఎంసీడీ పరిధిలోని రోడ్ల పరిశీలన, నాణ్యత పర్యవేక్షణ, సుస్థిర సాంకేతికతల వినియోగంలో ఈ భాగస్వామ్యం పూర్తి సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా స్టీల్ స్లాగ్ రోడ్ సాంకేతికత, ఈకోఫిక్స్, రెజుపేవ్, ఎంఎస్ఎస్ ప్లస్ వంటి సరికొత్త సాంకేతికతలు సహజ వనరుల పరిరక్షణకు, సర్క్యులర్ ఎకానమీకి దోహదపడటమే కాకుండా, పర్యావరణానికి హాని చేసే కర్బన ఉద్గారాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు.

 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు స్టీల్ స్లాగ్ రోడ్, ఈకోఫిక్స్ సాంకేతికతల రూపకర్త, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ ఫ్లెక్సిబుల్ పేవ్‌మెంట్ విభాగాధిపతి శ్రీ సతీష్ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా భాగస్వామ్య ముఖ్య ఉద్దేశాలను, రాబోయే ఫలితాలను ఆయన వివరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో రోడ్ల పరిశీలన, కఠినమైన నాణ్యత పర్యవేక్షణ, అధునాతన నిర్వహణ పద్ధతుల వల్ల రహదారుల సామర్థ్యం, పనితీరు, మన్నిక గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. దీనివల్ల రోడ్ల మరమ్మతుల సమయంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర అంతరాయాలు చాలావరకు తగ్గుతాయని తెలిపారు.

 

ఈకోఫిక్స్ వినియోగానికి సంబంధించిన సాంకేతిక నిర్వహణ ఒప్పందంపై సంతకాలు చేయడం ఈ కార్యక్రమంలో కీలకంగా నిలిచింది. శుద్ధి చేసిన ఇనుము, ఉక్కు పరిశ్రమల వ్యర్థాల మిశ్రమంతో రూపొందించిన ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రోడ్ల గుంతలను చాలా వేగంగా, అత్యంత మన్నికగా పూడ్చవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలను సుస్థిర రహదారుల నిర్వహణకు ఉపయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వ్యర్థాల నుంచి సంపద సృష్టి’ జాతీయ విధానానికి ఈ ప్రాజెక్టు మద్దతివ్వనుంది. దీనివల్ల రోడ్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, వాయు కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలు కూడా తగ్గుతాయి. మెరుగైన రహదారి పరిస్థితులు, సమయానికి మరమ్మతులు నిర్వహించడం ద్వారా రహదారులపై దుమ్ము లేవడం తగ్గుతుందని భావిస్తున్నారు. ఉక్కు వ్యర్థాలను పునర్వినియోగించడం వల్ల సహజ వనరులు ఆదా అవ్వడమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా సర్క్యులర్ ఎకానమీకి ఎంతగానో సహాయపడుతుంది.

 

ఈ కార్యక్రమంలో ఎంసీడీ, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ సంస్థలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎంసీడీ అడిషనల్ కమిషనర్ శ్రీ ఎల్ డీ మేఘ్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ ప్రేమ్ చంద్ మీనా, చీఫ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) శ్రీ బ్రిజేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ (స్టోర్స్) శ్రీ సందీప్ మల్హోత్రా, ప్లానింగ్ కన్సల్టెంట్ (మాజీ చీఫ్ ఇంజనీర్) శ్రీ మనీష్ రస్తోగిలతో పాటు.. సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త, పీఎంఈ అధిపతి డాక్టర్ వినోద్ కరార్, ఐఎల్టీ విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ కే రవీందర్, పట్టణ మౌలిక సదుపాయాల రంగానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యంత బలమైన, పర్యావరణహితమైన, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారి మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఇరు సంస్థల ఉమ్మడి నిబద్ధతను ఈ సరికొత్త ముందడుగు ప్రతిబింబిస్తుంది.

 

 

ఎంసీడీపరిధిలోని రహదారుల నిర్మాణ బలాన్ని, నాణ్యతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, ఎంసీడీ ప్రతినిధులు

 

 

ఈకోఫిక్స్ సాంకేతికత ద్వారా రోడ్లపై పడే గుంతలను తక్షణమే పూడ్చేందుకు కుదిరిన సాంకేతిక నిర్వహణ ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకుంటున్న సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, ఎంసీడీ ప్రతినిధులు

***


(రిలీజ్ ఐడి: 2272163) సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil