గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించిన భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ నరేంద్ర భూషణ్
రక్షిత నీటిపారుదల, జీవనోపాధి పెంపు, నేల, నీటి సంరక్షణపై చేపట్టిన కార్యక్రమాలపై ప్రతినిధి బృందం సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 1:07PM by PIB Hyderabad
కేంద్ర భూవనరుల శాఖ కార్యదర్శి శ్రీ నరేంద్ర భూషణ్ నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లా మగర్లోడ్ మండలంలో పర్యటించింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 (డబ్ల్యూడీసీ-పీఎంకేఎస్‌వై 2.0) లోని వాటర్‌షెడ్ అభివృద్ధి విభాగం కింద చేపట్టిన వివిధ వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను ఈ బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది.
జలవనరుల నిర్వహణ సంయుక్త కార్యదర్శి శ్రీ నితిన్ ఖడే, జిల్లా కలెక్టర్ శ్రీ అవినాష్ మిశ్రాలతో కూడిన ఈ ప్రతినిధి బృందం.. రక్షిత నీటిపారుదల, జీవనోపాధి పెంపుదల, నేల, నీటి సంరక్షణపై దృష్టి సారించిన వివిధ కార్యక్రమాలను సమీక్షించింది.
సంక్రా గ్రామ పర్యటనలో భాగంగా వాటర్‌షెడ్ అభివృద్ధి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల నిధుల సమన్వయంతో రూ. 40.34 లక్షల వ్యయంతో నిర్మించిన ఒక ఆనకట్టను కార్యదర్శి పరిశీలించారు. ఈ నిర్మాణం ద్వారా సుమారు 80–85 ఎకరాలకు సాగునీరు అందుతోందని, 50 మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. బెలౌడి గ్రామంలో రూ. 20.20 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన 430 మీటర్ల సాగునీటి కాలువను ప్రతినిధి బృందం సమీక్షించింది. ఇది ప్రస్తుతం సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా, నేల కోతను గణనీయంగా తగ్గించడంలో సహాయపడింది.
ఈ బృందం సౌంగా గ్రామంలో అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తోటను కూడా సందర్శించింది. అక్కడ ఒక నదీ ద్వీపంలో 1,050 జామ, నిమ్మ చెట్లను నాటారు. నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో చిన్న కుంటలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
భూగర్భ జలాల పునరుద్ధరణ, సమాజానికి నీటి లభ్యతను పెంచడంలో ‘అమృత్ సరోవర్’ ప్రాజెక్టుల సహకారాన్ని పరిశీలించేందుకు బొడ్రా గడాడిహ్ గ్రామాలను ప్రతినిధి బృందం సందర్శించింది.
ఈ పర్యటనలో గడాడిహ్‌లోని ఎత్తిపోతల సాగునీటి పథకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది మహానది నీటిని వినియోగించుకుని 85 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తూ దాదాపు 250 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టును ఒక ‘విజయవంతమైన నమూనా’గా శ్రీ నరేంద్ర భూషణ్ అభివర్ణించారు. భవిష్యత్తులో చేపట్టే వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఇటువంటి విజయగాథలను రాష్ట్ర స్థాయి నమూనాలుగా డాక్యుమెంట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బెలౌడి గ్రామంలోని ఒక కూరగాయల సాగు క్షేత్రాన్ని తనిఖీ చేయడంతో ఈ పర్యటన ముగిసింది. అక్కడ తమ ఆదాయాలను పెంచుకోవడానికి ఉద్యానవన పద్ధతులను అవలంబిస్తున్న రైతులను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2261444)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6