రక్షణ మంత్రిత్వ శాఖ
ఏఎంసీఎ కోర్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, నావల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి కేంద్ర రక్షణ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు
ఆయుధాలు, ప్రొపెల్లెంట్లు & ఫ్యూజుల కోసం ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు
రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడానికి 8 కంపెనీలు ఒప్పందం
జాతీయ భద్రతకు రక్షణ రంగంలో ఆత్మనిర్భరత అత్యంత కీలకం: రక్షణ మంత్రి
ఈ 'గ్రోత్ పోల్' ప్రాజెక్టులు భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి
ప్రజలందరినీ భాగస్వామ్యంతో దేశం ముందుకు సాగుతోంది; పీపీపీ నమూనా రక్షణ తయారీ రంగాన్ని సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చింది
రానున్న 1-2 నెలల్లో రక్షణ ఉత్పత్తి ఎన్నడూ లేని విధంగా 1.75 లక్షల కోట్లకు చేరుకోనుంది- శ్రీ రాజ్నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 3:46PM by PIB Vijayawada
పుట్టపర్తి
15 మే, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో 2026, మే 15వ తేదీన కేంద్ర రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలిసి పలు వ్యూహాత్మక ఏరోస్పేస్, రక్షణ రంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA), ఇతర భవిష్యత్ స్వదేశీ సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పుట్టపర్తిలో “కోర్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్”కు శంకుస్థాపన చేశారు. అలాగే.. అనకాపల్లి జిల్లాలోని టి. సిరసాపల్లి గ్రామంలో అధునాతన జలాంతర్గామి ఆయుధాలు & నావికాదళ యుద్ధ వ్యవస్థల అవసరాలను తీర్చేందుకు “నావల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ”కి శంకుస్థాపన చేశారు.


శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీ, ఆయుధ సామగ్రి & ఎలక్ట్రిక్ ఫ్యూజుల ప్లాంట్కు శంకుస్థాపన నిర్వహించారు. వీటితో పాటుగా కర్నూలు జిల్లాలో ఎనిమిది డ్రోన్ తయారీ కంపెనీలు సమష్టిగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేసేందుకు కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పాటుగా పలు కంపెనీలు రాష్ట్రంలో రక్షణ రంగ తయారీ కేంద్రాలను స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్.. ఈ ప్రాజెక్టులను "నిజంగా చారిత్రాత్మకమైనది"గా అభివర్ణించారు. ప్రస్తుత అస్థిరత ప్రపంచంలో జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు రక్షణ తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఆత్మనిర్భరత ఆవశ్యకతను వివరించారు. జాతీయ భద్రతా విషయాలలో, ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా, ఆత్మనిర్భరతను సాధించడమే లక్ష్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులు రక్షణ దళాలలోని అన్ని విభాగాలకు సహాయపడుతాయని వివరించిన కేంద్ర మంత్రి.. ఈ వ్యూహాత్మక వైవిధ్యీకరణ యాదృచ్ఛికం కాదని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. “రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దృఢ నిశ్చయంతో మేము ముందుకు సాగుతున్నాము, తద్వారా మూడు దళాలు భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉంటాయి. దేశం స్వయం సమృద్ధిని సాధించే ప్రయత్నంలో మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఈ ప్రాజెక్టులు ఒక మైలురాయిగా నిలుస్తాయి" అని శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు..

ఈ ప్రాజెక్టులు శక్తివంతమైన వృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయని, తద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతుందని రక్షణ మంత్రి తెలిపారు. స్థానిక విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీఐలు ఈ చొరవలో అంతర్భాగం అవుతాయని తెలిపారు. పటిష్టమైన సరఫరా గొలుసులు ఏర్పడి, చిన్న తరహా పరిశ్రమలు బలోపేతం అవుతాయన్నారు. స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక రంగంలో పనిచేసేందుకు, నేర్చుకునేందుకు, ఎదిగేందుకు ఈ ప్రాజెక్టులు వేదిక కానున్నాయి. ఇవి ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
ఏఎంసీఏ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 15,000 కోట్లు కాగా, డీఆర్డీఓ అనుబంధ సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన కోర్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కీలక భాగం. దీనిని సుమారు రూ. 2,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు.
"గగనతలంలోకి దూసుకెళ్లే అధునాతన ఐదో తరం యుద్ధ విమానాల తయారీతో పుట్టపర్తి ప్రపంచ స్థాయి గమ్యస్థానాల జాబితాలో నిలవబోతోందని, రెప్పపాటులో శత్రువును నాశనం చేయగల యుద్ధ విమానాలకు పుట్టపర్తి జన్మస్థానం కానుందని" శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రూ. 480 కోట్లలో ఏర్పాటు చేసే నావల్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, స్వయంప్రతిపత్తి గల స్వతంత్ర జలాంతర్గత వాహనాలు , స్వతంత్ర జలాంతర్గత ప్రతిచర్య వ్యవస్థలు, తదుపరి తరం టార్పెడోలను తయారు చేయనున్నాయి. భారత్ ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక కీలక విడి భాగాలు, ఉప-వ్యవస్థలను ఇది తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారత నావికాదళ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని, దేశ నీలి ఆర్థిక వ్యవస్థకు, సముద్ర భద్రతకు ఒక గేమ్-ఛేంజర్గా నిలవనుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చెందిన అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం భవిష్యత్ యుద్ధాలకు భారతదేశ సన్నద్ధతను బలోపేతం చేసే ఆయుధాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీ రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ సుమారు రూ. 1,200 కోట్ల పెట్టుబడితో ఆయుధ సామాగ్రి, ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఏ ఆయుధ సామగ్రిలోనైనా 'ఫ్యూజ్' అత్యంత కీలకమైన భాగమని, ఆయుధ సామగ్రి తయారీలో దేశం స్వావలంబన దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. "ఈ ప్లాంట్లో తయారయ్యే అత్యాధునిక ఫ్యూజ్లు మన రక్షణ దళాల సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి తెలిపారు.

