కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జెనీవాలో ‘ఐటీయూ కౌన్సిల్ 2026’... ప్రపంచ టెలికాం నాయకత్వాన్ని బలపరిచిన భారత్
‘ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ సమావేశం-2030’ నిర్వహణ అవకాశం భారత్‌కు!
కీలక చర్చల్లో చురుకుగా పాల్గొన్న డీఓటీ ప్రతినిధివర్గం…
ప్రపంచ డిజిటల్ సహకారంతో పాటు ఐటీయూ నాయకత్వంలో తన పాత్రను మరింత బలోపేతం చేసుకున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 5:30PM by PIB Hyderabad
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో 2026 ఏప్రిల్ 28 నుంచి మే నెల 8 వరకూ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) కౌన్సిల్ 2026’ సమావేశంలో భారతీయ ప్రతినిధివర్గం పాల్గొంది.
టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అంతర్జాతీయ సంబంధాలు) శ్రీ ముకేశ్ కుమార్ ఈ ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించారు.
కౌన్సిల్ సమావేశంలో, డీఓటీ ప్రతినిధివర్గం జెనీవాలో గల ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధితో కలిసి పాల్గొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్‌కీ, డిజిటల్ సహకారానికీ సంబంధించిన అనేక కీలక అంశాలపై జరిగిన చర్చల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. డిజిటల్, టెలికాం రంగంలో భారత్ నాయకత్వం అంతకంతకూ వృద్ధి చెందుతున్న అంశాన్ని కూడా వారు ఈ సందర్భంగా వివరించారు.
ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ సమావేశాన్ని (పీపీ-2030) నిర్వహించేందుకు సంబంధించి ఒక ప్రతిపాదనను భారత్ ఈ సమావేశంలో ప్రస్తావించింది. ఐటీయూ కౌన్సిల్ భారత్ ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలిపింది. ఇది ప్రపంచ టెలీకమ్యూనికేషన్స్, డిజిటల్ విధానాల్లో విస్తృతమవుతున్న భారత్ విజయాన్ని సూచిస్తోంది. భారత్ ప్రతిపాదనకు 2026 నవంబరులో దోహాలో నిర్వహించనున్న ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ సమావేశం-2026లో తుది మంజూరు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతినిధివర్గం ఐటీయూ ప్రాంతీయ ఉనికి, ఐటీయూ సభ్యత్వాలు, ఐటీయూ కార్యక్రమాల నిర్వహణ సహా అనేక ముఖ్య విషయాలపైనా అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది.
ఐటీయూ ఎన్నికలకు భారత్ అభ్యర్థిత్వాల తరఫున దీటైన ప్రచారాన్ని భారత్ చేపట్టి, 2026 ఏప్రిల్ 30న ఐటీయూ ప్రాంగణంలో ఒక ‘నెట్‌వర్కింగ్ ఆపరేషన్’ను నిర్వహించింది. దీనిలో 69 సభ్యదేశాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీయూ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియతో పాటు రేడియో కమ్యూనికేషన్స్ బ్యూరో (బీఆర్) డైరెక్టరు పదవి కోసం కూడా భారత్ అభ్యర్థిత్వాల్ని సమర్పించింది. భారత్ అభ్యర్థి డాక్టర్ రేవతీ మన్నేపల్లి రిసెప్షన్ సందర్భంగా ఐటీయూ రేడియో రంగానికి సంబంధించి తన దృష్టికోణాన్ని తెలియజేశారు.
భారత్ అభ్యర్థిత్వాలకు మద్దతును సమీకరిరంచడానికి, సభ్యదేశాలతో కలసి సహకారాన్ని పెంచుకోడానికి, మొత్తం 15 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా 2026 మే 8న దృశ్య మాధ్యమం ద్వారా కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ 6జీ, కృత్రిమ మేధ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్థిర ప్రాతిపదికన డిజిటల్ పరివర్తన అంశాలతో పాటు డబ్ల్యూటీఎస్ఏ తీర్మానాల అమలుకు భారత్ స్వచ్ఛంద తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు. ఈ తోడ్పాటుతో ఐటీయూ పనుల్లో భారత్ నాయకత్వ పాత్రకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, ప్రపంచ టెలికాం ప్రమాణీకరణ, మునుముందు డిజిటల్ అభివృద్ధి కార్యక్రమాల్లో అవకాశాలు కూడా అందివస్తాయని ఆశిస్తున్నారు.
ఐటీయూ కౌన్సిల్ గురించి
ఐటీయూ కౌన్సిల్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు పాలకవర్గంగా పనిచేస్తోంది. దీనిలో 48 సభ్యదేశాలు ఉన్నాయి. వ్యూహం, విధానం, బడ్జెట్టులతో పాటు ఆర్థిక నియంత్రణలను పర్యవేక్షించడానికి ఈ సంఘం ప్రతి ఏటా జెనీవాలో సమావేశమవుతుంది. భారత్ 1952 నుంచి ఐటీయూ కౌన్సిల్‌లో సభ్యదేశంగా ఉంది.
(రిలీజ్ ఐడి: 2261362)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14