గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సైకిల్‌పై కార్యాలయానికి కేంద్ర మంత్రి శ్రీ టోకన్ సాహు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని పౌరులకు పిలుపు
మనం ఆదా చేసే ప్రతి చుక్క ఇంధనంతో భారత భవితకు, గౌరవానికి భద్రత: శ్రీ టోకన్ సాహు
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 7:25PM by PIB Hyderabad
ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతుగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీ టోకన్ సాహు ఈ రోజు తన నివాసం నుంచి సంకల్ప్ భవన్ వరకు 3 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. తద్వారా సుస్థిర పట్టణ రవాణా, పర్యావరణ బాధ్యత, దేశ సేవ గురించి పౌరులకు బలమైన సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా శ్రీ సాహు మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతులు, వీడియో అనుసంధానం ద్వారా సమావేశాలు, పెట్రోల్-డీజిల్ వినియోగాన్ని తగ్గించడం వంటి కోవిడ్-కాలపు పద్ధతులను పునరుద్ధరించాలని ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తిని శ్రీ సాహు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో అది అత్యంత సముచితం, సందర్భోచితమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు దేశ ప్రయోజనాలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. దీనిని దేశ సేవగా భావిస్తూ, ఈ సామూహిక కృషిలో పాలుపంచుకోవడం బాధ్యత గల ప్రతీ పౌరుడి విధి అని శ్రీ టోకన్ సాహు ఉద్ఘాటించారు.
ఇంధన పొదుపు కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదనీ... పర్యావరణం పట్ల మన బాధ్యత, క్లిష్ట సమయాల్లో దేశాన్ని బలోపేతం చేయగల సామూహిక జాతీయ కర్తవ్యమని శ్రీ సాహు స్పష్టం చేశారు. “మనం ఆదా చేసే ప్రతి లీటరు ఇంధనం దేశ విస్తృత ప్రయోజనాలకు దోహదపడుతుందన్నారు. దేశం సమష్టిగా సుస్థిరత, స్వయం-సమృద్ధి దిశగా ముందుకుసాగుతున్న తరుణంలో చిన్నవైనప్పటికీ... అవగాహనతో కూడిన జీవనశైలి మార్పుల ద్వారా పౌరులు అర్థవంతమైన సహకారం అందించగలరు” అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఇప్పటికే తమ కాన్వాయ్‌లను 50 శాతం తగ్గించడం ప్రారంభించారని శ్రీ సాహు పేర్కొన్నారు. వ్యక్తిగత ఆచరణ ద్వారా నాయకత్వం ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపుతుందనీ... అది విస్తృత ప్రజా భాగస్వామ్యానికి స్ఫూర్తినిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజా భాగస్వామ్యం, దేశభక్తి గురించిన విస్తృత సందేశాన్ని అందిస్తూ... “పొదుపు దిశగా వేసే ప్రతి అడుగు దేశ సేవ దిశగా ఒక ముందడుగు అవుతుంది. మనం ఆదా చేసే ప్రతి చుక్క ఇంధనం భారత భవితను, గౌరవాన్ని పరిరక్షిస్తుంది” అని శ్రీ సాహు పేర్కొన్నారు.
ఈ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ... ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ బస్సులు వాడడం, సైకిల్ తొక్కడం, సాధ్యమైన చోట్ల కార్‌పూలింగ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని శ్రీ సాహు పౌరులకు విజ్ఞప్తి చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2261667)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4