మంత్రిమండలి
రూ. 37,500 కోట్ల ఆర్థిక వ్యయంతో ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 3:29PM by PIB Hyderabad
ఉపరితల బొగ్గు/ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూ. 37,500 కోట్ల వ్యయంతో కూడిన పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దేశ బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో ఈ పథకం ఒక కీలక ముందడుగు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చాలన్న (గ్యాసిఫై) జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఎల్‌ఎన్‌జీ (50 శాతానికి పైగా దిగుమతి), యూరియా (20 శాతం వరకు దిగుమతి), అమోనియా (దాదాపు 100 శాతం), మిథనాల్ (దాదాపు 80-90 శాతం) వంటి కీలక ఉత్పత్తుల కోసం మన దేశం దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుంది.
అలాగే అనియంత్రిత రంగ లింకేజీ వేలం విధానంలో.. ‘బొగ్గు వాయువుగా మార్చే సంశ్లేషిత వాయు ఉత్పత్తి’ అనే ఉప విభాగం కింద బొగ్గు సరఫరా ఒప్పందాల కాలపరిమితిని ప్రభుత్వం 30 ఏళ్ల వరకు పొడిగించింది. బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వాన్ని అందించడం కోసం ఈ చర్యను చేపట్టింది.
పథకం ముఖ్యాంశాలు:
§ కొత్తగా చేపట్టే ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం రూ. 37,500 కోట్లను కేటాయించింది. దీని ద్వారా సంశ్లేషిత వాయువు, అనుబంధ ఉత్పత్తులను పెంచడమే కాకుండా, దాదాపు 75 మిలియన్ టన్నుల బొగ్గు/లిగ్నైట్‌ను గ్యాసిఫికేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
§ ప్లాంటు, యంత్రాల ఖర్చులో గరిష్టంగా 20 శాతం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తారు.
§ పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టుల ఎంపిక జరుగుతుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం, అవసరమయ్యే బొగ్గు పరిమాణం, దాని ద్వారా వచ్చే సంశ్లేషిత వాయు ఉత్పత్తి సామర్థ్యం వంటి ప్రామాణిక అంశాల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
§ ప్రభుత్వం అందించే ఈ ప్రోత్సాహకాలను ప్రాజెక్టు సాధించిన పురోగతిని బట్టి నాలుగు సమాన వాయిదాల్లో పంపిణీ చేస్తారు.
§ ఏదైనా ఒకే ప్రాజెక్టుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకానికి గరిష్ట పరిమితి రూ.5,000 కోట్లు. సంశ్లేషిత సహజవాయువు, యూరియా మినహా ఏదైనా ఒక ఉత్పత్తికి సంబంధించి ప్రోత్సాహకంపై గరిష్ట పరిమితి రూ. 9,000 కోట్లు. అన్ని ప్రాజెక్టులు కలిపి ఏదైనా ఒక సంస్థకు ప్రోత్సాహకానికి గరిష్ట పరిమితి రూ. 12,000 కోట్లు.
§ ఈ పథకం కింద లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు.. వాణిజ్యపరమైన బొగ్గు మైనింగ్ విధానం లేదా ఇతర కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పథకాల ద్వారా లభించే రాయితీలకు అదనం. వాటిని పొందకుండా ఎటువంటి పరిమితులను ఇవి విధించవు.
§ ఈ పథకం సాంకేతికతతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. అయితే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడాన్ని ప్రోత్సహిస్తుంది.
వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు:
§ పెట్టుబడి సమీకరణ అంచనా: రూ. 2.5 - 3.0 లక్షల కోట్లు
§ ఇంధన భద్రత, దిగుమతి ప్రత్యామ్నాయం: బొగ్గు వనరులను వివిధ రకాలుగా వినియోగించుకుంటూ ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమోనియా, అమోనియం నైట్రేట్, మిథనాల్, కోకింగ్ బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా నిలవడం ద్వారా.. ప్రపంచ ధరల అస్థిరత, భౌగోళిక రాజకీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల నుంచి దేశాన్ని కాపాడుతూ ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలను ఈ పథకం ముందుకు తీసుకెళ్తుంది.
§ ఉపాధి కల్పన: ఈ పథకం ద్వారా బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లోని 25 ప్రాజెక్టుల్లో దాదాపు 50,000 (ప్రత్యక్ష, పరోక్ష) ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
§ ప్రభుత్వాలకు ఆదాయం: ఈ పథకం కింద నిర్దేశించిన 75 మిలియన్ టన్నుల గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు/లిగ్నైట్ వినియోగం వల్ల ఏటా రూ. 6,300 కోట్ల ఆదాయంతోపాటు.. జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో అనుబంధ ఆదాయం కూడా సమకూరుతుందని అంచనా.
§ సాంకేతిక వ్యవస్థ: దేశీయ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, విదేశీ ఈపీసీ కాంట్రాక్టర్లపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా.. దేశీయ ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
నేపథ్యం:
ప్రపంచంలో అత్యంత విస్తృతంగా బొగ్గు (దాదాపు 401 బిలియన్ టన్నులు), లిగ్నైట్ (దాదాపు 47 బిలియన్ టన్నులు) నిల్వలున్న దేశాల్లో భారత్ ఒకటి. దేశ ఇంధన వినియోగంలో బొగ్గు వాటా 55 శాతానికి పైగా ఉంది. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు/లిగ్నైట్‌ను ‘సంశ్లేషిత వాయువు’గా మారుస్తారు. ఇది దేశీయంగా ఇంధనాలు, రసాయనాల తయారీకి బహుముఖ ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల భారత్ విలువైన దిగుమతులకు ప్రత్యామ్నాయాన్ని పొందడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా విఘాతాలు, ధరల అస్థిరత నుంచి తనను తాను కాపాడుకునేందుకు వీలవుతుంది.
ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియా, కోకింగ్ బొగ్గు, మిథనాల్, డీఎంఈ, ఇతర ప్రత్యామ్నాయ ఉత్పత్తుల కోసం భారత్ దిగుమతుల వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.77 లక్షల కోట్లుగా ఉంది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ దిగుమతులపై ఆధారపడడంలోని ప్రమాదం మరింత స్పష్టమైంది.
జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ (2021), 2024 జనవరిలో ఆమోదించిన రూ. 8,500 కోట్ల పథకం (దీని కింద రూ. 6,233 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి) అందించిన ప్రోత్సాహంతో.. గణనీయమైన తోడ్పాటును ఈ కొత్త పథకం అందిస్తూ, ఆ వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
***
(రిలీజ్ ఐడి: 2260733)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13