రక్షణ మంత్రిత్వ శాఖ
“ఏఎంసీఏ’ కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్.. ‘నేవల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ”లకు రక్షణ మంత్రి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శంకుస్థాపన
ఆయుధాలు, ప్రొపెల్లెంట్లు-ఫ్యూజుల కోసం ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన సహా 8 సంస్థల సహకారంతో రాష్ట్రంలో డ్రోన్ సిటీ ఏర్పాటు
జాతీయ భద్రత దిశగా రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధన అత్యంత కీలకం: రక్షణ మంత్రి
ప్రస్తుత ‘గ్రోత్ పోల్’ ప్రాజెక్టులతో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి
పౌరులందరి భాగస్వామ్యంతో దేశం ముందడుగు వేస్తుండగా.. రక్షణ తయారీ రంగాన్ని ‘పీపీపీ’ విధానం ఒక ప్రజా ఉద్యమంగా మార్చింది
రక్షణ ఉత్పాదన మరో ఒకటిరెండు నెలల్లో రూ.1.75 లక్షల కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరి కొత్త రికార్డు సృష్టిస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 3:46PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు ఈ రోజు వివిధ వ్యూహాత్మక ‘ఏరోస్పేస్-డిఫెన్స్’ ప్రాజెక్టులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 5వ తరం అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమాన (ఏఎంసీఏ), ఇతర భవిష్యత్ స్వదేశీ రక్షణ వేదికల రూపకల్పనను వేగిరపరచేందుకు ఉద్దేశించిన ‘కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్’కు పుట్టపర్తిలో శంకుస్థాపన చేశారు. అలాగే ఆధునిక జలాంతర్గామి ఆయుధాలు, నావికా యుద్ధ వ్యవస్థల అవసరాలు తీర్చేందుకు నిర్దేశించిన ‘నేవల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ’కి అనకాపల్లి జిల్లాలోని టి.సిరసాపల్లి గ్రామంలో భూమిపూజ చేశారు.
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ‘డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీ’, ‘అమ్యూనిషన్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యూజెస్’ ప్లాంటుకు భూమిపూజ చేశారు. అలాగే, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు 8 కంపెనీల సామూహిక సంస్థ (కన్సార్టియం) ముందుకొచ్చింది. వీటన్నిటితోపాటు రాష్ట్రంలో రక్షణ తయారీ పరిశ్రమల ఏర్పాటు దిశగా వివిధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ- “ఇదొక చారిత్రక ఘట్టం” అని అభివర్ణించారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి నడుమ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రక్షణ తయారీ రంగంలో స్వయంసమృద్ధి సాధించడం అత్యంత కీలక కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రతకు సంబంధించి నిరంతర దిగుమతి పరాధీనత నుంచి బయటపడి, స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యం కావాలన్నారు.
ఈ అంశాన్ని విశదీకరిస్తూ- “ప్రస్తుత ప్రాజెక్టులు రక్షణ దళాల్లోని అన్ని విభాగాల అవసరాలనూ తీర్చగలవు. ఈ వ్యూహాత్మక వైవిధ్యీకరణ యాదృచ్ఛికం కాదు... ఈ దిశగా మా లక్ష్యం సుస్పష్టం. రక్షణ రంగంలో స్వావలంబనపై దృఢ సంకల్పంతో మేం ముందడుగు వేస్తున్నాం. తద్వారా భవిష్యత సవాళ్లను ఎదుర్కొనేలా త్రివిధ దళాలను సంసిద్ధం చేయడంపై దృష్టి సారించాం. ఈ జాతీయ స్వయంసమృద్ధి సంకల్ప సాకారంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలోనూ ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
నేడు శంకుస్థాపన, భూమిపూజ చేసిన ప్రాజెక్టులు శక్తిమంతమైన “ప్రగతి కూడళ్లు”గా (గ్రోత్ పోల్స్)గా రూపొంది, భారీ ఎత్తున ఉపాధిని సృష్టిస్తాయని మంత్రి పేర్కొన్నారు. “ ఈ కార్యక్రమాల్లో దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీఐలు సహా స్థానిక విద్యా సంస్థలు కూడా అంతర్భాగం అవుతాయి. తద్వారా పటిష్ఠ సరఫరా వ్యవస్థ ఏర్పడి, చిన్న తరహా పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి. అత్యాధునిక సాంకేతిక రంగంలో పనిచేయడంతోపాటు అనుభవ సముపార్జన ద్వారా స్థానిక యువత తమ జీవితంలో మరింత ఎదగడానికి వేదిక లభిస్తుంది. ఇదొక సమగ్ర రక్షణ తయారీ వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషించగలదు” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ప్రస్తుత ‘ఏఎంసీఏ’ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు కేటాయించింది. ఇందులో డీఆర్‌డీఓ అనుబంధ సంస్థ ‘ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ’ పరిధిలో రూ.2,000 కోట్లతో ఏర్పాటయ్యే ‘కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్’ ఓ కీలక భాగంగా ఉంటుంది. “గగనతలంలోకి ఐదో తరం యుద్ధ విమానాలను ప్రవేశపెట్టగల ప్రపంచంలోని అరుదైన ప్రదేశాల జాబితాలో పుట్టపర్తి కూడా స్థానం సంపాదిస్తుంది. శత్రువును రెప్పపాటులో మట్టుపెట్టే సామర్థ్యంగల కలిగిన అత్యాధునిక యుద్ధ విమానానికి ఇదొక జన్మభూమిగా మారుతుంది” అని ఆయన అభివర్ణించారు.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) పరిధిలోరూ.480 కోట్లతో చేపట్టే ‘నేవల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ’ స్వయంచలిత జలాంతర్గత వాహనాలు, జలాంతర ప్రతిదాడి వ్యవస్థలు, భావితరం టార్పిడోల ఉత్పాదనపై దృష్టి సారిస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటిదాకా దేశం దిగుమతి చేసుకుంటున్న అనేక కీలక విడిభాగాలు, ఉప-వ్యవస్థలను ఈ కేంద్రం తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత నావికాదళ సామర్థ్యం గణనీయంగా ఇనుమడిస్తుంది. దీంతోపాటు దేశ నీలి ఆర్థిక వ్యవస్థ, సముద్ర రంగ భద్రతలో కీలక మలుపుగా మారుతుందని రక్షణ మంత్రి వివరించారు.
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ‘ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్’ పరిధిలో ‘డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీ’ రూ.1,500 కోట్లతో ఏర్పాటవుతోంది. భవిష్యత్ యుద్ధాలకు భారత దళాల సంసిద్ధతను బలోపేతం చేయగల ఆయుధాలను ఈ కేంద్రం ఉత్పత్తి చేస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
‘హెచ్‌ఎఫ్‌సీఎల్ లిమిటెడ్’ ఆధ్వర్యాన దాదాపు రూ.1,200 కోట్లతో ‘అమ్యూనిషన్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ప్లాంట్’ ఏర్పాటవుతోంది. ఎలాంటి మందుగుండు సామగ్రిలోనైనా ‘ఫ్యూజ్’ అత్యంత ప్రధాన భాగం కాబట్టి, మందుగుండు తయారీలో దేశ స్వావలంబన ప్రస్థానంలో నూతనాధ్యాయానికి ఈ ప్రాజెక్టు నాంది పలుకుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. “ఈ ప్లాంటులో తయారయ్యే అత్యాధునిక ఫ్యూజ్‌లు మన రక్షణ దళాల సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తాయి” అన్నారు.
కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటును ప్రస్తావిస్తూ- ఈ దిశగా యువ పారిశ్రామికవేత్తల సమష్టి దృక్కోణాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. పరిమాణం రీత్యా ఇవి చిన్నచిన్నవే అయినా, ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతను సుస్పష్ట వాస్తవికతగా మార్చడంలో ఇవి కీలక భాగమని ఆయన అన్నారు. “ఆధునిక యుద్ధంలో డ్రోన్ సాంకేతికత ఓ కీలక మలుపుగా మారింది. దీంతోపాటు ఇతరత్రా రంగాల్లోనూ దీని ఆవశ్యకత నానాటికీ విస్తరిస్తోంది. కర్నూలు డ్రోన్ సిటీలో ఉత్పత్తయ్యే డ్రోన్లు భారత నాణ్యత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో చాటగలవని విశ్వసిస్తున్నాను. సూరత్‌ను ‘డైమండ్ సిటీ’గా, బెంగళూరును ‘సిలికాన్ వ్యాలీ’గా వ్యవహరిస్తున్న తీరులోనే కర్నూలు ప్రాంతం త్వరలో భారత ‘డ్రోన్ హబ్’గా గుర్తింపు పొందడటం తథ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేసిందని రక్షణ మంత్రి గుర్తుచేశారు. దేశం నేడు ‘ఏకోన్ముఖ ప్రభుత్వ’ విధానం మాత్రమేగాక ఏకోన్ముఖ దేశ-ప్రజా' విధానం'తోనూ ముందడుగు వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు “వ్యక్తిగత ఆవిష్కర్త లేదా ఓ భారీ సంస్థ లేదా అంకుర సంస్థ లేదా ‘ఎంఎస్‌ఎంఈ’ వంటిదేదైనా జాతీయ భద్రతకు తోడ్పడటాన్ని తమ కర్తవ్యంగా పరిగణిస్తున్నాయి. ఈ క్రమంలోనే రక్షణ తయారీ రంగాన్ని ప్రజా ఉద్యమంగా రూపుదిద్దడంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానం విజయవంతమైంది” అని ఆయన వివరించారు.
