రక్షణ మంత్రిత్వ శాఖ
గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే ‘రుద్రమ్-II’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ, భారత వాయుసేన
प्रविष्टि तिथि:
02 JUN 2026 7:11PM by PIB Hyderabad
డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ), భారత వాయుసేన కలిసి గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే 'రుద్రమ్-II' క్షిపణిని యుద్ధ విమానం ద్వారా విజయవంతంగా పరీక్షించాయి. అత్యంత కఠినమైన క్షిపణి గమన మార్గంతో నిర్వహించిన ఈ పరీక్షల్లో అన్ని ఉప-వ్యవస్థల సామర్థ్యం విజయవంతంగా నిరూపితమైంది.
QCV8.jpeg)
యుద్ధ విమానం నుంచి విడివడిన తర్వాత ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో ముందుగా నిర్ణయించిన లక్ష్యం వైపు దూసుకెళ్లాయి. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో (ఐటీఆర్) మోహరించిన వివిధ రేంజ్ పరికరాల ద్వారా సేకరించిన ఫ్లైట్ డేటా ఆధారంగా లక్ష్యాలన్నింటినీ ఈ పరీక్ష పూర్తిగా సాధించినట్లు నిర్ధారించారు.
ఈ క్షిపణి విషయంలో నోడల్ ల్యాబొరేటరీగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని 'రిసెర్చ్ సెంటర్ ఇమారత్' (ఆర్‍సీఐ).. డీఆర్‌డీఓకి చెందిన ఇతర పరిశోధనా సంస్థలైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్‌డీఎల్), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ఈఎంఆర్ఎల్), ఆర్మమెంట్ రీసెర్చ్ - డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), ఐటీఆర్‌ల సహకారంతో ఈ 'రుద్రమ్-II' క్షిపణిని పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. డీసీపీపీలతో (డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్‌నర్స్) పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), రీజినల్ సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్దినెస్ (ఆర్‌సీఎంఏ), మిస్సైల్ సిస్టమ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీ (ఎంఎస్‌క్యూఏఏ) వంటి ప్రభుత్వ సంస్థలు, అనేక ఇతర ప్రైవేట్ పరిశ్రమలు ఈ క్షిపణి విషయంలో గణనీయమైన సహకారాన్ని అందించాయి.
ఈ క్షిపణి పరీక్ష విజయవంతమవటం పట్ల రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ, భారత వాయుసేన (ఐఏఎఫ్), డిఫెన్స్ పీఎస్‌యూలు (డీపీఎస్‍యూ), డీసీపీపీలు, రక్షణ రంగ పరిశ్రమల కృషిని ఆయన కొనియాడారు. ఈ పరీక్షలు పెరుగుతున్న స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని.. అత్యాధునిక ఆయుధ వ్యవస్థల్లో భారత్‌ను ఆత్మనిర్భరత వైపు నడిపించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ విజయాన్ని సాధించడంలో భాగస్వాములైన అన్ని బృందాలకు రక్షణ పరిశోధన- అభివృద్ధి శాఖ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2268252)
आगंतुक पटल : 38