ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఆరోగ్య సంరక్షణలో ఘనత: ఏబీడీఎం పరిధిలోని ‘ఏబీహెచ్ఏ’తో అనుసంధానమైన 100 కోట్ల ఆరోగ్య రికార్డులు
కేవలం 15 నెలల్లోనే రెట్టింపు స్థాయిలో 100 కోట్లకు చేరిన ఏబీడీఎం రికార్డులు
ప్రభుత్వ ఆరోగ్య ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ ఆరోగ్య సాంకేతిక భాగస్వాముల సహకారంతో ఏబీడీఎం కింద వేగంగా పెరిగిన ఏబీహెచ్ఏ ఆరోగ్య రికార్డులు
ఏబీహెచ్ఏ అనుసంధానిత ఆరోగ్య రికార్డుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 6:03PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్‌లో (ఏబీహెచ్ఏ) 100 కోట్ల ఆరోగ్య రికార్డులు నమోదు కావడంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నేషనల్ హెల్త్ అథారిటీ' (ఎన్‌హెచ్ఏ) అమలు చేస్తున్న 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' (ఏబీడీఎం) ఒక సరికొత్త ఘనతను సాధించింది. దేశంలో సమీకృత, పౌర-కేంద్రిత, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించే దిశగా ఇదొక కీలక ఘట్టంగా నిలిచింది.
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య ప్లాట్‌ఫామ్‌లు, పబ్లిక్ డిజిటల్ వ్యవస్థలు, ప్రైవేట్ రంగ ఆరోగ్య సాంకేతికత భాగస్వాములలో ఏబీడీఎం పట్ల పెరుగుతున్న ఆదరణకు ఈ ఘనత ఒక నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం 450కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సాంకేతిక పరిష్కారాలు ఏబీడీఎం వ్యవస్థతో విజయవంతంగా అనుసంధానమయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సదుపాయాల విషయంలో డిజిటలైజేషన్.. ఆరోగ్య రికార్డుల నిరంతర, సులభతర మార్పిడిని మరింత వేగవంతం చేస్తోంది.
వివిధ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, వైద్య సేవలందించే సంస్థలతో ప్రజలు తమ ఆరోగ్య రికార్డులను సురక్షితంగా అనుసంధానించుకోవడానికి, వాటిని పొందేందుకు 'ఏబీహెచ్ఏ' ఒక విశిష్టమైన డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఏబీడీఎం ద్వారా అనుమతి ఆధారిత సమాచార మార్పిడి విధానం ద్వారా ప్రజలు తమ వైద్య రికార్డులను గుర్తింపు పొందిన వైద్యులు లేదా ఆసుపత్రులతో డిజిటల్ రూపంలో పంచుకోవచ్చు. ఇది వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి పూర్తి గోప్యత, భద్రతలను కల్పిస్తూనే కాగిత రహిత పద్ధతిలో సమర్థవంతమైన వైద్య సేవలను పొందే విషయంలో ఉపయోగపడుతుంది.
ఏబీడీఎం త్వరితగతిన విస్తరిస్తూ ప్రజలకు చేరువవుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి 50 కోట్లుగా ఉన్న ఆరోగ్య రికార్డులు 15 నెలల స్వల్ప వ్యవధిలోనే 100 కోట్లకు పైకి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రతి రెండు మూడు నెలలకోసారి దాదాపు 10 కోట్ల ఆరోగ్య రికార్డులు ఈ వ్యవస్థతో అనుసంధానమవుతుండటం విశేషం. మొదట్లో కేవలం 1,000 కంటే తక్కువ రికార్డుల అనుసంధానంతో ఏబీడీఎం ప్రయాణం ప్రారంభమైంది. నేడు ఇది 100 కోట్లకు పైగా రికార్డులతో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది.
ఈ ఘనతను చేరుకోవడంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించాయి. ఈ ప్రక్రియలో 15.03 కోట్లకు పైగా ఏబీహెచ్ఏ అనుసంధానిత ఆరోగ్య రికార్డులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. 11.95 కోట్లకు పైగా రికార్డుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అలాగే బీహార్ 7.37 కోట్లకు పైగా, రాజస్థాన్ 6.32 కోట్లకు పైగా, గుజరాత్ 4.77 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులను అనుసంధానించి ఈ విషయంలో గణనీయమైన పురోగతిని కనబరిచాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైతం తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఏబీడీఎం పరిధిలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య రికార్డుల విషయంలో వృద్ధిని మరింత బలోపేతం చేశాయి.
ఈ అద్భుత ఘనతకు దోహదపడిన ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్' కార్యక్రమం, కోవిన్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 'ఈ-కవచ్' ప్లాట్‌ఫామ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మాతా శిశు సంరక్షణ' (ఆర్‌సీహెచ్) కార్యక్రమం, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ రూపొందించిన 'ఈ-హాస్పిటల్', ‘సీ-డాక్’కు (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్) చెందిన 'ఈ-సుశ్రుత్', గుజరాత్ ప్రభుత్వ 'టెకో' ప్లాట్‌ఫామ్, రాజస్థాన్ ప్రభుత్వ 'ఐ-హెచ్ఎమ్ఎస్' ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు ప్రైవేట్ ఆరోగ్య సాంకేతికత భాగస్వాములు, ఏబీడీఎం ఆధారిత డిజిటల్ పరిష్కారాలు కూడా ఏబీహెచ్ఏ అనుసంధానిత ఆరోగ్య రికార్డుల సృష్టి, అనుసంధాన ప్రక్రియలో గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి. ఇది దేశంలోని డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.
ఈ ఘనతను సాధించిన సందర్భంగా నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) సీఈఓ డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ మాట్లాడుతూ.. “ఏబీహెచ్ఏతో 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులను అనుసంధానించడం అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రయాణంలో ఒక కీలకమైన ఘట్టం. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, రాష్ట్రాలు, వైద్య సదుపాయాలు, ప్రైవేట్ సాంకేతికత భాగస్వాములలో డిజిటల్ ఆరోగ్య సేవలకు పెరుగుతున్న ఆదరణను ఇది తెలియజేస్తోంది. ఏబీహెచ్ఏతో అనుసంధానమైన ఆరోగ్య రికార్డులు సొంత ఆరోగ్య సమాచారాన్ని సురక్షితంగా, అనుమతితో యాక్సెస్ చేసుకునే అధికారాన్ని ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంతటా నిరంతరాయమైన వైద్య సేవలు అందేలా దోహదపడతాయి” అని వ్యాఖ్యానించారు.
“డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రజలే కేంద్ర బిందువుగా ఉండేలా ఏబీడీఎంను రూపొందించాం. అనుమతి ఆధారిత ఆరోగ్య రికార్డుల మార్పిడి విధానం ద్వారా ప్రజలు తమకు అవసరమైనప్పుడు వారి వైద్య సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయొచ్చు . సంబంధిత రికార్డులను వైద్య సేవలు అందించేవారితో డిజిటల్ రూపంలో పంచుకోవచ్చు. ఇది వైద్య సేవల పంపిణీని మరింత సులభతరంగా, సమర్థవంతంగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చడానికి ఎంతగానో సహాయపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు అవసరమైన ‘ప్రజా డిజిటల్ మౌలిక వసతుల’ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) తయారుచేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ), హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ (హెచ్‌పీఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్ఎఫ్ఆర్), హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అండ్ కన్సెంట్ మేనేజర్ (హెచ్ఐఈ-సీఎం), యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ (యూహెచ్ఐ), నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌హెచ్‌సీఎక్స్) వంటి కీలకమైన డిజిటల్ బ్లాకుల ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంతటా ఆరోగ్య సమాచారాన్ని సురక్షితంగా, అనుమతి ఆధారితంగా, పరస్పరం మార్పిడి చేసుకునేలా ఏబీడీఎం వీలు కల్పిస్తుంది.
ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులను ఏబీహెచ్ఏతో విజయవంతంగా అనుసంధానించడం ద్వారా ప్రజలకు సంబంధించిన సమగ్రమైన, సుదీర్ఘకాలిక డిజిటల్ ఆరోగ్య రికార్డులను రూపొందించే దిశగా ఏబీడీఎం మరొక మైలురాయిని అధిగమించింది. ఇది దేశంలో మరింత అనుసంధానిత, కాగిత రహిత, సమర్థవంతమైన, రోగుల అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2264482)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9