ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి


వడగాడ్పుల మధ్య దుర్బల వర్గాలు జాగరూకతతో మెలగుతూ, తగినంత నీటిని తీసుకుంటూ, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని

పశు, పక్ష్యాదులకీ, తీవ్ర వేడిమి ప్రభావానికి లోనైన వర్గాలకీ సాయపడాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి వినతి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 11:21AM by PIB Hyderabad

దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతున్న నేపథ్యంలో సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
తగినంతగా తాగునీటిని సేవిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు వెంట తీసుకువెళ్లాలని, కఠిన వాతావరణ స్థితుల్లో ఇతరులకు తాగునీటిని అందించి సాయపడాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు.
ఉష్ణ తాపం నీరసాన్ని కలిగిస్తుందని, ఫలితంగా తల తిప్పట, కళ్లు తిరగడం, వికారం కలగడం, తీవ్ర అలసటకు లోనవడం వంటి సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధానమంత్రి సూచించారు.
పిల్లలు, వ‌ృద్ధులు, బయటి ప్రదేశాల్లో పనిచేసే వాళ్లూ మరీ ముఖ్యంగా తీవ్ర ఎండవేడిమి స్థితిలో దుర్బలులుగా మారుతారని, హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోతే ఎండదెబ్బ తగలవచ్చని శ్రీ మోదీ తెలిపారు.
వయస్సులో పెద్దవారైన తల్లితండ్రుల్ని, అవ్వాతాతల్ని, ఆత్మీయుల బాగోగులను వేడిగాడ్పుల వేళల్లో క్రమం తప్పక చూసుకోవాలని, తగినంతగా నీళ్లు తాగమంటూ వారికి గుర్తు చేస్తుండాలని, మధ్యాహ్న వేళల్లో ఇంటి బయటకు వెళ్లకుండా విశ్రాంతిని తీసుకోవాల్సిందిగా చెప్పాలని కూడా ప్రజలకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
విపరీత వాతావరణ స్థితుల కాలంలో కరుణతో వ్యవహరించాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇళ్ల బయట, బాల్కనీల్లో, మేడల పైన, దుకాణాలు, కార్యాలయాల్లో పశు, పక్ష్యాదుల కోసం నీళ్ల గిన్నెల్ని ఉంచాల్సిందిగా ఆయన సూచించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను వరుసగా పొందుపరుస్తూ:
‘‘భారత్‌లోని విభిన్న ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలను, తద్వారా సవాళ్లనూ ఎదుర్కొంటున్నాయి. ఈ వేడిమి మనందరినీ బాధిస్తోంది. మీరందరూ సాధ్యమైనన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. దయచేసి తగినంతగా నీరు తాగుతూ ఒంట్లో నీటి పాళ్లు సరిపడా ఉండేలా చూసుకోండి.. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు మీ దగ్గర నీళ్లు ఉంచుకోండి. ఇతరులకు ఓ గ్లాసుడు నీళ్లు ఇవ్వండి. ఇలాంటి వాతావరణంలో, కరుణ చూపే కార్యాలు ఎంతో మేలును చేస్తాయి.’’
‘‘తల తిరగడం, వాంతులు, విపరీతంగా అలుపు, ఆయాసం రావడం ఇవన్నీ ఎండ కారణంగా కలిగే నిస్సత్తువకు సూచికలు. వీటిని గమనించుకుంటూ ఉండాలి. ఎవరికైనా అసాధారణ అస్వస్థత ఏర్పడినా, బలహీనంగా ఉన్నా, లేదా తలనొప్పి వచ్చినా, వారు వెంటనే చల్లని నీడ ఉన్న చోటుకు చేరుకొనేందుకు వారికి తోడ్పడితే మేలు. వారికి నీళ్లు, లేదా ఓఆర్ఎస్ లభించేటట్లు చూస్తే అది వారికి సహాయం చేసినట్లే అవుతుంది.  బాలలు, వయోవృద్ధులు, బయటి ప్రదేశాల్లో పని చేసే వాళ్లూ తీవ్రమైన ఎండ వల్ల ముఖ్యంగా ప్రభావితులవుతారు. హెచ్చరిక సంకేతాల్ని పట్టించుకోలేదంటే తక్షణం అపాయకర స్థితి ఎదురవుతుంది.. ఇది వడదెబ్బకు కూడా దారితీయవచ్చు. ఇలాంటి వాతావరణంలో, సకాలంలో చూపే శ్రద్ధ, సావధానతలతో ఎంతో ప్రయోజనం ఉంటుంది.’’

