వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగో భారత్ - ఆఫ్రికా ఫోరం సదస్సు సందర్భంగా నిర్వహించే భారత్ - ఆఫ్రికా వాణిజ్య చర్చలు, ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 8:26PM by PIB Hyderabad

నాలుగో భారత్ - ఆఫ్రికా ఫోరమ్ సదస్సు (ఐఏఎఫ్ఎస్-IV) సందర్భంగా త్వరలో నిర్వహించనున్న భారత్ - ఆఫ్రికా వాణిజ్య చర్చలు (ఐఏబీడీ), ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమాన్ని 2026 మే 13న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆఫ్రికా దేశాల రెసిడెంట్ అంబాసిడర్లు, హై కమిషనర్లు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక సంఘాలు, సంస్థలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల (ఈపీసీలు) ప్రతినిధులు, వ్యాపార సంస్థలు, భారత్, ఆఫ్రికాలకు చెందిన సంబంధిత భాగస్వామ్య ప్రముఖులు హాజరయ్యారు.

వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా.. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే అత్యున్నత వేదికగా ఐఏబీడీ, ప్రదర్శనను రూపొందించారు.

సభనుద్దేశించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప్రసంగిస్తూ.. శతాబ్దాల నాటి నౌకావాణిజ్య సంబంధాలు, వలసవాద వ్యతిరేక పోరాటాల్లో సంఘీభావం, బలమైన సామాజిక - సాంస్కృతిక బంధాలతో ముడిపడి ఉన్న భారత్ - ఆఫ్రికా చారిత్రక, నాగరికతా సంబంధాలను వివరించారు. భారత్, ఆఫ్రికా కలిసి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మరింత సమ్మిళిత, పటిష్టమైన, ఆవిష్కరణలు చోదకంగా ఉన్న భవితను రూపుదిద్దగలవని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ - ఆఫ్రికా ఆర్థిక సంబంధాలు ఇటీవలి కాలంలో బలమైన వృద్ధిని సాధించాయని కేంద్ర మంత్రి చెప్పారు. భారత్, ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025–26లో 93.69 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14.39 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. ఇదే కాలంలో ఆఫ్రికాకు భారత ఎగుమతులు 45.42 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 48.27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నారు.

రెండు వైపులా వ్యాపారాలు మరింత వేగంగా, నిరంతరాయంగా వృద్ధి చెందడానికి వీలుగా.. ప్రస్తుత వాణిజ్య సంబంధాలను, ప్రాధాన్యత వాణిజ్య చట్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి అన్నారు. దీని కోసం ప్రమాణాలను, కస్టమ్స్ విధానాలను, వ్యాపార పద్ధతులను ఒకే తాటిపైకి తీసుకురావాలని సూచించారు. భారత్ - ఆఫ్రికా మధ్య సహకారానికి ఉన్న అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని ఆయన వివరిస్తూ.. దాదాపు 3.4 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆఫ్రికా ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ), వేగంగా విస్తరిస్తున్న భారత 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిసి అద్భుత అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు. అధిక విలువ కలిగిన తయారీ రంగం, అన్ని దశల్లోనూ సమగ్ర సమన్వయం దిశగా పటిష్టమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని, వివిధ మార్గాల్లో సరఫరా వ్యవస్థలను ప్రోత్సహించాలని, ముడి పదార్థాల వాణిజ్యానికే పరిమితం కావద్దని ఆయన పిలుపునిచ్చారు.

భారత్ - ఆఫ్రికా సహకార భవితను రూపుదిద్దడంలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అభివృద్ధిలో యువత ముందుండి నడపడం కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రిక్ రవాణా, డిజిటలైజేషన్, టెలికమ్యూనికేషన్ల వంటివి పరస్పర సహకారానికి ప్రధాన రంగాలుగా ఆయన గుర్తించారు. భారత్, ఆఫ్రికా జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది 35 ఏళ్లలోపు వారేనని గుర్తు చేస్తూ.. భవిష్యత్తు పరిశ్రమల కోసం నైపుణ్యాభివృద్ధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలు, ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కామెరూన్‌లో నిర్వహించిన 14వ డబ్ల్యూటీవో మంత్రుల స్థాయి సదస్సులో వినిపించిన ఒక సామెతను గుర్తుచేశారు. ‘ఒక్క చేత్తో కట్టను కట్టలేము’ అన్న సామెతను ఉటంకిస్తూ.. ఉమ్మడి శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధి కోసం ఆఫ్రికా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

భారత్ - ఆఫ్రికా భాగస్వామ్యం తదుపరి దశలో కేవలం సంప్రదాయ ముడి పదార్థాల వాణిజ్యానికే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, సమగ్ర సరఫరా వ్యవస్థలు, స్థానిక తయారీ, సాంకేతికత చోదకంగా ఉన్న సహకారం దిశగా సాగాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. వ్యవసాయం, ఆహార శుద్ధి, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ రవాణా, తయారీ రంగం, రక్షణ ఉత్పత్తి, అత్యాధునిక సాంకేతికతలను భవిష్యత్తు సహకారానికి కీలక రంగాలుగా ఆయన పేర్కొన్నారు.

