బొగ్గు మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్‌లోని ఉర్టన్, ధిరౌలీ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 5:31PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్‌లోని ఉర్టన్, ధిరౌలీ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంతో భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ మరో కీలకమైన విజయం సాధించింది. ఈ గనుల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడం... దేశీయంగా అందుబాటులోకి వచ్చే బొగ్గు నిల్వలను పెంచుతుందని, ఇంధన రంగంలో స్వావలంబన దిశగా దేశ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉన్న ఉర్టన్ బొగ్గు గనులను జేఎంఎస్ మైనింగ్ ప్రైవేటు సంస్థకు కేటాయించారు. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి 2026 మే 15న ప్రారంభమైంది. వాణిజ్య బొగ్గు వేలం ద్వారా ఉత్పత్తి ప్రారంభించిన మొదటి భూగర్భ బొగ్గు గనిగా ఉర్టన్ నిలిచింది. బొగ్గు రంగంలో చేపడుతున్న సంస్కరణాత్మక మార్పుల్లో ముఖ్యమైన విజయంగా ఇది నిలిచింది.
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఉన్న ధిరౌలీ బొగ్గు గనిలో కూడా ఉత్పత్తి ప్రారంభం కావడం మరో గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. మహాన్ ఎనర్జెన్ సంస్థకు కేటాయించిన ఈ గనిలో 2026 మే 17న ఉత్పత్తి ప్రారంభమైంది. వనరులు సమృద్ధిగా ఉన్న సింగ్రౌలీ ప్రాంతం నుంచి బొగ్గు సరఫరాను ఇది మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు గనుల్లోనూ ఉత్పత్తి ప్రారంభం కావడం... బొగ్గు మంత్రిత్వ శాఖ చేపడుతున్న ప్రగతిశీల సంస్కరణలు, వ్యవస్థీకృత విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంధన రంగంలో ఆత్మనిర్భరతను సాధించేలా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం, వాణిజ్య సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా వీటిని మంత్రిత్వ శాఖ చేపడుతోంది. ఈ గనుల నుంచి పెరిగే ఉత్పత్తి... దేశీయంగా పెరుగుతున్న బొగ్గు అవసరాలను తీర్చడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సుస్థిర ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం లో కీలక పాత్ర పోషిస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2263258)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22