వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భవ్య పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన డీపీఐఐటీ
సమీకృత పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత తయారీ రంగాన్ని బలోపేతం చేయనున్న భవ్య పథకం
భవ్య పథకం కింద రూ. 3360 కోట్లతో 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAY 2026 5:05PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్టుబడులకు సిద్ధంగా ఉండే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక కేంద్ర పథకం - భవ్య - అమలుకు సంబంధించి భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సమగ్ర కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది.
మేక్ ఇన్ ఇండియా, పీఎం గతిశక్తి కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా భారత తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి భవ్య పథకాన్ని రూపొందించారు. భారత్ ను ప్రపంచస్థాయి పోటీ సామర్థ్యం కలిగిన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ విస్తృత దృష్టికోణాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది.
ఈ పథకం 2026-27 నుంచి 2031-32 మధ్య ఆరేళ్ల కాలంలో సుమారు రూ.33,660 కోట్ల రూపాయల వ్యయంతో 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. మొదటి దశలో పోటీ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా 50 పారిశ్రామిక పార్కుల వరకు ఎంపిక చేస్తారు.
పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ప్రాజెక్టుల ఎంపిక విధానం, నిధుల సమీకరణ, పరిపాలనా వ్యవస్థ, పర్యవేక్షణ పద్ధతులు, అమలు విధానాల కోసం ఒక సమగ్రమైన ప్రణాళికను పొందుపరుస్తూ ఈ మార్గదర్శకాలు రూపొందించారు.
వెంటనే పని ప్రారంభించగల మౌలిక సదుపాయాలు, బహుళ రవాణా అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, కార్మికులకు సహాయక మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరిపాలన విధానాలు, సుస్థిరమైన అభివృద్ధి లక్షణాలతో కూడిన పెట్టుబడులకు సిద్ధంగా ఉండే పారిశ్రామిక వ్యవస్థల సృష్టిపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది.
ఈ మార్గదర్శకాలు సరికొత్తగా నిర్మించే పారిశ్రామిక పార్కులతో పాటు అర్హత కలిగిన పాత పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కూడా అవకాశం కల్పిస్తాయి. పర్వత ప్రాంతాలు లేని రాష్ట్రాలకు కనీసం వంద ఎకరాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాలకు ఇరవై ఐదు ఎకరాల కనీస భూమి అవసరమని నిర్దేశించారు. ఈ పథకం వెయ్యి ఎకరాల వరకు ఉండే పెద్ద పార్కులను పరిశీలించడానికి కూడా అనుమతిస్తుంది.
పోటీ ఆధారిత ఎంపిక విధానం కింద ప్రతిపాదనలను మౌలిక సదుపాయాల నాణ్యత, బహుముఖ రవాణా అనుసంధానం, స్థల అనుకూలత, పారిశ్రామిక వ్యవస్థ బలం, విధానపరమైన సౌలభ్య, డిజిటల్ నిర్వహణ సన్నద్ధత, దీర్ఘకాలిక స్థిరత్వం వంటి నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా మదింపు చేస్తారు.
ఈ మార్గదర్శకాలు భూగర్భ వినియోగ వ్యవస్థలు, నీటి వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు, వ్యర్థ జలాల శుద్ధి వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు, కార్మికుల వసతి గృహాలు, పరీక్షా ప్రయోగశాలలు, డిజిటల్ సింగిల్ విండో విధానాలు, నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలు, సమన్వయ ఉమ్మడి మౌలిక సదుపాయాలు వంటి అంశాల నాణ్యత ఆధారంగా ప్రతిపాదనల అనుమతులకు అవకాశం కల్పిస్తాయి.
భవ్య పథకం కింద ప్రాజెక్టుల అమలును కంపెనీల చట్టం, 2013 కింద ఏర్పాటైన ప్రత్యేక ప్రయోజన సంస్థల (ఎస్పీవీ) ద్వారా చేపడతారు. ఈ ప్రత్యేక ప్రయోజన సంస్థలు ప్రాజెక్టు ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ, పాలన, పెట్టుబడిదారుల సదుపాయాలు, ఈ పథకం కింద సృష్టించిన ఆస్తుల దీర్ఘకాలిక సంరక్షణకు బాధ్యత వహిస్తాయి.
ప్రత్యేక ప్రయోజన సంస్థకు బదిలీ చేసిన భూమి విలువ, నిర్దేశిత ప్రాజెక్టు పురోగతి ఆధారంగా ఈ పథకం ఈక్విటీ వాటా రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం అమలు, పర్యవేక్షణ కోసం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) ను ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (పీఎంఏ)గా నియమించారు.
పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో ప్రాజెక్ట్ సంబంధిత ఎస్పీవీల ద్వారా ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యం కోసం కూడా మార్గదర్శకాల్లో ప్రత్యేక నిబంధనలను చేర్చారు. వీటిలో స్పష్టంగా నిర్వచించిన పరిపాలనా వ్యవస్థలు, పారదర్శకతపరమైన రక్షణలు, జవాబుదారీతన యంత్రాంగాలు ఉంటాయి.
సమర్థవంతమైన అమలు, పారదర్శకత కోసం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, క్రమబద్ధమైన పురోగతి నివేదికలు, ఆడిట్ విధానాలు, డీపీఐఐటి కార్యదర్శి అధ్యక్షతన జాతీయ స్థాయి సారథ్య సంఘం పర్యవేక్షణను ఈ మార్గదర్శకాల్లో తప్పనిసరి చేశారు.
రవాణా, నైపుణ్యాభివృద్ధి, స్థిరత్వం, పునరుత్పాదక ఇంధనం, వినియోగ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి కోసం సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలతో సమన్వయం సాధించడానికి ఈ మార్గదర్శకాలు మరింతగా వీలు కల్పిస్తాయి.
మార్గదర్శకాల విడుదల భవ్య పథకం అమలుకు, ప్రపంచ ప్రమాణాలకు సరితూగే పారిశ్రామిక మౌలిక సదుపాయాల సృష్టికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. ఇవి తయారీ రంగానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఉపాధి కల్పనకు, ప్రపంచ విలువ శ్రేణులతో భారత్ అనుసంధానాన్ని మెరుగుపరచడానికి దోహదపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2264731)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18