ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన పాఠశాల విద్యార్థుల బృందం ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి భవన్లో కలుసుకుంది.
ఈ బృందంలో 27 మంది బాలికలు సహా 41 మంది ప్రతిభావంతులైన విద్యార్థులున్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ప్రస్తుతం ఢిల్లీలో విద్యా పర్యటన చేస్తున్నారు.
పేద, అణగారిన వర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకురావడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. తరగతి పరిధిని దాటి తమ ఆలోచనలను విస్తరించుకొనేందుకు ఇలాంటి పర్యటనలు విద్యార్థులకు సహకరిస్తాయన్నారు. విద్యార్థులతో ముచ్చటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
విజేతలుగా నిలిచినవారు జీవితంలో అనేక పోరాటాలను, వైఫల్యాలను, ఎదురుదెబ్బలను ఎదుర్కొంటారని శ్రీ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ కష్టాలన్నీ వ్యక్తుల్లో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, విజయం సాధించాలనే ఆకాంక్షను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చూసి నిరుత్సాహపడొద్దని సూచించారు. జీవితంలో విజయం సాధించే శక్తిని విద్య వారికి అందిస్తుందని చెప్పారు.
అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, పరిపాలకులు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు, దేశ నాయకులు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి విద్యార్థులకు గుర్తు చేశారు.
తాను కూడా తమిళ మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని శ్రీ సీపీ రాధాకృష్ణన్ తెలియజేశారు. జీవితాలను మార్చే, కుటుంబాలను ఉద్ధరించే, సమాజాలను బలోపేతం చేసే, దేశ ప్రగతికి దోహదం చేసే శక్తిమంతమైన సాధనం చదువేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు అధిక ప్రాధాన్యమిచ్చి అవి బాగా రాణించేలా ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచి, బలోపేతం చేసేలా దృష్టి సారించాలని ఎంపీలు, ఎంఎల్ఏలను ఆయన కోరారు.
గత దశాబ్దంగా దేశం సాధించిన ఆర్థిక వృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ చేస్తున్న ప్రయాణంలో విద్యార్థుల కలలు, ఆకాంక్షలకు కూడా సమాన ప్రాధాన్యముందన్నారు.
41 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్లో 27 మంది బాలికలు ఉండటం పట్ల శ్రీ సీపీ రాధాకృష్ణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది దేశంలో వృద్ధి చెందుతున్న నారీ శక్తి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమాలను మితిమీరి వాడటం సహా మాదక ద్రవ్యాలు, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. క్రీడలు, చదవడం, సృజనాత్మకతను ఎంచుకోవాలని వారిని కోరారు. అలాగే తమ చదువు, లక్ష్యాలు, కుటుంబం, దేశం పట్ల బాధ్యతలపై దృష్టి సారించాలన్నారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ.. మూడు సూత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. అవి నిజాయతీతో కష్టపడాలి. విజయంలో వినయంగా ఉండాలి. సమాజ హితం కోసం జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. విద్యార్థులకు ఉజ్వలమైన, అర్థవంతమైన, విజయంతమైన భవిష్యత్తు సిద్ధించాలని ఆకాంక్షించారు.
కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****