డ్రోన్ సిటీ గురించి ప్రస్తావిస్తూ, యువ పారిశ్రామికవేత్తల సమష్టి దార్శనికతను ప్రశంసించారు. ఈ యూనిట్లు విడివిడిగా చిన్నవిగా అనిపించినప్పటికీ, 'మేక్-ఇన్-ఇండియా' దార్శనికతను ఒక సుస్పష్టమైన వాస్తవికతగా మార్చే కీలకమైన అంశాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. "ఆధునిక యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పును తీసుకురావడంతో పాటుగా, ఇతర రంగాలలో కూడా వేగంగా విస్తరిస్తోందని అన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే డ్రోన్లు దేశ నాణ్యతను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తాయని నేను విశ్వసిస్తున్నాను. సూరత్ను 'డైమండ్ సిటీ' అని, బెంగళూరును భారతదేశపు 'సిలికాన్ వ్యాలీ' అని ఎలాగైతే పిలుస్తారో, అలాగే ఈ ప్రాంతం కూడా త్వరలోనే దేశపు 'డ్రోన్ హబ్'గా గుర్తింపు పొందుతుంది," అని ఆయన అన్నారు.
గత 10 సంవత్సరాలుగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి కృషి చేసిందని రక్షణ మంత్రి తెలిపారు. ఈ రోజు దేశం కేవలం 'ప్రభుత్వ సమగ్ర విధానం'తోనే కాకుండా, 'సంపూర్ణ దేశం, 'మొత్తం ప్రజలు అనే విధానంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. "ఒక వ్యక్తిగత ఆవిష్కర్త అయినా, ఒక పెద్ద కార్పొరేషన్ అయినా, ఒక స్టార్టప్ అయినా, లేదా ఒక ఎంఎస్ఎంఈ అయినా, ప్రతి ఒక్కరూ జాతీయ భద్రతకు దోహదపడుతున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానం రక్షణ తయారీ రంగాన్ని ఒక ప్రజా ఉద్యమంగా విజయవంతం చేసిందన్నారు.
ప్రభుత్వ కృషితో సాధించిన పురోగతిని వివరిస్తూ, 2014లో కేవలం రూ. 46,000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తులు, ఇప్పుడు దాదాపు రూ. 1.54 లక్షల కోట్లకు గరిష్ట స్థాయికి చేరుకుందని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఒకటి లేదా రెండు నెలల్లోనే రక్షణ రంగ ఉత్పత్తులు రూ. 1.75 లక్షల కోట్లకు చేరుకుంటాయని తెలిపారు. దశాబ్దం క్రితం సుమారు రూ. 600 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు, ప్రస్తుతం సుమారు రూ. 40,000 కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయని వివరించారు.
ప్రస్తుత తప్పుడు సమాచార యుగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ మంత్రి కోరారు. “మన శత్రువులు కేవలం ఆయుధాలతోనే దాడి చేయరని, పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ హాని కలిగించవచ్చని అన్నారు. దేశంలో చమురు నిల్వలు అయిపోయాయనో, దేశంలో విపత్తు రాబోతుందంటూ పుకార్లు వ్యాప్తి చేయవచ్చుని తెలిపారు. దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయన్న రాజ్ నాథ్ సింగ్.. ఒక్క తప్పుడు సమాచారం కూడా హానికరం కావచ్చని, ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని లేదా ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును, సలహాగానే చూడాలన్నారు.
.
సమష్టి కృషితోనే దేశ నిర్మాణం సాధ్యమమని శ్రీ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. "మనమందరం చేతులు కలిపి, మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, విశ్వ సోదరభావ స్ఫూర్తితో యావత్ ప్రపంచానికి సహాయం అందించే దేశాన్ని నిర్మిద్దాం," అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, స్వదేశీ తయారీ & ఆత్మనిర్భరతపై నిరంతర దృష్టితో సైన్యాన్ని ఆధునీకరించడంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. సంస్కరణలు, పెట్టుబడులు, ఆవిష్కరణలకు నిరంతర ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రక్షణ, అంతరిక్ష రంగాలలో దేశ సన్నద్ధత, ప్రపంచ స్థాయి గుర్తింపు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్ పెరుగుతున్న భారతదేశ శక్తికి, సాంకేతిక పురోగతికి, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత విజయానికి ఒక గర్వకారణమైన ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. శంకుస్థాపన జరిగిన ఈ సదుపాయాలు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేసి, ఈ ప్రాంతంలో వృద్ధిని పెంపొందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారాన్ని అందిస్తూ, పరిశ్రమలకు మరియు పారిశ్రామికవేత్తలకు “డిజైన్-ఇన్-ఆంధ్రప్రదేశ్, మేక్-ఇన్-ఆంధ్రప్రదేశ్, లీడ్-ఫ్రమ్-ఆంధ్రప్రదేశ్” అని పిలుపునిచ్చారు. “నూతన ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ అనే మూడు బలాలతో నూతన ఆంధ్రప్రదేశ్ నిర్మించబడుతోంది. భారతదేశం వికసిత భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపిస్తుందని,” ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏపీ ప్రభుత్వ మంత్రులు, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.
******
(రిలీజ్ ఐడి: 2261505)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13