శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉమ్మిడ్ కార్యక్రమాన్ని జాతికి అంకితం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్.. జన్యుపరమైన లక్షిత వైద్య చికిత్సలు దేశ ఆరోగ్య రంగాన్ని మారుస్తాయన్న మంత్రి
ఉమ్మిడ్ (యూఎంఎంఐడీ): అరుదైన జన్యు రుగ్మతలతో బాధపడుతున్న కుటుంబాలకు సత్వర చికిత్స, అందుబాటు వ్యయంతో ఆరోగ్య రక్షణను ప్రోత్సహించే జాతీయ కార్యక్రమం
జన్యు, జీనోమ్ ఆధారిత వ్యక్తిగత చికిత్స దిశగా వైద్యరంగం
విజ్ఞానం, ప్రభుత్వ విధానం... ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురాగల తీరుకు నిదర్శనమిది: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
21 MAY 2026 4:10PM by PIB Hyderabad
అరుదైన జన్యుపరమైన రుగ్మతల కోసం ఉద్దేశించిన ఉమ్మిడ్ (యూఎంఎంఐడీ - వంశపారంపర్య వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు) కార్యక్రమాన్ని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు జాతికి అంకితం చేశారు. జన్యువుల ఆధారంగా, కచ్చితత్వంతో కూడిన, ప్రతీ రోగి జన్యు చిత్రణకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన.. ఆరోగ్య రక్షణ, రోగ నిర్ధారణ, చికిత్సలను అందించే కొత్త శకంలోకి భారత్ క్రమంగా ప్రవేశిస్తోందని ఆయన అన్నారు.
రోగనిర్ధారణ కష్టతరంగా ఉండడం, చికిత్స లభించకపోవడం, ఔషధాలు అందుబాటులో లేకపోవడం, విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవి కావడం వల్ల.. వారసత్వ, ఇతర జన్యుపరమైన రుగ్మతలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని మంత్రి అన్నారు. దాంతో అన్ని కుటుంబాలకు రోగ నిర్ధారణ, నిర్వహణను సులభతరం చేసేలా, తక్కువ వ్యయంతో అందుబాటులో ఉండే విధంగా సమన్వయంతో కూడిన జాతీయ యంత్రాంగాన్ని నెలకొల్పడం అత్యావశ్యకమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
దేశంలో కచ్చితమైన ఔషధ వ్యవస్థ దిశగా కీలక ముందడుగుగా ఉమ్మిడ్ ను అభివర్ణించిన మంత్రి.. తదుపరితరం జన్యు, జీనోమ్ ఆధారిత వైద్య వ్యవస్థ దిశగానూ ఈ కార్యక్రమం దేశాన్ని సిద్ధం చేస్తుందన్నారు.
ఉమ్మిడ్ వ్యవస్థను జాతికి అంకితం చేయడం కోసం న్యూఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వంశపారంపర్య రుగ్మతలకు సంబంధించి రోగ నిర్ధారణ, కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు, కార్యక్రమ పర్యవేక్షణను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉమ్మిడ్ సంకలనాన్ని విడుదల చేసి, డాష్‌బోర్డ్‌ను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు.
బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి, బీఆర్ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేశ్ ఎస్. గోఖలే, డీబీటీ సీనియర్ సలహాదారు డాక్టర్ సుచితా నినవే, సీనియర్ శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య నిపుణులు, కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైజ్ఞానిక, ఆరోగ్య సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వైద్య రంగంలో గత దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ.. అందుబాటు వ్యయంతో, అందరికీ అందుబాటులో ఉండే, ముందస్తు నివారణ చర్యలతో కూడిన, ప్రజలే కేంద్రంగా ఉన్న వైద్య రంగాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో వెల్‌నెస్ కేంద్రాలు విస్తరించాయనీ, ఆరోగ్య బీమా కవరేజీ బలోపేతమైందనీ, అందుబాటు ధరల్లో ఔషధాల లభ్యత పెరిగిందనీ తెలిపారు. అదే సమయంలో ముందస్తు గుర్తింపు, ముందస్తు రోగ నివారణ చర్యల కోసం వ్యవస్థలను నెలకొల్పినట్టు పేర్కొన్నారు.
రోగ నిర్ధారణ కోసం, చికిత్స కోసం ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిరుగుతూ కుటుంబాలకు ఏళ్లకేళ్లు గడిచిపోతూ... వంశపారంపర్య, అరుదైన జన్యుపరమైన రుగ్మతలు తెలియకుండానే ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు. సంఖ్యాపరంగా తక్కువ మందే ప్రభావితమైనప్పటికీ.. బాధిత కుటుంబాల్లో మోయలేని భావోద్వేగ, సామాజిక, ఆర్థిక కష్టాలకు ఈ రుగ్మతలు కారణమవుతున్నాయన్నారు. అందుకే వేరే పెద్ద వ్యాధుల నిర్వహణ కోసం ఉన్న విధంగానే వీటికోసం కూడా జాతీయ స్థాయిలో శ్రద్ధ, ఆరోగ్య రక్షణ పరంగా సున్నితత్వంతో కూడిన నిర్వహణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఒక వైద్య నిపుణుడిగా తన అభిప్రాయాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. తక్కువ సంఖ్యలో బాధితులుండడం, నిర్ధారణ ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా ప్రధానస్రవంతి వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ పద్ధతుల్లో.. అరుదైన జన్యుపరమైన రుగ్మతలపై ఎన్నో ఏళ్లుగా పరిమితంగానే దృష్టి సారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో రోగ నిర్ధారణలో జాప్యం, అవగాహన లోపం, రోగులకు తగినంత చికిత్స అందకపోవడం వంటి పరిణామాలకు ఇది కారణమవుతోందన్నారు. దేశంలోని విస్తారమైన జన్యు వైవిధ్యం ఈ సవాలును మరింత క్లిష్టతరం చేస్తోందన్న ఆయన.. ముందస్తు పరీక్ష, జన్యు నిర్ధారణ, ముందస్తు కౌన్సెలింగ్, వైద్యుల శిక్షణ, సామాజిక అవగాహనతో కూడిన పటిష్టమైన వ్యవస్థ ఆవశ్యకమన్నారు.
కష్టమైనప్పటికీ సామాజిక పరివర్తన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టిన బయోటెక్నాలజీ విభాగాన్ని అభినందించారు. సకాలంలో వైద్య సహాయం, ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యల ద్వారా.. విజ్ఞాన శాస్త్రమూ, కారుణ్యమూ, ప్రజా విధానమూ కలిసి బాధితులకు ఉపశమనాన్ని కలిగించగలవనేందుకు ఉమ్మిడ్ నిదర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒక ఏకీకృత ప్రజారోగ్య నమూనా కింద - జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ, నవజాత శిశువుల పరీక్ష, జన్యుపరమైన కౌన్సెలింగ్, వైద్యుల్లో సామర్థ్యాభివృద్ధి, సామాజిక అవగాహన కార్యక్రమాలను సమకృతం చేస్తూ.. ఓ జాతీయస్థాయి చట్రాన్ని ఈ కార్యక్రమం నెలకొల్పిందని ఆయన వివరించారు.
పరీక్ష, రోగ నిర్ధారణ సేవల ద్వారా ఈ కార్యక్రమం ఇప్పటికే దాదాపు మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిందని మంత్రి తెలిపారు. అభిలషణీయ జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. అధునాతన పద్ధతుల్లో రోగ నిర్ధారణ, కౌన్సెలింగ్ కోసం దాదాపు 30 నిదాన్ కేంద్రాల ఏర్పాటులోనూ ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు. మహానగర కేంద్రాలకే పరిమితం కాకుండా సామాన్య సౌరులకు కూడా అధునాతన జన్యుసంబంధ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తోందన్నారు.
ఉమ్మిడ్ ద్వారా పొందిన అనుభవం భవిష్యత్తులో రాబోయే కచ్చితమైన ఔషధానికి ముఖ్యమైన పునాదిగా ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మున్ముందు ఇందులో రోగుల వ్యక్తిగత జన్యు చిత్రణ ఆధారంగా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి వ్యాధుల చికిత్స విధానాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే దశాబ్దాల్లో ఆరోగ్య రక్షణను పునర్నిర్దేశించగల రెండు ప్రధాన రంగాలుగా జన్యు వైద్యం, అణు వైద్యం ఆవిర్భవిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి, బీఆర్ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేశ్ ఎస్. గోఖలే మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానం, బయోటెక్నాలజీ పరిశోధనలో సహకారం, ముందస్తు రోగ నిర్ధారణ ద్వారా వేలాది కుటుంబాల్లో ఉమ్మిడ్ కార్యక్రమం ఆశను కల్పించిందన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలకూ, భారత్‌కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంబంధిత అనువర్తిత ఆరోగ్య రక్షణ పరిష్కారాలకూ విస్తృతమైన అవకాశాలను మన దేశ జన్యు వైవిధ్యం అందిస్తుందన్నారు.
అంతకుముందు సమావేశానికి స్వాగతం పలుకుతూ డాక్టర్ సుచితా నినవే మాట్లాడారు. జన్యు నిర్ధారణ, కౌన్సెలింగ్, సామర్థ్యాభివృద్ధి అవకాశాలను అందరికీ అందించడం ద్వారా.. వంశపారంపర్య జన్యుపరమైన రుగ్మతలను భారత్ నిర్వహించే తీరును ఉమ్మిడ్ కార్యక్రమం విశేషంగా బలోపేతం చేసిందన్నారు. సమన్వయంతో కూడిన సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా అరుదైన, వంశపారంపర్య వ్యాధుల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా ఒక సమీకృత వ్యవస్థను రూపొందించడంలో ఈ కార్యక్రమం సహాయపడిందన్నారు.
ఉమ్మిడ్ కార్యక్రమంపై అవలోకనం, అది సాధించిన విజయాలు, విజయ గాథలపై ప్రదర్శనలు, కార్యక్రమ ప్రయాణం, ప్రభావం, భవిష్యత్ ప్రణాళికలను వివరించే ఓ లఘుచిత్రాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించారు.
****
(रिलीज़ आईडी: 2264142)
आगंतुक पटल : 41