ప్రభుత్వ అవిరళ కృషి ఫలితంగా రక్షణ రంగంలో నేటి వరకూ సాధించిన ప్రగతిని వివరిస్తూ- దేశంలో 2014 నాటికి రక్షణ ఉత్పాదకత కేవలం రూ.46,000 కోట్లు మాత్రమేనని, ప్రస్తుతం రూ.1.54 లక్షల కోట్లకు చేరువైందని తెలిపారు. ఈ క్రమంలో ఒకటిరెండు నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్ల అత్యంత గరిష్ఠ స్థాయిని నమోదు చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించనుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశం నుంచి రక్షణ ఎగుమతులు దశాబ్దం కిందట రూ.600 కోట్లు కాగా, నేడు రూ.40,000 కోట్లకు పెరిగి, కొత్త రికార్డుకు చేరువయ్యాయని వివరించారు.
దేశంలో నేడు తప్పుదోవ పట్టించే సమాచార విస్తృతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణశాఖ మంత్రి హెచ్చరించారు. “మన శత్రువులు ఇప్పుడు సాయుధ దాడికి ప్రయత్నించే అవసరం లేదు. కేవలం వదంతులు, తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తితోనూ జాతీయ భద్రతకు హాని చేయగలరు. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని లేదా దేశానికి పెను విపత్తు ముంచుకొస్తోందని వారు వదంతులు సృష్టించవచ్చు. ప్రజలను గందరగోళానికి గురిచేసి, అరాచకత్వం సృష్టించే దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడతారు. తప్పుదోవ పట్టించే సమాచారం స్వల్పమైనదే అయినా, తీవ్ర హానికారకం కాగలదు. కాబట్టి, మనం అత్యంత జాగరూకతతో మెలగాలి. ప్రజా రవాణా వినియోగం వైపు మళ్లాలని లేదా ఇంధనం పొదుపు చేయాలని ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తిని ఒక సలహాగా మాత్రమే మనం స్వీకరించాలి” అని సూచించారు.
చివరగా- దేశ పురోగమనం సమష్టి కృషితోనే సాధ్యమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “మనమంతా భుజం కలిపి స్వీయ రక్షణ మాత్రమేగాక విశ్వ సౌభ్రాత్ర స్ఫూర్తితో యావత్ ప్రపంచానికి చేయూతనివ్వగల దేశంగా భారత్‌ను రూపుదిద్దుదాం” అని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ- దేశీయీకరణ, స్వావలంబనపై నిరంతర శద్ధతో భారత రక్షణ సామర్థ్య బలోపేతానికి, సైనిక బలగాల ఆధునికీకరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సంస్కరణలు, పెట్టుబడులు, ఆవిష్కరణలపై నిరంతరం దృష్టి సారించడం ద్వారా రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో దేశ సన్నద్ధత, అంతర్జాతీయ ప్రాధాన్యం ఎంతగానో పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
రక్షణ రంగంలో ఇనుమడిస్తున్న భారత్ శక్తిసామర్థ్యాలకు, సాంకేతిక ప్రగతికి, స్వావలంబనకు ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిష్ఠాత్మక విజయం నిదర్శనమని ఆయన అభివర్ణించారు. నేడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమేగాక ప్రాంతీయ ప్రగతికి దోహదం చేస్తాయని చెప్పారు.
ఈ సందర్భంగా “డిజైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లీడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్” అంటూ పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ దిశగా తమ ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. “నవ్యావిష్కరణలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ అనే త్రివిధ శక్తిసామర్థ్యాలతో నవ్యాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది. వికసిత భారత్ దిశగా దేశ ప్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచి సారథ్యం వహిస్తుంది” అని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, రక్షణ రంగ ఉత్పత్తి విభాగం కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, ఆ శాఖలోని ఇతర ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2261592)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11