ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఖండాంతర భద్రతకు ముప్పు కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ఆఫ్రికా సీడీసీ
కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన కేంద్ర ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2026 8:24AM by PIB Hyderabad
కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ (డీఆర్‌సీ), ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్)- 2005 ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).. 2026 మే 17న ఈ పరిస్థితిని 'అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి'గా (పీహెచ్ఈఐసీ) ప్రకటించింది.
కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, ఉగాండాలను అతలాకుతలం చేస్తున్న 'బుందిబుగ్యో' రకం ఎబోలా వైరస్ వ్యాప్తిని ‘ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (ఆఫ్రికా సీడీసీ)’ కూడా అధికారికంగా 'ఖండాంతర భద్రతకు మప్పు కలిగింగే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి'గా (పీహెచ్ఈసీఎస్) ప్రకటించింది.
డబ్ల్యూహెచ్ఓ ఐహెచ్‌ఆర్ అత్యవసర కమిటీ 2026 మే 22న తాత్కాలిక సిఫార్సులను జారీ చేసింది. దీని ప్రకారం 'బుందిబుగ్యో వైరస్ వ్యాప్తి నమోదైన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో నిర్ధారణ కాని జ్వరానికి సంబంధించిన లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం, పరీక్షించడం, నివేదించడం, పర్యవేక్షించడం' కోసం సరిహద్దు ప్రవేశ కేంద్రాల వద్ద వ్యాధి నిఘాను బలోపేతం చేయాలని సూచించింది. అదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రయాణికులను కోరింది.
డీఆర్‌సీ, ఉగాండా దేశాల సరిహద్దు ప్రాంతాలతో పాటు దక్షిణ సూడాన్‌ను కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చేర్చారు.
'బుందిబుగ్యో' రకం ఎబోలా వైరస్ వల్ల 'రక్తస్రావంతో కూడిన జ్వరం’ (హెమరేజిక్ ఫీవర్) వస్తుంది. ఇది అత్యధిక మరణాల రేటు కలిగి ఉన్న తీవ్రమైన వ్యాధి. ప్రస్తుతం బుందిబుగ్యో వైరస్ రకం వల్ల వచ్చే ఎబోలా వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఆమోదం పొందిన ఎలాంటి టీకాలు లేదా ప్రత్యేక చికిత్సా విధానాలు లేవు.
భారతదేశంలో ఇప్పటి వరకు బుందిబుగ్యో రకానికి చెందిన ఎబోలా వ్యాధి కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
డీఆర్‌సీ, ఇతర ప్రభావిత దేశాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులకు అనుగుణంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ సూచించింది.
ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న భారతీయులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సూచనలను ఇక్కడ పొందొచ్చు:
https://mohfw-dohfw.gov.in/static/uploads/2026/05/2c1ba58591b94ed8a892935e75e8006f.pdf
(రిలీజ్ ఐడి: 2264739)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10