బొగ్గు మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో బొగ్గు.. లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై బొగ్గు మంత్రిత్వ శాఖ రోడ్‌షో విజయవంతం
प्रविष्टि तिथि:
11 JUN 2026 9:21PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు హైదరాబాద్ నగరంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై కీలక రోడ్‌షోను విజయవంతంగా నిర్వహించింది. పలువురు అగ్ర పారిశ్రామికవేత్తలు, సాంకేతిక సేవా ప్రదాతలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు, బొగ్గు-లిగ్నైట్ కంపెనీలు, పరిశ్రమల సంఘాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని సమృద్ధ బొగ్గు వనరులను కాలుష్య రహితంగా, విలువ ఆధారితంగా వినియోగించుకునే దిశగా బొగ్గు గ్యాసిఫికేషన్‌ను వేగిరపరచడంపై కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి ఈ కార్యక్రమం ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు, విధానపరమైన సహాయక యంత్రాంగాలు, సాంకేతిక ప్రగతి, అమలు వ్యూహాలు సహా దేశంలో పటిష్ట బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసే మార్గాలపై ఈ రోడ్‌షో సందర్భంగా విస్తృత చర్చలు సాగాయి.

గౌరవనీయ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరయ్యారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, ఇతర సీనియర్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రధానోపన్యాసం చేశారు. దేశంలోని అపార వనరులను, పెరుగుతున్న ఇంధన అవసరాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా దాదాపు 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఈ సహజ సంపద రీత్యా భారత్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఈ నిల్వలను వెలికితీస్తే అనేక దశాబ్దాలపాటు అవసరాలు తీరగలవని ఆయన పేర్కొన్నారు. భారత్ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగానే కాకుండా వినియోగదారుగానూ ఉన్నదని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. దేశ విద్యుదుత్పాదన దాదాపు 70 శాతం బొగ్గు ఆధారితమేనని, దీంతోపాటు లక్షలాది మంది జీవనోపాధి ఈ రంగంతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. ఈ సమృద్ధ వనరును మరింత వివేచనతో వినియోగించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. భారత ఇంధన-పారిశ్రామిక భవిష్యత్తుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక పరిణామాత్మక అవకాశమని ఆయన పేర్కొన్నారు.
దేశంలో బొగ్గు నిల్వలు విస్తృతంగా ఉన్నప్పటికీ మిథనాల్, అమ్మోనియా, ఎరువుల ఫీడ్‌స్టాక్ సహా అనేక కీలక పారిశ్రామిక రసాయనాల దిగుమతుల పరాధీనత ఇంకా తొలగలేదని మంత్రి చెప్పారు. ఫలితంగా ఏటా గణనీయ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తున్నదని శ్రీ కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశీయ బొగ్గును విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దిగుమతి పరాధీనతను తగ్గించడం, ఆర్థిక పునరుత్థానాన్ని ఇనుమడింపజేయడం తదితరాల దిశగా బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక వ్యూహాత్మక మార్గం చూపుతుందన్నారు. పారదర్శక, సంప్రదింపుల సహిత అమలు ప్రక్రియకు భరోసా ఇస్తూ, ముసాయిదా ప్రతిపాదనల అభ్యర్థన ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. దీనిపై సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలతోపాటు భాగస్వామ్య సంస్థలన్నిటికీ సూచించారు. తదనుగుణంగా ఈ చట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి విలువైన సూచనలివ్వాలని ఆయన కోరారు.
ఉపరితల బొగ్గు/ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం రూ. 46,000 కోట్లతో సంయుక్త పథకాన్ని కేంద్ర మంత్రివర్గం మొత్తం ఆమోదించడమన్నది దేశ ఇంధన, పారిశ్రామిక ప్రస్థానంలో విప్లవాత్మకమైన ముందడుగు అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భారీ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ఇది నవోత్తేజాన్నిస్తుందన్నారు. సులభతర వాణిజ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ.. ఈ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికీ, పెట్టుబడిదారులకూ సాంకేతిక నిపుణులకూ అనుకూల వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సంప్రదింపులతో కూడిన, పరిశ్రమల అనుకూల, పెట్టుబడిదారుల ఆధారిత విధానంతోనే ఈ బొగ్గు గ్యాసిఫికేషన్ కార్యక్రమం విజయవంతమవుతుందని వివరిస్తూ... పారదర్శకత, జవాబుదారీతనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో రాజీ పడేదే లేదనీ స్పష్టం చేశారు. బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో పెట్టుబడులకు ప్రపంచంలో అత్యంత ఆశాజనక దేశంగా భారత్ నిలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కొత్త శకంలోకి అడుగు పెట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘మన వద్ద బొగ్గు పుష్కలంగా ఉంది. విధానపరమైన మద్దతు మనకుంది. మనం అంకితభావంతో ఉన్నాం. పారిశ్రామిక వృద్ధికీ, ఆత్మనిర్భర్ భారత్‌కూ బొగ్గు గ్యాసిఫికేషన్ సరికొత్త చోదక శక్తిగా నిలుస్తుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.

రోడ్‌షోనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆత్మనిర్భర, వికసిత భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో బొగ్గు గ్యాసిఫికేషన్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యముందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే వ్యాఖ్యానించారు. దేశీయ వనరుల ద్వారానే సొంతంగా ఇంధనాలు, ఎరువులు, రసాయనాలు, ఇతర కీలక పారిశ్రామిక ముడిపదార్థాలను ఉత్పత్తి చేసుకోగలిగే దేశం – మరింత మెరుగ్గా దీర్ఘకాలిక ఇంధన భద్రతను సాధించడంతోపాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుని, ఆర్థిక శక్తిని పెంచుకోగలదని ఆయన స్పష్టం చేశారు.
ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ. 37,500 కోట్ల పథకం.. దేశంలో పుష్కలంగా ఉన్న బొగ్గు వనరులను మరింత సమర్థంగా, సుస్థిరంగా, ఎక్కువ విలువను పొందే పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని శ్రీ దూబే స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం కీలకమైన ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పులపై ధీమా వ్యక్తం చేస్తూ.. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించే అవకాశం లభిస్తుందని, దేశవ్యాప్తంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు పారిశ్రామిక వృద్ధి వేగవంతమవుతుందని శ్రీ దూబే అన్నారు. బొగ్గును అధిక విలువైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా.. గ్యాసిఫికేషన్ ప్రక్రియ దేశ పారిశ్రామిక సామర్థ్యాలను పెంచడమే కాకుండా, ఆర్థికాభివృద్ధికి సరికొత్త మార్గాలను ఆవిష్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని అపారమైన బొగ్గు నిల్వలను – వృద్ధికీ, ఆవిష్కరణలకూ, స్వయంసమృద్ధికీ శక్తిమంతమైన చోదక శక్తిగా నిలిపే సామర్థ్యం బొగ్గు గ్యాసిఫికేషన్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 2047 నాటికి బలమైన, ఒడుదుడుకులను తట్టుకుని నిలవగల, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో ఇదెంతగానో దోహదపడుతుందని శ్రీ దూబే ఆశాభావం వ్యక్తం చేశారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ తన ప్రారంభ ఉపన్యాసంలో.. ఉపరితల బొగ్గు/ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందనీ, ఇది భారీ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన కార్యక్రమమనీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధిక వ్యయంతో భారీ పరిమాణంలో దిగుమతి చేసుకుంటున్న ఇంధనాలు, ఎరువులు, రసాయనాలు, పారిశ్రామిక ముడి పదార్థాలను.. భారత్ సొంత వనరుల నుంచే ఉత్పత్తి చేసుకునేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ మార్గం సుగమం చేస్తుందన్నారు. భారత్‌లో ఉన్న అపారమైన బొగ్గు నిల్వలు దేశానికి ఒక వ్యూహాత్మక ఆస్తి అని వ్యాఖ్యానించారు. ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, ఆత్మనిర్భరతను ముందుకు తీసుకెళ్లడంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ రోడ్‌షోలో ఇచ్చిన హామీ మేరకు.. పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను సేకరించడం కోసం ముసాయిదా ప్రతిపాదనల అభ్యర్థన (ఆర్ఈపీ)ను బహిరంగంగా అందుబాటులో ఉంచినట్టు శ్రీ దత్ తెలిపారు. ఈ పథకాన్ని, ఆర్‌ఎఫ్‌పీ నిబంధనలను స్పష్టంగా వివరించడంతోపాటు భాగస్వామ్య పక్షాల ప్రశ్నలు, ఆందోళనలు, సూచనలను తెలుసుకోవడమే ఈ రోడ్‌షో ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమ తుది రూపకల్పనలో తమవంతు సహకారాన్ని అందించాల్సిందిగా పారిశ్రామిక రంగాన్ని, సాంకేతిక నిపుణులను, ఆర్థిక సంస్థలను ఆయన ఆహ్వానించారు.


మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో స్వయంసమృద్ధికి ఉన్న ప్రాముఖ్యతను శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రధానంగా చెప్పారు. పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాలు దేశీయంగా బలమైన సరఫరా వ్యవస్థను తయారుచేసుకోవాల్సిన అవసరాన్ని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను మరింత స్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపిందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ మద్దతు, రాష్ట్రాల ప్రోత్సాహకాలు, నిరంతర బొగ్గు సరఫరా, డౌన్‌స్ట్రీమ్ మౌలిక సదుపాయాలు అన్నీ కలిసి పెట్టుబడులకు ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని చెప్పారు. ఈ జాతీయ మిషన్‌లో భాగస్వాములు కావాలని పరిశ్రమలకు పిలుపునిస్తూ ఆయన “ఈ అవకాశం అపూర్వమైనది. ఇది ఎంతో అత్యవసరమైంది. ప్రభుత్వ మద్దతు కూడా ఉదారంగా ఉంది. ఇక ఆర్‌ఎఫ్‌పీ మీ చేతుల్లోనే ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రోడ్‌షోలో ‘ఉపరితల బొగ్గు, లిగ్నైట్ వాయువీకరణ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకం’ పరిధిలోని ‘ఆర్ఎఫ్‌పీ’పై (డ్రాఫ్ట్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్‌లో పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్ విధానం, ప్రోత్సాహకాల నిర్మాణం, బొగ్గు అనుసంధాన నిబంధనలు, ప్రాజెక్ట్ కీలక ఘట్టాలు, ఎవాల్యుయేషన్ పారామితులు, భాగస్వామ్య కాలక్రమం వంటి కీలక అంశాలను వివరించారు. పారదర్శకమైన, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంచిన ఈ ముసాయిదా ఆర్‌ఎఫ్‌పీపై అభిప్రాయాలను, సూచనలను అందించాల్సిందిగా భాగస్వాములను కోరారు. భారత్‌కు ఉన్న సాంకేతిక స్వయంసమృద్ధి నిబద్ధతను చాటుతూ బీహెచ్ఈఎల్, సీఐఎంఎఫ్‌ఆర్ సంస్థలు స్వదేశీ బొగ్గు వాయువీకరణ (కోల్ గ్యాసిఫికేషన్) సాంకేతికతలను ప్రదర్శించాయి. క్లస్టర్ ఆధారిత అభివృద్ధి కోసం తమ రాష్ట్రం అందిస్తున్న పాలసీ ప్రోత్సాహకాలను మహారాష్ట్ర తెలియజేయగా.. పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి, బొగ్గు వాయువీకరణ (గ్యాసిఫికేషన్) వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రకటించాయి.


ఈ రోడ్‌షోలో భాగంగా ఒక ఇంటరాక్టీవ్ సెషన్‌తో పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగస్వాములు ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, సాంకేతిక భాగస్వామ్యాలు, బొగ్గు లభ్యత, చట్టపరమైన అనుమతులు, పర్యావరణ అనుమతులు, మౌలిక సదుపాయాల అవసరాలు, డౌన్‌స్ట్రీమ్ అవకాశాలపై పలు వివరణలను కోరారు. పథకంలోని వివిధ నిబంధనలపై మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు వివరణాత్మక సమాధానాలను అందించారు. ఈ చర్చలు అభివృద్ధి చెందుతున్న బొగ్గు వాయువీకరణ రంగంపై పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు, ఆర్థిక సంస్థలకు ఉన్న తీవ్ర ఆసక్తిని తెలియజేశాయి.
భారతదేశ ఇంధన, పారిశ్రామిక భవిష్యత్తుకు ‘బొగ్గు వాయువీకరణ’ ఒక వ్యూహాత్మక ఆధారమని.. దీనిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనే బలమైన పునరుద్ఘాటనతో ఈ రోడ్‌షో ముగిసింది. నిరంతర విధానపరమైన మద్దతు, పరిశ్రమల భాగస్వామ్యం, సాంకేతిక భాగస్వామ్యాలు, భాగస్వాముల సమన్వయంతో ఈ పథకం పెట్టుబడులు, ఉపాధి కల్పన, దిగుమతుల ప్రత్యామ్నాయం, దేశీయ బొగ్గు వనరుల విలువ ఆధారిత వినియోగానికి సరికొత్త అవకాశాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, కీలకమైన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను పెంపొందించొచ్చు. దీనితో పాటు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, స్వయంసమృద్ధ భారత్- బలమైన పారిశ్రామిక భవిష్యత్తు దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బొగ్గు వాయువీకరణ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2271921)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English