భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఏఐ-సామర్థ్యంతో హైపర్-లోకల్ వాతావరణ సూచనలిచ్చే వ్యవస్థలకు ‘ఐఎండీ’ శ్రీకారం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
· “ఈ అత్యాధునిక సూచన వ్యవస్థల ద్వారా 10 రోజుల ముందే స్థానిక వాతావరణ సమాచార సౌలభ్యం”
· “దేశంలోని 16 రాష్ట్రాల్లో 3,000కు పైగా ఉప-జిల్లాల కోసం ఏఐ సామర్థ్యంతో రుతుపవన సూచన వేదికను ప్రారంభించిన ప్రభుత్వం”
· ఉత్తర ప్రదేశ్‌లో ఏఐ-ఆధారిత రుతుపవన ముందస్తు సూచన వ్యవస్థ సహా కి.మీ. రిజల్యూషన్ సామర్థ్య వర్షపాత సూచికకు మంత్రి శ్రీకారం
· “కేంద్ర ప్రభుత్వ దైనందిన పాలన-ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో ‘ఐఎండీ’ నేడొక కీలక భాగం”
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 4:03PM by PIB Hyderabad
కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యంతో దేశవ్యాప్తంగా హైపర్-లోకల్, ప్రభావ ఆధారిత వాతావరణ సూచనలిచ్చే అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ శ్రీకారం చుట్టారు. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ రెండు వ్యవస్థలను రూపొందించింది.
ఈ మేరకు ఐఎండీ రూపొందించిన తొలి ఏఐ ఆధారిత వ్యవస్థ దేశంలోని వివిధ ప్రాంతాలలో రుతుపవన పురోగమనాన్ని అంచనా వేస్తుంది. అలాగే, ఉత్తర ప్రదేశ్ కోసం అధిక ప్రాదేశిక రిజల్యూషన్ వర్షపాత అంచనా వ్యవస్థను మంత్రి ఈ రోజు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ వ్యవస్థలను ‘ఐఎండీ’తోపాటు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ-పుణె’, ‘నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్’ సంయుక్తంగా రూపొందించాయి.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ- గడచిన దశాబ్ద కాలంలో భారత వాతావరణ అంచనా సామర్థ్యంలో వినూత్న పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. సాంకేతికత, డేటా అనుసంధానం, అధునాతన మోడలింగ్ వంటివి అంచనాల కచ్చితత్వాన్ని, ఐఎండీ సేవలపై ప్రజల విశ్వాసాన్ని గణనీయంగా మెరుగుపరిచాయని తెలిపారు. పరిపాలన, విపత్తు సంసిద్ధత, వ్యవసాయ ప్రణాళికలు సహా దైనందిన ప్రభుత్వ నిర్ణయాల్లో ఐఎండీ నేడొక అవిభాజ్య భాగమైందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన సరికొత్త వ్యవస్థలు సంప్రదాయ వాతావరణ అంచనాల నుంచి ప్రభావాధారిత-నిర్ణయ మద్దతు అంచనాల వైపు పెనుమార్పును సూచిస్తున్నాయని మంత్రి చెప్పారు. రైతులు, పాలకులు, విపత్తుల నిర్వాహకులు, పౌరులకు కచ్చితమైన, ప్రాంతీయ నిర్దిష్ట, ఆచరణాత్మక సమాచారాన్ని ఇవి సమకూరుస్తాయని తెలిపారు.
న్యూఢిల్లీలోని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రాంగణంలోగల మహికా హాల్‌లో ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, ఐఎండీ వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర, ఐఐటీఎం-పుణె డైరెక్టర్ డాక్టర్ సూర్యచంద్ర రావు, ఐఎండీ, ఐఐటీఎం, ‘ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్’ సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు సహా ప్రచురణ-ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశ వాతావరణ మౌలిక సదుపాయాలు వేగంగా ఆధునిక రూపు సంతరించుకోవడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాదాపు దశాబ్దం కిందట దేశంలో 16 నుండి 17 డాప్లర్ వాతావరణ రాడార్లు మాత్రమే ఉండేవని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు సుమారు 50 రాడార్లు పనిచేస్తుండగా, ‘మిషన్ మౌసం’ కింద మరో 50 ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. పరిశీలన నెట్‌వర్కులు, ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థలు, డిజిటల్ కార్యక్రమ వేదికల విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా వాతావరణ అంచనా సామర్థ్యంతోపాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు గణనీయంగా మెరుగయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఏఐ ఆధారిత రుతుపవనాల ముందస్తు అంచనా వ్యవస్థ వాటి పురోగమనంపై నాలుగు వారాలు ముందుగా.. ప్రతి బుధవారం సంభావ్య అంచనాలను సమకూరుస్తుందని చెప్పారు. వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచార చట్రం ద్వారా 16 రాష్ట్రాల పరిధిలోని 3,000కు పైగా ఉప జిల్లాల రైతులకు చేయూత లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు. తదనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక-సంసిద్ధత దిశగా కార్యాచరణపరంగా ఉపయోగపడే అంచనాల రూపకల్పనలో ఏఐ ఆధారిత నమూనాలు, విస్తృత శ్రేణి అంచనా వ్యవస్థలు, గణాంక పద్ధతులను ఈ వ్యవస్థ ఏకీకృతం చేస్తుందని ఆయన వివరించారు.
ఉత్తర ప్రదేశ్ కోసం ఈ రోజు ప్రారంభించిన రెండో వ్యవస్థ ‘హై స్పేషియల్ రిజల్యూషన్ రెయిన్‌ఫాల్ ఫోర్‌కాస్ట్’ గురించి మంత్రి వివరించారు. ఇది 10 రోజుల ముందుగానే 1 కిలోమీటరు స్పేషియల్ రిజల్యూషన్‌తో వర్షపాత అంచనాల తయారీలో ప్రయోగాత్మక సేవగా రూపొందిందని ఆయన చెప్పారు. అత్యాధునిక ఏఐ ఆధారిత డౌన్‌స్కేలింగ్ పద్ధతులను ఈ వ్యవస్థ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. తదనుగుణంగా స్వయంచలిత వర్ష మానికలు, వాతావరణ స్టేషన్లు, డాప్లర్ వెదర్ రాడార్లు, ఉపగ్రహ ఆధారిత వర్షపాత సమాచార నిధి నుంచి అందే సమాచారాన్ని ఏకీకృతం చేస్తుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయం, జల వనరులు, పునరుత్పాదక ఇంధనం, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల రంగాలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇకపై విత్తడం, నీటి పారుదల, పంటల రక్షణ, పంట కోతలపై రైతులు ఇకపై ప్రణాళికబద్ధంగా మరింత స్థానిక కచ్చితత్వంతో, సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకోగలరని ఆయన అన్నారు.
తీవ్ర వాతావరణ పరిస్థితులపై అంచనాల కచ్చితత్వం రీత్యా గడచిన దశాబ్దంతో పోలిస్తే ఇటీవలి పదేళ్లలో భారత్ దాదాపు 40 శాతం మెరుగుదల సాధించిందని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలోనే తుఫాను మార్గం, తీవ్రత, తీరాన్ని తాకడంపై 72 గంటల ముందస్తు అంచనాలు దాదాపు 30-35 శాతం మెరుగయ్యాయని ఆయన చెప్పారు. అలాగే, కాలానుగుణ అంచనాలలో పొరపాట్లు గణనీయంగా తగ్గాయన్నారు. మారుతున్న వాతావరణ సరళి, పెరుగుతున్న తీవ్ర వాతావరణ విపత్తుల వల్ల కచ్చితమైన, సకాల అంచనాల అవసరం మునుపెన్నడూ లేనంత ఆవశ్యకమైందన్నారు. ఇటీవలి అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులను ప్రస్తావిస్తూ- భారత్‌కు నేడు శాస్త్రీయంగా రూపొందినవే కాకుండా తక్షణ పరిపాలన, ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతిచ్చే సామర్థ్యంగల వాతావరణ అంచనా వ్యవస్థలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో వాతావరణ అంచనాలు, సేవల ఆధునికీకరణ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మేరకు “మిషన్ మౌసమ్, రాడార్ నెట్‌వర్క్‌ల విస్తరణ, పరిశీలన వ్యవస్థల బలోపేతం, డేటా కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్” సౌకర్యాల పెంపు వంటివన్నీ మరింత పటిష్ఠ, సాంకేతికాధారిత అంచనా వ్యవస్థ రూపకల్పనలో దోహదం చేస్తున్నాయని ఆయన చెప్పారు.
విస్తృత ప్రచారం, చివరి అంచెదాకా అనుసంధానానికి భరోసాగా వాతావరణ సలహాలు, ముందస్తు హెచ్చరికలను ఇప్పుడు మొబైల్ అప్లికేషన్లు, సంక్షిప్త సందేశాలు, వాట్సాప్, కిసాన్ పోర్టళ్లు, టెలివిజన్, ఇతరత్రా డిజిటల్ వేదికలు సహా బహుళ మాధ్యమాల ద్వారా అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. తీవ్ర వాతావరణ ముప్పుల సమయంలో నష్టాల తగ్గింపు దిశగా స్థానిక సంస్థలతోపాటు భాగస్వామ్య వ్యవస్థలన్నీ వాతావరణ సలహాలను సకాలంలో పాటించడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ మాట్లాడుతూ- నేడు ప్రారంభించిన కొత్త వ్యవస్థలు సంఖ్యాత్మక వాతావరణ అంచనా నమూనాలతోపాటు ఏఐ-డేటా ఆధారిత విధానాల సమ్మేళనంతో రూపొందించిన భాగస్వామ్య ఆధారిత అంచనా వ్యవస్థలని ఆయన వివరించారు. అత్యంత స్థానిక, అధిక రిజల్యూషన్ వాతావరణ సూచనల దిశగా వ్యవసాయం సహా ఇతర రంగాల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థలను రూపొందించామని ఆయన అన్నారు.
రుతుపవనాల ముందస్తు అంచనా వ్యవస్థ ఇకపై జిల్లా స్థాయి ప్రమాణాలతో రుతుపవనా పురోగమనంపై సూక్ష్మ అంచనాలను అందిస్తుందని డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు. ఇక ఉత్తర ప్రదేశ్ ప్రయోగాత్మక ప్రాజెక్టు దట్టమైన పరిశీలన నెట్‌వర్క్‌లతోపాటు ఏఐ పద్ధతులను అనుసరిస్తుందని చెప్పారు. తద్వారా 1 కిలోమీటరు రిజల్యూషన్‌తో నిర్దిష్ట వర్షపాత అంచనాలను రూపొందించగల సామర్థ్యం దీనికి ఉందన్నారు. వాతావరణ పరిశీలన మౌలిక సదుపాయాలు పెరుగుతున్న కొద్దీ, ఇలాంటి సేవలు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకూ అందుతాయని ఆయన తెలిపారు.
చివరగా, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... ఇవాళ ప్రారంభించిన కొత్త వ్యవస్థలను- దేశం కోసం వాతావరణ మార్పులను తట్టుకోగల, డిజిటల్ సాధికారతగల పౌర కేంద్రక సేవా వ్యవస్థల రూపకల్పనలో కీలక మలుపుగా అభివర్ణించారు. ఈ శాస్త్రవిజ్ఞాన పురోగమనం సామాజిక-ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యక్షంగా దోహదం చేస్తుందని ఆయన ప్రకటించారు.
***
(రిలీజ్ ఐడి: 2260523)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6