రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్ర రక్షణ కార్యక్రమాన్ని ముగించి… కొచ్చికి చేరుకున్న ఐఓఎస్ సాగర్ (ఐఎన్‌ఎస్ సునయన)
సాగర్ నుంచి మహాసాగర్ వరకు.. హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ సముద్ర సహకారాన్ని, ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తున్న భారత నౌకాదళం
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 6:21PM by PIB Hyderabad
భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐఓఎస్ సాగర్ సముద్రయాన మిషన్ విజయవంతంగా ముగిసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) సుదీర్ఘ కాలంపాటు వివిధ దేశాల మీదుగా సాగిన నౌకా యాత్ర ముగింపు సందర్భంగా మే 20, 2026న కొచ్చిలో ఐఎన్‌ఎస్ సునయనకు భారత నౌకాదళం ఘన స్వాగతం పలికింది. 16 భాగస్వామ్య దేశాలకు చెందిన 38 మంది సిబ్బందితో కలిసి సాగిన ఈ సంయుక్త మిషన్ హిందూ సముద్ర ప్రాంతంలో విశ్వసనీయమైన, భద్రతా భాగస్వామిగా భారత్ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రాంతంలోని నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, సమర్థతను, సామర్థ్యాలను పెంపొందించటానికి భారత్ చూపిస్తున్న నిరంతర నిబద్ధతకు ఈ యాత్ర మరోసారి చాటిచెప్పింది.
భారత నౌకాదళం, భాగస్వామ్య దేశాలు (బంగ్లాదేశ్, ఇండోనేషియా, కెన్యా, మలేషియా, మారిషస్, మాల్దీవులు, మొజాంబిక్, మయన్మార్, సీషెల్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టాంజానియా, థాయిలాండ్, తైమూర్ లెస్టే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం... ఈ ప్రాంతంలో నిర్వహించిన అత్యంత సమగ్రమైన బహుళజాతి కార్యాచరణల్లో ఒకటిగా నిలిచింది.
'ఒకే సముద్రం, ఒకే లక్ష్యం' స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రాంతీయ భాగస్వామ్యం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా సమ్మిళిత, సహకార, నియమబద్ధమైన సముద్ర వ్యవస్థను పెంపొందించటంలో భారత నౌకాదళ నిబద్ధతను ఐఓఎస్ సాగర్ ప్రదర్శించింది.
భారతదేశ సముద్ర తీర ప్రాంతాల రక్షణ, అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన సాగర్- ప్రాంతంలోని అందరికీ భద్రత, అభివృద్ధి.. మహాసాగర్- అన్ని ప్రాంతాల భద్రత, అభివృద్ధికి పరస్పర, సమగ్ర పురోగతి వంటి కీలక కార్యక్రమాల ఆశయాలకు అనుగుణంగానే ఈ మిషన్ ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ ఉమ్మడి రక్షణ, ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర రంగంలో వృద్ధిని సాధించటమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.
కొచ్చి హార్బర్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్ సునయనకు నీటి ఫిరంగులతో ఘన స్వాగతం పలికారు. నేవల్ ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌ల రక్షణలో వచ్చిన ఈ నౌకకు, దక్షిణ నేవీ కమాండ్‌లోని సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఐఓఎస్ సాగర్ ఫ్లాగ్-ఇన్ వేడుకకు దక్షిణ నేవీ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓడ తిరిగొచ్చిన సందర్భంగా.. సుదీర్ఘ ప్రయాణంలో వివిధ దేశాల సిబ్బంది ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, సమన్వయం, అసాధారణమైన సమష్టి కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి దక్షిణ ఎఫ్‌ఓసీఐఎన్‌సీ మాట్లాడారు. భాగస్వామ్య నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించటానికి, హిందూ మహా సముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) ఎదురవుతున్న భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం చేస్తున్న ప్రయత్నాలకు ఐఓఎస్ సాగర్ నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో సురక్షితమైన, స్థిరమైన, సుసంపన్నమైన సముద్ర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాంతీయ నౌకాదళాల మధ్య నిరంతర భాగస్వామ్యం, పరస్పర సహకారం, కార్యాచరణ సమన్వయం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
ఉమ్మడి శిక్షణ, పరస్పర చర్చలు, సహకార కార్యాచరణ కార్యకలాపాల ద్వారా నౌకాదళాల మధ్య సహకారాన్ని, సమన్వయాన్ని, పరస్పర అవగాహనను ఈ యాత్ర మరింత పెంచిందని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సముద్రపు దొంగతనాలు, అక్రమ చేపల వేట, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, స్మగ్లింగ్, సముద్రంలో ఇతర అసాధారణ ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాంతీయ నౌకాదళాల శక్తిని బలోపేతం చేస్తాయి.
ఏప్రిల్ 2, 2026న ముంబయిలో ఐఓఎస్ సాగర్ నౌకను రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ సేథ్ ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా మాలె, ఫుకెట్, జకార్తా, సింగపూర్, యాంగూన్, చత్తోగ్రామ్, కొలంబో నౌకాశ్రయాలను ఈ ఓడ సందర్శించింది.
ఈ ప్రయత్నంలో భాగంగా ప్రయాణ విన్యాసాలు, నౌకల మధ్య పరస్పర సంభాషణలు, నిపుణుల అభిప్రాయ మార్పిడి కార్యక్రమాలు, సమన్వయ సముద్ర విన్యాసాలు, సముద్ర భద్రతపై చర్చలు, భాగస్వామ్య దేశాల నౌకాదళాలు, సముద్ర సంస్థలతో వృత్తిపరమైన సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత, రక్షణ, నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం పట్ల ఉమ్మడి నిబద్ధతను మరింత బలోపేతం చేశాయి.
ఈ మోహరింపునకు ముందు వివిధ దేశాల సిబ్బంది.. కొచ్చిలోని దక్షిణ నేవీ కమాండ్‌లో సముద్ర నైపుణ్యాలు, నావిగేషన్, అగ్నిమాపక చర్యలు, నష్ట నివారణ, కమ్యూనికేషన్ విధానాలు, వీబీఎస్ఎస్ కార్యకలాపాలు, అధునాతన బ్రిడ్జ్‌మ్యాన్‌షిప్ అంశాలపై సమగ్ర హార్బర్ శిక్షణ పొందారు. వృత్తిపరమైన పరస్పర సహకారాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవటానికి కొచ్చిలో జరిగిన ఐఓఎన్‌ఎస్ మారిటైమ్ ఎక్సర్‌సైజ్ ఐఎంఈఎక్స్ టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్‌లోనూ ఈ సిబ్బంది పాల్గొన్నారు.
భారతదేశ సముద్రతీర విస్తరణ, ప్రాంతీయ భాగస్వామ్య కార్యక్రమాల్లో ఐఓఎస్ సాగర్ విజయం కీలక ఘట్టంగా నిలిచింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో విశ్వసనీయమైన భాగస్వామ్యాలను ఏర్పరచటం, ఉమ్మడి నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించటం, సహకార భద్రతను ప్రోత్సహించటం పట్ల భారత నౌకా దళానికున్న నిరంతర నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2263962)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11