శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మల్టిపుల్ మైలోమాకు అధునాతన సీఏఆర్-టీ సెల్ థెరపీను అభివృద్ధి చేయడానికి ఇండో-సింగపూర్ సహకార పరిధిలో హెలిక్స్ సెల్ థెరప్యూటిక్స్‌కు మద్దతిస్తున్న టీడీబీ-డీఎస్‌టీ

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 12:34PM by PIB Hyderabad

భారత అధునాతన బయోటెక్నాలజీ, సెల్ థెరపీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన చర్యలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) పరిధిలోని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టీడీబీ) తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన హెలిక్స్ సెల్ థెరప్యూటిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం నూతన డ్యూయల్ టార్గెటింగ్ కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్స్ రూపొందించడం, మొదటి దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడం’’ అనే ప్రాజెక్టు కోసం ఈ ఒప్పందం కుదిరింది. సింగపూర్‌కు చెందిన బయోసెల్ ఇన్నోవేషన్స్ భాగస్వామ్యంతో ఇండో-సింగపూర్ సహకారం కింద ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.

తీవ్ర ప్రభావం చూపించే, ప్రస్తుతం చికిత్స అందుబాటులో లేని రక్త క్యాన్సర్ అయిన మల్టిపుల్ మైలోమా కోసం అధునాతన డ్యూయల్-టార్గెటింగ్ సీఏఆర్-టీ సెల్ థెరపీని అభివృద్ధి చేయడంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. బీసీఎంఏ లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం అందిస్తున్న సీఏఆర్-టీ థెరపీలు వ్యాధి తిరగబెట్టిన లేదా  ఇతర చికిత్సా విధానాలకు అదుపులోకి రాని రోగుల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తున్నాయి. అయినప్పటికీ, మల్టిపుల్ మైలోమా కణాల్లోని బీసీఎంఏ, సీడీ19 మార్కర్లను ఒకే సమయంలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా చికిత్స సామర్థ్యాన్ని, వ్యాధి నుంచి ఉపశమనం పొందే సమయాన్ని ప్రతిపాదిత ఆవిష్కరణ మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో మొదటి దశ క్లినికల్ పరీక్షల ద్వారా డ్యూయల్ టార్గెటింగ్ సీఏఆర్-టీ సెల్స్‌ను హెలిక్స్ సెల్ థెరప్యూటిక్స్ అభివృద్ధి చేసి, తయారు చేసి, వైద్యపరంగా పరీక్షిస్తుంది. ఈ థెరపీ వివిధ రకాల చికిత్సా పద్ధతులు విఫలమై, పరిమిత చికిత్సా విధానాలు మాత్రమే అందుబాటులో ఉన్న రోగుల కోసం ఉద్దేశించినది.

సీఏఆర్-టీ సెల్ థెరపీలో క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా గుర్తించి, నాశనం చేయడానికి రోగికి చెందిన టీ లింఫోసైట్స్‌కు జన్యుపరమైన మార్పులు చేస్తారు. సంప్రదాయ సింగిల్-మార్కర్ సీఏఆర్-టీ చికిత్సా విధానాల కంటే మెరుగైన పురోగతిని ఈ ప్రతిపాదిత డ్యూయల్ టార్గెటింగ్ చికిత్స సూచిస్తుంది. చికిత్స అందించడం కష్టంగా మారిన మల్టిపుల్ మైలోమా రోగుల్లో దీర్ఘకాలిక ఉపశమన ఫలితాలను ఈ విధానం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

ఆత్మనిర్భర భారత్ విస్తృత విధానాలకు అనుగుణంగా అధునాతన బయోలాజిక్స్, కచ్చితత్వంతో కూడిన ఔషధాలు, అధునాతన ఆరోగ్య సేవల సాంకేతికతల్లో దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలన్న భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. నూతనంగా ఆవిర్భవిస్తున్న బయోమెడికల్ ఆవిష్కరణ రంగాల్లో భారత్, సింగపూర్ మధ్య అంతర్జాతీయ సహకారాన్ని సైతం ఇది బలోపేతం చేస్తుంది.

ఈ సందర్భంగా టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడారు. ‘‘కచ్చితత్వంతో కూడిన ఆరోగ్య సేవల భవిష్యత్తును అధునాతన కణ, జన్యు చికిత్సలు సూచిస్తాయి. అలాగే క్లిష్టమైన, గతంలో నయం చేయలేని రోగాలకు చికిత్సను అందించడంలో పరివర్తనాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అత్యాదునిక బయోటెక్నాలజీ, అందుబాటు ధరల్లో చికిత్సా విధానాల్లో భారత్‌ను అంతర్జాతీయంగా బలోపేతం చేసేలా అధునాతన ఇమ్యునోథెరపీ పద్దతుల్లో స్వదేశీ ఆవిష్కరణలకు ఇండో-సింగపూర్ భాగస్వామ్య ప్రాజెక్టు ద్వారా టీడీబీ తోడ్పాటు అందిస్తోంది’’ అని తెలిపారు.

టీడీబీ అందిస్తున్న మద్దతుకు హెలిక్స్ సెల్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తోడ్పాటు వల్ల సంస్థ చేపడుతున్న సీఏఆర్‌-టీ పరిశోధనను చికిత్సగా మార్చడం, వాణిజ్యీకరణను వేగవంతం చేయడమే కాకుండా   భారతదేశంలో అధునాతన క్యాన్సర్ చికిత్సా విధానాలను అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తుందని చెప్పారు.

--- మీడియా సంబంధ సమాచారం కోసం సంప్రదించండి: media-coordinator@tdb.gov.in .

***


(రిలీజ్ ఐడి: 2260986) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu , Tamil