వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జెనీవాలో ఇథియోపియా డబ్ల్యూటీఓ సభ్యత్వం కోసం ద్వైపాక్షిక చేరిక ప్రోటోకాల్‌పై సంతకాలు చేసిన భారత్, ఇథియోపియా


డబ్ల్యూటీఓ చేరిక ప్రక్రియ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల అనుసంధానానికి మద్దతును పునరుద్ఘాటించిన భారత్

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 9:36PM by PIB Hyderabad

ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీఓ) ఇథియోపియా చేరికకు సంబంధించి 2026 మే 22న జెనీవాలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో భారత్, ఇథియోపియాలు ద్వైపాక్షిక చేరిక ప్రోటోకాల్‌పై సంతకాలు చేశాయి. ఈ ప్రోటోకాల్‌పై భారత్‌ తరఫున డబ్ల్యూటీఓలోని అంబాసిడర్, శాశ్వత ప్రతినిధి డాక్టర్ సెంథిల్ పాండియన్ సీ.. ఇథియోపియా తరఫున జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం, ఇతర అంతర్జాతీయ సంస్థ‌ల్లోని ఇథియోపియా అంబాసిడర్- శాశ్వత ప్రతినిధి త్సేగాబ్ కెబెబెవ్ దాకా సంతకాలు చేశారు. సంతకాల ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు ఈ ప్రోటోకాల్, దాని అనుబంధ పత్రాలను అధికారికంగా డబ్ల్యూటీఓ సచివాలయానికి అందజేశారు. 

సమ్మిళిత, సమత్యులమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు అత్యల్ప అభివృద్ధి దేశాలను బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ, అంతర్జాతీయ విలువ గొలుసులతో సంపూర్ణంగా  అనుసంధానించటం అత్యంత కీలకమని భారత్ గుర్తిస్తోంది. ఇందులో భాగంగానే డబ్ల్యూటీఓలో ఆయా దేశాల చేరికకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తూ వస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మార్గదర్శకత్వంలో ఈ ఒప్పందంపై వేగంగా పనిచేయటంతో ఈ ప్రక్రియను విజయవంతంగా ముగిసింది. 

భారత్, ఇథియోపియాల మధ్య లోతైన- శాశ్వతమైన ప్రజా సంబంధాలు, సాంస్కృతిక-నాగరికతా బంధాలు ఉన్నాయి. ఇథియోపియాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇథియోపియాలో ప్రముఖ విదేశీ పెట్టుబడిదారుల్లో భారతీయ కంపెనీలు కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి చేరుకున్నాయి. 

డబ్ల్యూటీఓలో చేరాలంటే సదరు దేశం తన అంతర్గత ఆర్థిక, వాణిజ్య విధానాలను డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలి. దీనితో పాటు ప్రస్తుతం సభ్యత్వంలో ఉన్న దేశాలతో మార్కెట్ యాక్సెస్ నిబంధనలపై చర్చలు జరపడం కూడా అవసరం. ఇథియోపియా ప్రస్తుతం తన చేరిక ప్రక్రియలో ముందస్తు (అడ్వాన్స్‌డ్) దశలో ఉంది. ఇందులో భాగంగానే ఆ దేశపు వర్కింగ్ పార్టీ సమావేశం 2026 ఏప్రిల్ 22-23 తేదీలలో ఏడోసారి జరిగింది.

డబ్ల్యూటీఓ చేరిక ప్రక్రియ ద్వారా ఇథియోపియా ఆర్థిక, వాణిజ్య విధానాల సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో భారత్, ఇథియోపియాల మధ్య మెరుగైన వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారానికి మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2264553) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Tamil