‘‘సాధ్యం అయినంతవరకూ, వయసు పైబడిన తల్లిదండ్రులను, అవ్వాతాతలను, ఆత్మీయులను ఈ వడగాడ్పుల కాలంలో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. వారు తగినంతగా నీళ్లనీ, ద్రవపదార్థాల్నీ తాగుతూ ఉండేలా గమనించుకోండి. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లవద్దు. ఎంతవరకూ సాధ్యపడితే అంతవరకూ విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.’’
‘‘ఈ అత్యధిక వేడిమి కాలంలో, మన పరిసరాల్లోని పశు, పక్ష్యాదుల సంగతిని కూడా గుర్తుపెట్టుకొని వాటిని పట్టించుకుందాం.. రండి. మీ ఇల్లు, బాల్కనీలు, మేడలు, దుకాణాలు లేదా ఆఫీసుల బయట నీళ్లు పోసిన చిన్న పాత్రల్ని ఉంచారంటే అది దాహార్తిని గొన్న ఒక పక్షికి చేసిన జీవన దానంతో సమానమవుతుంది. ఈ కష్ట కాలంలో దయాదృష్టి మనకు దారిని చూపేటట్లుగా వ్యవహరిద్దాం.’’
‘‘దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతోంది. మరి దీనికి తోడు రోజువారీ జీవనంలో వేడిమితో కలిగే అనేక ఇక్కట్లూ పెరుగుతున్నాయి. మీరు ఎంత ఎక్కువ చైతన్యంతో ఉండగలిగితే అంతగానూ తప్పక మసలుకోవాలని దేశ ప్రజలకు నేను విన్నవిస్తున్నాను. దయచేసి మీరు ఒంట్లో నీళ్ల శాతం తగినంత ఉండేటట్లు చూసుకోండి, ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వెంట నీళ్లను తీసుకువెళ్తూ ఉండండి. ఇలాంటి కాలంలో మీరు ఎంతగా ప్రతిస్పందన పూర్వకంగా మెలిగితే అది అంత పెద్ద ఊతంగా మారుతుంది. వీలయితే, దాహంతో ఉన్న వ్యక్తికి ఒక గ్లాసుడు నీళ్లను తప్పక అందించండి. ఇళ్ల బయటా, దుకాణాల వెలుపలా ఒక కుండలో నీళ్లను ఉంచి, ఆ నీటి కుండలో నుంచి నీళ్లు తీసుకొని తాగగలిగే పరిస్థితిని ఏర్పరించే వాళ్లను నేను మెచ్చుకుంటాను.’’
‘‘అత్యధిక వేడిమితో కలిగే ఇబ్బందులు.. ఒళ్లూ, కళ్లూ తిరుగుతున్నట్లున్నా గానీ, లేదా వాంతులవుతుంటే గానీ, లేదా బాగా ఎక్కువ అలసటగా అనిపిస్తున్నా గానీ ఆ లక్షణాలను ఎంతమాత్రం చిన్నచూపు చూడవద్దు. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పినట్లు కనిపించినా, లేదా బలహీనంగా ఉన్నట్లు తోచినా, లేదా అనారోగ్యంగా ఉన్నట్లు మీరు భావించినా, అప్పుడు ఆ వ్యక్తిని వెంటనే ఏదైనా చల్లని ప్రదేశానికో, నీడ ఉన్న ప్రాంతంలోకో తీసుకువెళ్లండి. ఆ వ్యక్తికి తాగడానికి నీళ్లు గాని, లేదా ఓఆర్ఎస్ గాని, లేదా ఇతర పానీయాలని గానీ ఇవ్వండి.. ఇలా చేసినందువల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. పిల్లలు, పెద్దవాళ్లు, ఎండలో పనిచేసే వాళ్లు ఈ భీకరమైన వేడిమితో అందరి కన్నా ఎక్కువ ప్రభావితులవుతారు. సకాలంలో శ్రద్ధ తీసుకోకపోతే, ఈ స్థితి వడదెబ్బ వంటి గంభీర సమస్యగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు కనబరిచే అవగాహన, సంరక్షణ ఒక వ్యక్తి జీవనాన్ని కాపాడ గలుగుతాయి.’’
‘‘సాధ్యమైనప్పుడల్లా, మీ తల్లితండ్రులు, తాత- అవ్వలకు, ఇతర ప్రయోజనాలకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలను తప్పక అడిగి తెలుసుకుంటూ ఉండండి. చాలినంత నీటిని తాగాల్సిందని, మధ్యాహ్నం ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు పోవద్దని, వీలయినంత వరకూ విశ్రాంతి తీసుకోవాల్సిందని వారికి సలహాలు చెబుతూ ఉండండి.’’
‘‘ఈ ప్రచండ తాపంలో మనం మన చుట్టుపక్కల పశు, పక్షులను కూడా పట్టించుకోవాలి. మన ఇల్లు, బాల్కనీ, మిద్దె, దుకాణం లేదా కార్యాలయాలకు వెలుపల నీళ్లతో నిండిన ఒక చిన్నపాటి బకెటును ఉంచారంటే దాహంతో అల్లాడే పక్షుల ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. రండి.. ఈ కఠినమైన రోజుల్లో పూర్తి ప్రతిస్పందన గుణంతో, కరుణ తో ఒకరి పట్ల మరొకరం మరింత శ్రద్ధ వహిద్దాం’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2265803) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam