బొగ్గు మంత్రిత్వ శాఖ
ఉపరితల బొగ్గు.. లిగ్నైట్‌ను వాయువుగా మార్చే ప్రాజెక్టులకు ప్రోత్సాహక పథకంపై బొగ్గు శాఖ రోడ్‌షో
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 4:36PM by PIB Hyderabad
దేశంలో ఉపరితల బొగ్గు, లిగ్నైట్‌లను వాయువుగా మార్చే ప్రాజెక్టులకు ప్రోత్సాహక పథకంపై బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవాళ న్యూఢిల్లీలో రోడ్‌షో నిర్వహించింది. పలువురు విధాన రూపకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక సేవా ప్రదాతలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు సహా బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోని కీలక భాగస్వాములు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరయ్యారు. వారితోపాటు బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, ఇతర సీనియర్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
బొగ్గును వాయువుగా మార్చడం ద్వారా సాధించగల అపార ఇంధన సామర్థ్యం, కొత్త పథకం కింద విధానపరంగా లభించే మద్దతు సహా ఈ వ్యూహాత్మక రంగంలో భారీ స్థాయి భాగస్వామ్యానికిగల వినూత్న అవకాశాలను ఈ రోడ్‌షో ప్రస్ఫుటం చేసింది. దేశమంతటా విస్తృతంగా లభ్యమయ్యే బొగ్గు వనరులను మరింత పరిశుభ్రంగా, సమర్థంగా వాడుకునే దిశగా చర్చలు, సహకారం, భాగస్వామ్యాలపై అవగాహనకు ఈ కార్యక్రమం ఓ కీలక వేదికగా కూడా ఉపయోగపడింది.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రధానోపన్యాసమిస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన మన దేశం భవిష్యత్ సంసిద్ధంగా రూపొందుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో స్వయంసమృద్ధి, సురక్షిత ఇంధన వ్యవస్థగా మారడంలో స్థిరంగా పురోగమిస్తోందని తెలిపారు. దేశ పారిశ్రామిక, ఆర్థిక వికాసం దిశగా బొగ్గు గ్యాసిఫికేషన్ కీలక పునాది కాగలదని వివరించారు. ఇది కేవలం ఇంధన కార్యక్రమం స్థాయికి పరిమితం కాదని, ఒక వ్యూహాత్మక జాతీయ లక్ష్యంతో దిగుమతి పరాధీనత తగ్గించడానికి బాటలు వేస్తుందన్నారు. దీంతోపాటు స్వచ్ఛమైన బొగ్గు వినియోగానికి ప్రోత్సాహం సహా ఎరువులు, పెట్రోరసాయనాలు, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమలలో కొత్త అవకాశాల సృష్టికి దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బొగ్గును గ్యాస్‌గా మార్చే ప్రాజెక్టులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టులను వేగిరపరచేందుకు ఇప్పటికే రూ.8,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిందని, దీనికితోడు ఇటీవలే అదనంగా రూ.37,500 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా ఆమోదించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం సహా భారీ సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఎరువులు, మిథనాల్, హైడ్రోజన్, పెట్రోరసాయనాలు వంటి రంగాల్లో పటిష్ట పారిశ్రామిక విలువ వ్యవస్థ రూపొందుతుందని ఆయన అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నానాటికీ మారే ధోరణులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో అస్థిరత, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ గతిశీలత తదితరాల నడుమ వివేచనతో వ్యవహరించాల్సి ఉందన్నారు. తదనుగుణంగా జాతీయ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, వ్యూహాత్మక పారిశ్రామిక భద్రతల దిశగా పునరుత్థాన దేశీయ పారిశ్రామిక సామర్థ్యాల బలోపేతం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో బలమైన విధాన మద్దతు, అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలు, కాలుష్య రహిత బొగ్గు సాంకేతికతలు, సుస్థిర పారిశ్రామిక ప్రగతిలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి దేశంలోని విస్తృత బొగ్గు నిల్వలు పటిష్ట పునాది ఏర్పరుస్తున్నాయని మంత్రి వివరించారు.
మిథనాల్, అమ్మోనియా, ఎరువులు, ఇతర కీలక రసాయనాల కోసం దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితిని బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ గణనీయంగా తగ్గించగలదని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. తద్వారా ప్రపంచ వాణిజ్య ఒడుదొడుకులు, ధరల అనిశ్చిత వంటి పరిస్థితుల నుంచి రైతులు, పరిశ్రమలు సహా వినియోగదారులకు రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియలో ఒక ప్రధాన ప్రపంచ కూడలిగా ఎదగడానికి అవసరమైన వ్యవస్థలు, సంస్థాగత-సాంకేతిక సామర్థ్యం భారత్‌కు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియ విలువ వ్యవస్థ అంతటా ఈ కార్యక్రమం అమలును వేగిరపరచడంలో వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అగ్ర పారిశ్రామిక సంస్థలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, సాంకేతిక భాగస్వాములను ఒకే వేదికపైకి తెచ్చే బలమైన “ఏకోన్ముఖ విధానం” అనుసరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. సమన్వయ కృషి, పరిశ్రమల భాగస్వామ్యంతో బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియ ద్వారా దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత, పారిశ్రామిక స్వావలంబన సాకారం కాగలవన్నారు. అంతేగాక 2047 నాటికి దేశం ‘వికసిత భారత్’గా రూపొందాలన్న సంకల్ప సాకారంలో ఇదొ మూలస్తంభం కాగలదని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియను ప్రోత్సహించడంతోపాటు దేశీయ అపార బొగ్గు వనరుల మరింత పరిశుభ్ర రీతిలో వాడుకునే దిశగా ప్రభుత్వం ఆమోదించిన రూ.37,500 కోట్ల విలువైన పథకం ఒక నిర్ణయాత్మక ముందడుగని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌ఎన్‌జీ, మిథనాల్, అమ్మోనియా, యూరియా, అమ్మోనియం నైట్రేట్, కోకింగ్ కోల్ వంటి ఉత్పత్తుల దిగుమతి పరాధానతను ఈ ప్రక్రియ గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. అంతేకాకుండా దేశ ఇంధన భద్రతను, పారిశ్రామిక స్వావలంబనను మరింత పటిష్ఠం చేస్తుందన్నారు.
పెట్టుబడుల వేగం పెంచడంలోనూ ఈ కార్యక్రమం సానుకూల ప్రభావం చూపుతుందని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందివస్తాయని తెలిపారు. ముఖ్యంగా దేశంలో బొగ్గు నిక్షేపాలుగల, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని శ్రీ దూబే స్పష్టం చేశారు. ఈ దిశగా భాగస్వామ్య సంస్థల ఉత్సాహపూరిత భాగస్వామ్యాన్ని అభినందించారేఉ. బొగ్గు వనరులను మరింత సుస్థిర, విలువ జోడింపు రీతిలో వినియోగించుకోవడానికి భరోసా ఇవ్వడంతోపాటు బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియతో సరికొత్త వృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రోడ్‌షో ప్రారంభం సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ స్వాగతోపన్యాసం చేశారు. పారిశ్రామిక పరిణామాశీలత, వ్యూహాత్మక స్వావలంబన, జాతీయ పునరుత్థాన సామర్థ్యాల రీత్యా తదుపరి అధ్యాయం దిశగా భారత్ తన సొంత వనరులు, నైపుణ్యం సద్వినియోగానికి కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి కీలక మలుపులో ఈ కృషి ఇంధన భద్రతకు పరిమితం కాదని, వ్యూహాత్మక దిగుమతులపై పరాధీనతను తగ్గించడానికీ ఎంతో ముఖ్యమని తెలిపారు. మరోవైపు పారిశ్రామిక సరఫరా వ్యవస్థల బలోపేతం, దేశీయ ఉత్పాదక సామర్థ్య సృష్టి, సమృద్ధ సహజ వనరుల సద్వినియోగంతో అధిక విలువను రాబట్టడం వంటి వాటికీ ఇదెంతో అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ జాతీయ కృషిలో పారిశ్రామిక రంగానికి సమాన భాగస్వామ్యంతో ఆహ్వానం పలుకుతూ, రోడ్‌షోలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు సంబంధిత వర్గాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోని విస్తృత బొగ్గు, లిగ్నైట్ నిల్వలను జాతీయ సంపదగా అభివర్ణిస్తూ- దీన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నది కాకుండా ఎంత వివేచనాత్మకంగా వాడుకుంటారన్నదే ముఖ్యమని శ్రీ దత్ వివరించారు. బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియే ఇందుకు సముచిత పరిష్కారమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా బొగ్గును సింథటిక్ సహజ వాయువు, యూరియా, మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్ సహా ఉక్కు ఉత్పత్తి కోసం డీఆర్ఐ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే వీలుంటుందన్నారు. తద్వారా కీలక రంగాలలో దిగుమతులపై పరాధీనత తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి రూ.37,500 కోట్ల వ్యయంతో ఆమోదించిన ఆర్థిక సహాయ ప్యాకేజీ పథకం ద్వారా బొగ్గు నిల్వలున్న ప్రాంతాలలో దాదాపు 25 కొత్త వాయువుగా మార్చే ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. దీంతో రూ.2.5 నుంచి 3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులను సమీకరించవచ్చునని, సుమారు 50,000 ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగావకాశాలు అందివస్తాయని అంచనా వేశారు. సాంకేతికత సహా ఇతరత్రా చట్రాలు సహా లక్ష్యనిర్దేశిత అమలు-పర్యవేక్షణ యంత్రాంగాల ద్వారా జవాబుదారీతనానికి భరోసా లభిస్తుందని, ప్రాజెక్టులు నెలకొల్పే వారికి సౌలభ్యం కల్పిస్తుందని ఆయన విశదీకరించారు.
ప్రపంచ ఇంధన, వస్తు సరఫరా వ్యవస్థలలో భౌగోళిక రాజకీయ మార్పుల ప్రభావాన్ని శ్రీ దత్ ప్రస్తావించారు. పశ్చిమాసియాలో సంఘర్షణ నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, రసాయనాలు, ఉక్కు రంగాలలో వ్యూహాత్మక స్వావలంబన ఆవశ్యకత మరింత ప్రస్ఫుటం అవుతున్నదని వివరించారు. దేశంలో బొగ్గు నిల్వలు మనకు కేవలం సరకుకు పరిమితం కాదని స్పష్టం చేస్తూ- దేశ దీర్ఘకాలిక ఆర్థిక, పారిశ్రామిక పునరుత్థాన సామర్థ్యాన్ని బలోపేతం చేయగల ఒక వ్యూహాత్మక సంపదగా వీటిని పరిగణించాలని గుర్తుచేశారు. సకాలంలో పథకాల అమలు, పటిష్టమైన నిర్వహణ, పారిశ్రామిక భాగస్వామ్యంపై ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తూ, ఈ పరిణమశీల కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకోవాలని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, సాంకేతిక సేవా ప్రదాతలు, ఆర్థిక సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. “ఇదొక అపూర్వ అవకాశం... అవసరం.. అత్యావశ్యకం.. ఇందుకు ఉదార మద్దతుంది.. ఇదే సరైన సమయం” అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రోడ్‌షోలో భాగంగా ఆసక్తికర చర్చలు-ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా నిర్వహించారు. ఉపరితల బొగ్గు, లిగ్నైట్‌లను వాయువుగా మార్చే ప్రాజెక్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు, విధాన ప్రోత్సాహకాలు, సాంకేతిక సంసిద్ధత, అమలు నమూనాలు, విస్తృత సహాయక చట్రం సంబంధిత అంశాలపై సంభావ్య పెట్టుబడిదారులు-భాగస్వాములు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. బొగ్గును వాయువుగా మార్చే ప్రాజెక్టులపై పారిశ్రామికవేత్తలలో పెరుగుతున్న విశ్వాసాన్ని, భాగస్వాములను చురుకుగా మమేకం చేయడంతోపాటు వారికి సౌకర్యాలు కల్పించడంపై మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ పరస్పర చర్చలు ప్రతిబింబించాయి.
బొగ్గును వాయువుగా మార్చే ప్రాజెక్టులపై అనుభవాల ఆదానప్రదానానికి, భాగస్వామ్యాల ఏర్పాటుతోపాటు సహకారంపై చర్చలకు ఈ రోడ్‌షో విలువైన వేదికగా మారింది. తద్వారా ఈ ప్రాజెక్టులపై ఇనుమడిస్తున్న ఆసక్తిని, ఉత్సాహాన్ని మరింత బలోపేతం చేసింది. స్వయంసమృద్ధ భారత్, వికసిత భారత్ దార్శనికతకు అనుగుణంగా నిరంతర విధాన మద్దతు, భాగస్వాముల సహకారం, సాంకేతిక పురోగమనం, దేశీయ బొగ్గు వనరుల సమర్థ వినియోగం వైపు ఈ రోడ్‌షో ఒక సమగ్ర అవగాహన కల్పించింది. తద్వారా భవిష్యత్ సంసిద్ధ బొగ్గు గ్యాసిఫికేషన్ రంగం అభివృద్ధికి బాటలు వేయడంపై బొగ్గు మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2266416)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10