వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తదుపరి తరం ఎఫ్‌టీఏల పరిధిలో భారత్ -  యూరప్ వాణిజ్య భాగస్వామ్యాలపై సీటీఐఎల్, ఫిక్కీ  ఆధ్వర్యంలో సదస్సు 


యూరప్ తో విస్తరిస్తున్న భారత వాణిజ్య భాగస్వామ్యానికి మరింత పటిష్టమైన ప్రమాణాలు, నిబంధనల వ్యవస్థ తప్పనిసరి: ఫిక్కీ నాయకులు

భారత్-యూరప్ వాణిజ్య ఒప్పందాల పరిధిలో మార్కెట్ లభ్యత, నియంత్రణ నిబంధనల అమలు, సీబీఎమ్ సవాళ్లపై సదస్సులో చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 6:17PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్‌లో 2026 మే 19న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు చెందిన సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లా (సీటీఐఎల్),ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) సంయుక్తంగా “తదుపరి తరం వాణిజ్య ఒప్పందాలు: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద యూరప్‌తో భారత భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం” అంశంపై ఒక సదస్సును నిర్వహించాయి. అభివృద్ధి చెందుతున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ద్వారా యూరప్‌తో విస్తరిస్తున్న భారత వాణిజ్య భాగస్వామ్యంపై చర్చించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, వాణిజ్య నిపుణులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలను ఈ సదస్సు ఒక వేదికపై చేర్చింది.

ఫిక్కీ సెక్రటరీ జనరల్ అనంత్ స్వరూప్ ప్రారంభోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆయన హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ, యూరప్‌తో భారతదేశ వాణిజ్య భాగస్వామ్యాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఫిక్కీ విదేశీ వాణిజ్యం, వాణిజ్య సౌలభ్య కమిటీ చైర్మన్, షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ అహుజా మాట్లాడుతూ, ఐరోపా మార్కెట్లలోని సుంక రహిత అడ్డంకులను  సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రమాణాల మౌలిక సదుపాయాలు, టెస్టింగ్, సర్టిఫికేషన్ సామర్థ్యాలు, డిజిటల్ నిబంధనల అమలు సాధనాలు, సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రముఖంగా వివరించారు. 

సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లా ప్రొఫెసర్ హెడ్, డబ్ల్యూటీఓ చైర్స్ ప్రోగ్రామ్ ఇండియా చైర్మన్, డాక్టర్ జేమ్స్ జె. నెడుంపరా సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. భవిష్యత్ లో వాణిజ్య ఒప్పందాల ప్రాధాన్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, యూరప్ మధ్య అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కేవలం సుంకాల సరళీకరణకు మాత్రమే పరిమితం కాదని.. అంతర్జాతీయ వాణిజ్యం ఆర్థిక సహకారం భవిష్యత్తును నిర్దేశించే విస్తృత నిబంధనలను సైతం ఇది కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ ప్రధానోపన్యాసం చేస్తూ, భారత్ -ఈయూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడాన్ని భారతదేశ ఆర్థిక దౌత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఎగుమతులలో 99.5 శాతం ఉత్పత్తులకు ప్రాధాన్య సుంక రాయితీలు  (ప్రిఫరెన్షియల్ టారిఫ్ ట్రీట్‌మెంట్) లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. యూరోపియన్ విలువ శ్రేణుల్లో భారతదేశ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని, వస్తువులు, సేవల రంగాలలో మార్కెట్ లభ్యతను మరింత సులభతరం చేస్తుందని, అలాగే సుంకేతర వాణిజ్య అడ్డంకులను తగ్గిస్తుందని ఆయన అన్నారు. 

ఫిక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ ముగింపు ఉపన్యాసం చేస్తూ, అవగాహన కల్పించడం, సామర్థ్య పెంపు, వ్యాపార సంస్థల సంసిద్ధత కార్యక్రమాల ద్వారా ఈ వాణిజ్య ఒప్పందాలను పరిశ్రమలు సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత ముఖ్యమని  చెప్పారు.

ఈ సదస్సులో నాలుగు అంశాలపై సెషన్లు జరిగాయి. ఇవి ప్రధానంగా: యూరప్‌తో భారతదేశ వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలు; యూరోపియన్ మార్కెట్లలో ప్రమాణాలు, నియంత్రణ నిబంధనల అమలు; సేవల వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం; భారతీయ పరిశ్రమలపై కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) చూపించే ప్రభావాలు అనే అంశాలపై దృష్టి సారించాయి.

ఈ చర్చల్లో మార్కెట్ ప్రవేశ అవకాశాలను మెరుగుపరచడం, ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, మనుషులు, జంతువుల ఆరోగ్య రక్షణకు సంబంధించిన, మొక్కలు, పంటలను పురుగులు, వ్యాధుల నుంచి రక్షించే చర్యలకు సంబంధించిన (శానిటరీ, ఫైటోసానిటరీ)  చర్యలు,  వాణిజ్యానికి సంబంధించిన సాంకేతిక అడ్డంకులను పరిష్కరించడం, యూరప్ మార్కెట్లలో భారత సేవారంగ విస్తరణను పెంపొందించడం, ఉద్భవిస్తున్న కార్బన్‌కు సంబంధించిన వాణిజ్య చర్యలను సమర్థంగా ఎదుర్కొనే మార్గాలపై సమీక్షించారు.

ఈ సదస్సులో యూకే, ఈయూ, ఎఫ్టా దేశాలతో భారతదేశం కుదుర్చుకున్న ఎఫ్టీఏలను సమర్థంగా వినియోగించుకోవడం, కొత్త వాణిజ్య ఒప్పందాల పరిధిలో ఎస్పీఎస్,  టీబీటీ అడ్డంకులు, సేవల వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం, సీబీఎమ్, ఈయూ కార్బన్ నిబంధనలు; సీటీఐఎల్ ట్రేడ్ రెమెడీస్ అడ్వైజరీ సెల్ వంటి కీలక అంశాలపై సీటీఐఎల్ నిపుణులు ప్రజెంటేషన్లు ఇచ్చారు.

ఫిక్కీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ప్రగతి శ్రీవాస్తవ వందన సమర్పణతో  కార్యక్రమం ముగిసింది.

 

****


(రిలీజ్ ఐడి: 2264474) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil