జాతీయ మానవ హక్కుల కమిషన్
ఎన్‌హెచ్ఆర్‌సీ మే 2026 స్వల్పకాలిక ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రారంభం
దరఖాస్తు చేసుకున్న 1,417 మంది నుంచి విభిన్న విద్యా నేపథ్యాలకు చెందిన 100 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల ఎంపిక
విద్యార్థుల్లో సమాజం, మానవ హక్కుల పట్ల మరింత కరుణ, నిష్పక్షపాత ధోరణి, సున్నితత్వాన్ని పెంపొందించడమే ఈ ఇంటర్న్‌షిప్ లక్ష్యం: ఛైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్
అవసరార్థుల పట్ల కరుణతో వ్యవహరించడం, వ్యక్తిత్వ నిర్మాణ ప్రాముఖ్యాన్ని వివరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 6:11PM by PIB Hyderabad
విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల కోసం రెండు వారాల స్వల్పకాలిక ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం (ఓఎస్‌టీఐ)ను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైదింగ్‌పూయి ఛాక్‌ఛువాక్, డైరెక్టర్ శ్రీ ఇర్షాద్ ఆలం, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న వివిధ విద్యా నేపథ్యాలకు చెందిన 1,417 విద్యార్థుల నుంచి 100 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేశారు. రెండు వారాల నిడివి ఉన్న ఈ కార్యక్రమం 2026 మే 29న ముగుస్తుంది.
విద్యార్థులను ఉద్దేశించి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 సాయుధ ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇదే అత్యధికమని తెలిపారు. మానవ హక్కులపై అవగాహన, చర్చలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ పరిస్థితి తెలియజేస్తోందని వివరించారు. ప్రపంచ శాంతి సూచీ – 2025ను ఉటంకిస్తూ ప్రస్తుతం 98 దేశాలు బాహ్య యుద్దాలను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారుగా 20 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఈ సంఘర్షణల్లో 120కి పైగా ప్రభుత్వేతర సాయుధ దళాలు పాల్గొంటున్నాయని, వీటిలో చాలా వరకు దశాబ్దానికి పైగా ఈ ఘర్షణల్లో కొనసాగుతున్నాయని అన్నారు. దీనివల్ల భవిష్యత్తు తరాలు హింస, అభధ్రతాపూరిత వాతావరణంలో పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 122 మిలియన్ల మంది ప్రజలు బలవంతంగా ఇతర ప్రదేశాలకు వలస వెళుతున్నారని పేర్కొన్నారు. 17 దేశాల జనాభాలో అయిదు శాతానికి పైగా శరణార్థులు లేదా అంతర్గత వలస వెళ్లిన వారున్నారని ఆయన తెలిపారు.
సమాచార ప్రసారానికి, సమాజంలో భాగస్వామ్యానికి సాంకేతిక పరిజ్ఞానం అనేక అవకాశాలను సృష్టిస్తోందని జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. అదే సమయంలో అశాంతికీ, అస్థిరతకూ అనేక సందర్భాల్లో కారణమవుతోందన్నారు. సోషల్ మీడియా ద్వారా చెలరేగిన నిరసనలు కొన్నిసార్లు హింసాత్మకంగా మారి వివిధ దేశాల్లో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేశాయన్నారు. న్యాయానికీ, నిష్పాక్షిక ధోరణికీ సంబంధించిన నైతికపరమైన, తాత్వికపరమైన ప్రశ్నలను ప్రస్తావిస్తూ.. చర్చలకు, విభిన్న దృక్కోణాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని శిక్షణార్థులకు సూచించారు. భారతీయ గ్రంథాల్లో గొప్ప ధర్మంగా పరిగణించిన సహానుభూతి లేదా దయ ప్రాధాన్యం గురించి వివరించారు. సమాజం, మానవ హక్కుల సమస్యల పట్ల విద్యార్థులు మరింత సహానుభూతితో, నిష్పక్షపాతంగా, సున్నితంగా వ్యవహరించేలా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
అంతకుముందు ఎన్‌హెచ్ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ మాట్లాడారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఓఎస్‌టీఐ ప్రారంభమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆర్థిక, రవాణా ఇబ్బందులు లేకుండా శిక్షణ పొందే వీలు కల్పించిందని తెలిపారు. ఏటా నిర్వహించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు ఏడాదికి మూడు లేదా నాలుగు నుంచి ఆరుకు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఒక బ్యాచ్‌కు తీసుకొనే విద్యార్థుల సంఖ్య 80 నుంచి 100కు పెరిగిందన్నారు. ఫలితంగా ఏటా 600 మంది విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా ఎన్‌హెచ్ఆర్‌సీ చేరుకోగలుగుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్నులను కోరారు. అలాగే సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం లాంటి రాజ్యాంగ విలువలను అలవరచుకోవాలని, పరిశీలనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పరిస్థితులపై స్పందించే ముందు సున్నితత్వాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని కోరారు.
దైనందిన జీవితంలో సున్నితత్వం, దయాగుణానికున్న అవసరాన్ని వివరిస్తూ.. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించేందుకు ముందుకు రావాలని శిక్షణార్థులను కోరారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయడమే ఈ రెండు వారాల కార్యక్రమ లక్ష్యమని తెలియజేశారు.
ఈ ఇంటర్న్‌షిప్ గురించిన సమగ్ర వివరాలను ఎన్‌హెచ్ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ సైదింగ్‌పూయి ఛాక్‌ఛువాక్ అందించారు. ఇంటర్నుల కోసం ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సంఘాలకు చెందిన ప్రతినిధులు, లా ఎన్ఫోర్స్‌మెంట్, మానసిక ఆరోగ్యం, బాలల హక్కులు, మావన హక్కుల పరిరక్షణ నిఫుణుల నుంచి ఎంపిక చేసిన 40 మంది వక్తలతో 45 సెషన్లు ఉంటాయి. ఆచరణాత్మక అవగాహన పొందడానికి ఒక పోలీస్ స్టేషన్, తీహార్ కారాగారం, ఆశా కిరణ్ ఆశ్రయ గృహాలను వర్చువల్ విధానంలో ఇంటర్నులు సందర్శిస్తారు. పుస్తక సమీక్ష పోటీలు, ఉపన్యాసాలు, బృంద పరిశోధనా ప్రాజెక్టు ప్రజెంటేషన్ లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.
****
(రిలీజ్ ఐడి: 2263269)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15