ఆఫ్రికా ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ) తీసుకురాగల విప్లవాత్మక మార్పులను మంత్రి వివరించారు. ఆఫ్రికాలోని ప్రాంతీయ ఆర్థిక సమూహాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న భారత్ నిశ్చయాన్ని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ దేశాల మధ్య బలమైన వాణిజ్య కారిడార్‌లను నిర్మించాల్సిన అవసరముందన్నారు. సరఫరా వ్యవస్థలో వైవిధ్యం, మెరుగైన లాజిస్టిక్స్, పర్యావరణ హిత భాగస్వామ్యాల ద్వారా 2030 నాటికి భారత్ - ఆఫ్రికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉమ్మడి చరిత్ర, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు, అభివృద్ధి కాంక్షలతో కూడిన సుదీర్ఘమైన, బహుముఖీన భాగస్వామ్యం భారత్, ఆఫ్రికా మధ్య ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో నిర్వహించనున్న భారత్ - ఆఫ్రికా వాణిజ్య చర్చ, ప్రదర్శన.. ఇరుపక్షాల విధాన నిర్ణేతలు, పారిశ్రామిక ప్రముఖులు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, అభివృద్ధి సంస్థలు, పారిశ్రామికవేత్తలను ఒక్కచోటకు తెచ్చే కీలక వేదికగా నిలుస్తుందని ఆయన వివరించారు.

పర్యావరణ చర్యలు, సుస్థిరత, మౌలిక సదుపాయాలు, అనుసంధానం, డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, ఎంఎస్ఎంఈ భాగస్వామ్యాలు, ఆరోగ్య సంరక్షణ, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక సేవలు, లాజిస్టిక్స్, వ్యూహాత్మక సహకారం, కీలక ఖనిజాల వంటి వివిధ ప్రత్యేక అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుందని వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వసభ్య సమావేశాలు, విధానపరమైన చర్చలు, రంగాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, బీ2బీ, బీ2జీ భేటీలు, నెట్‌వర్కింగ్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే భారత్, ఆఫ్రికా మధ్య సాంకేతికతలు, ఆవిష్కరణలు, రంగాలవారీగా ఉత్తమ పద్ధతులు, సహకారానికి సంబంధించిన విజయగాథలను ప్రదర్శించేలా అంశాలవారీ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తారు.

ఇటీవల జరిగిన 10వ భారత్ - కెన్యా సంయుక్త వాణిజ్య కమిటీ, 5వ భారత్ - టాంజానియా సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశాలను కూడా వాణిజ్య కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల సమీక్ష, పెట్టుబడుల సహకారాన్ని బలోపేతం చేయడం, కొత్త భాగస్వామ్య రంగాలను గుర్తించడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆఫ్రికా దేశాలతో భారత ఆర్థిక సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలన్న ఉమ్మడి నిశ్చయాన్ని ఈ చర్చలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

స్వల్పంగా అభివృద్ధి చెందిన దేశాల కోసం అమలు చేస్తున్న సుంకాల్లేని పన్ను ప్రాధాన్యతా (డీఎఫ్‌టీపీ) పథకం, పలు ఆఫ్రికా దేశాలతో కొనసాగుతున్న ద్వైపాక్షిక సంయుక్త వాణిజ్య కమిటీ యంత్రాంగాల వంటి కార్యక్రమాల ద్వారా.. ఆఫ్రికా భాగస్వాములతో వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా.. సంస్థాగత, విధానపరమైన చట్రాలను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ సన్నాహక కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

త్వరలో నిర్వహించనున్న భారత్ - ఆఫ్రికా వాణిజ్య చర్చలు, ప్రదర్శనకు ప్రతినిధులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. వికసిత్ భారత్ 2047, ఆఫ్రికా ఎజెండా 2063 ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా.. భారత్ - ఆఫ్రికా ఆర్థిక సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

భారత్ - ఆఫ్రికా వాణిజ్య చర్చలు, ప్రదర్శనతోపాటు నాలుగో భారత్ - ఆఫ్రికా ఫోరమ్ సదస్సు విజయవంతమయ్యేలా.. ఇరుపక్షాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఆర్థిక సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు విస్తృతంగా, క్రియాశీలకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని భారత ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.  

***


(రిలీజ్ ఐడి: 2261320) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil