రైల్వే మంత్రిత్వ శాఖ
తెలంగాణలో సుమారు రూ.1,535 కోట్లకు పైగా విలువైన
రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను మే 10న జాతికి అంకితం చేయనున్న ప్రధాని
రైలు రవాణాను బలోపేతం చేయడం, రద్దీని తగ్గించడం, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరచడమే వీటి లక్ష్యం
కాజీపేట-విజయవాడ కారిడార్లో 118 కి.మీ.ల మల్టీ-ట్రాకింగ్ ఏర్పాటుతో సామర్థ్య విస్తరణ, మెరుగైన సమయపాలన, వేగవంతమయ్యే ప్రయాణికుల, సరకు రవాణా రైలు కార్యకలాపాలు
హైదరాబాద్, బల్లార్ష, విజయవాడ మార్గాల్లో ఏకకాలంలో రైళ్ల రాకపోకలకు వీలు కల్పించే 21 కి.మీ. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్
తెలంగాణ వ్యాప్తంగా బొగ్గు, సిమెంటు, వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడంతో పాటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూర్చే రైల్వే మౌలిక వసతి ప్రాజెక్టులు
నాడు పోస్టు చేయడమైనది:
09 MAY 2026 8:49PM by PIB Hyderabad
తెలంగాణలో సుమారుగా రూ.1,535 కోట్లకు పైగా విలువైన ప్రధాన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను 2026 మే 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేసే, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరిచే, ప్రయాణికులు, సరకు రవాణాను విస్తరించే దిశగా చేపట్టిన మరో ముఖ్యమైన కార్యక్రమంగా ఇది నిలుస్తుంది.
కీలకమైన రైల్వే కారిడార్లను ఆధునీకరించడం, రాకపోకలు ఎక్కువగా ఉండే విభాగాల్లో రద్దీని తగ్గించడం, వేగవంతమైన, సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా రైల్వేలు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో 118 కి.మీ.లు విస్తరించిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు కీలకమైన భాగం. దీనిలో వరంగల్-కాజీపేట, నెక్కొండ-మహబూబాబాద్, ఎర్రుపాలెం-డోర్నకల్ జంక్షన్ రైలు సెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలతో సహా పలు కీలక జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది.
దేశంలోని ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ గణనీయమైన స్థాయిలో ప్రయాణికులు, సరకు రవాణాను నిర్వహించే అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ మార్గంలో ముఖ్యమైన భాగంగా ఈ కారిడార్ ఏర్పాటవుతుంది.
గణనీయమైన స్థాయిలో లైన్ సామర్థ్యాన్ని ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు విస్తరిస్తుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలు సజావుగా, వేగంగా సాగుతాయి. అదే సమయంలో అత్యంత ఎక్కువగా రాకపోకలు సాగించే మార్గాల్లో రద్దీ తగ్గుతుంది. ఫలితంగా రైళ్ల సమయపాలన మెరుగవుతుందనీ, సరకు రవాణా సేవల్లో ఆలస్యం తగ్గుతుందనీ, ఈ ప్రాంతమంతటా సరకు రవాణా సులభతరం అవుతుందనీ అంచనా వేస్తున్నారు.
కాజీపేట-విజయవాడ కారిడార్ ద్వారా విశ్వసనీయతను మెరుగుపరచడం, ఆలస్యాన్ని తగ్గించడం, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర భారతానికి వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుస్తుంది.
సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడటం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య బొగ్గు, సిమెంటు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణాకు తోడ్పాటు లభిస్తుంది. స్థానిక పరిశ్రమలు, రైతులు, వ్యాపారాలకు లబ్ధి చేకూరుతుంది.
ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన కాజీపేట జంక్షన్ వద్ద రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న 21 కి.మీ.ల కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.
హైదరాబాద్, బల్లార్ష, విజయవాడ మార్గాల్లో ఏకకాలంలో రైలు రాకపోకలకు ఈ బైపాస్ వీలు కల్పిస్తుంది. తద్వారా కార్యకాలాపాల సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. రైళ్లు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గిస్తుంది. రద్దీగా ఉండే జంక్షన్ వద్ద కార్యాచరణపరమైన ఇబ్బందులను, క్రాసింగ్ ఆలస్యాలను తగ్గిస్తుంది. ఫలితంగా సమయపాలన మెరుగవుతుంది. రైళ్లు కార్యకలాపాలు క్రమబద్ధమవుతాయి.
ముఖ్యమైన ఢిల్లీ-చెన్నై మార్గంలో అనుసంధానాన్ని ఈ బైపాస్ బలోపేతం చేస్తుంది. అలాగే ముఖ్యమైన కారిడార్లలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల సరకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జంక్షన్ వద్ద ఆగకుండా లేదా ప్రయాణ మార్గాల విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రైళ్లు నేరుగా ప్రయాణించడం వల్ల కార్యాచరణ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఫలితంగా ప్రయాణికులు, సరకు రవాణా సేవలు రెండూ సజావుగా సాగుతాయి.
మరింత సమర్థమైన రైలు షెడ్యూలింగు, రద్దీ సంబంధిత ఆలస్యాలను తగ్గించడం ద్వారా ఈ ప్రాజెక్టు సమీప పట్టణాలు, జిల్లాలకు అనుసంధానాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
తెలంగాణతో పాటుగా పొరుగు రాష్ట్రాలకు ప్రాంతీయ అనుసంధానతను బలోపేతం చేయడానికి, ప్రయాణికులకు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక ప్రగతికి తోడ్పడే అత్యధిక సామర్థ్యం కలిగిన, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సిద్ధమైన రైలు వ్యవస్థను నిర్మించడంలో భారతీయ రైల్వేల చిత్తశుద్ధిని ఈ ప్రాజెక్టులు ప్రతిబింబిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2259529)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17