గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేలం వేసిన 101 గనుల్లో ఖనిజ తవ్వకం ప్రారంభం: జాతీయ ఖనిజ రంగంలో కీలక పరిణామం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 7:19PM by PIB Hyderabad

దేశంలో 2015 నుంచి గనుల వేలం విధానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇప్పటిదాకా 101 గనులలో ఖనిజాల తవ్వకం విజయవంతంగా ప్రారంభమైంది. దీంతో జాతీయ ఖనిజ రంగంలో చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో గనుల మంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణల రూపాంతరీకరణ ప్రభావాన్ని ఈ కీలక విజయం ప్రస్ఫుటం చేస్తోంది. వికసిత భారత్-2047, స్వయంసమృద్ధ భారత్ దార్శనికతకు ఇది దోహదం చేస్తుంది.

వేలం విధానం ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గనులను వేలం వేయడంతో  పారదర్శక, పోటీతత్వంతో కూడిన ఖనిజ వనరుల కేటాయింపులో భారత్‌ అనూహ్య ప్రగతి సాధించింది. ఇప్పటిదాకా వేలం వేసిన వాటిలో 101 గనులలో ఇప్పటికే తవ్వకం ప్రారంభమైంది. మైనింగ్ సంస్కరణల సమర్థ అమలులో ఈ పరిణామం కీలక ఘట్టంగా నిలిచింది. ముఖ్యంగా 2025-26లో వేలం విధానం కింద అత్యధిక స్థాయిలో వార్షిక ఫలితాలు నమోదయ్యాయి. ఒకే ఆర్థిక సంవత్సరంలో 212 గనులను వేలం వేయడాన్ని బట్టి, భారత పారదర్శక కేటాయింపు చట్రంలో పెరుగుతున్న వేగం, సామర్థ్యం, విశ్వసనీయత స్పష్టమవుతున్నాయి.

ఖనిజ వనరుల వేలంపైనే కాకుండా వాటిని సకాలంలో ఉత్పాదన స్థాయికి తేవడంపైనా గనుల మంత్రిత్వ శాఖ నిరంతరం శ్రద్ధ పెడుతోంది. దేశవ్వాప్తంగా 101 గనులలో తవ్వకాలు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనం. విధానపరంగా నిరంతర మద్దతు, ప్రక్రియల సరళీకరణ, చురుకైన పర్యవేక్షణ ద్వారా చట్టబద్ధ అనుమతులను వేగిరపరచడం, ఆమోద సౌలభ్యం కల్పించడం, అమలు క్రమంలో సమస్యలను పరిష్కరించడం తదితరాల దిశగా గనుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా కృషి చేసింది. ఈ సమన్వయ సహిత కేంద్ర-రాష్ట్ర విధానమే వేలం వేసిన గనులన్నీ కేటాయింపు నుంచి ఉత్పత్తి దశకు మారడాన్ని గణనీయంగా వేగిరపరచింది.

ప్రస్తుతం తవ్వకాలు ప్రారంభించిన ఈ గనులు దేశీయ ఖనిజ ఉత్పాదనను పెంచుతాయి. అంతేకాకుండా కీలక పరిశ్రమలకు ముడి పదార్థాల లభ్యతపై భరోసా ఇస్తూ దిగుమతి పరాధీనతను తగ్గించడంతోపాటు మొత్తం మీద ఆర్థిక వృద్ధికి మద్దతివ్వడంలో అర్థవంతంగా దోహదం చేస్తున్నాయి.

తవ్వకాలు ప్రారంభమైన రాష్ట్రాల పరంగా ఒడిషా 34 గనులతో అగ్రస్థానంలో ఉండగా, 18 గనులతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అలాగే, గుజరాత్ 11, మధ్యప్రదేశ్ 10, రాజస్థాన్ 8, గోవా 6,  ఆంధ్రప్రదేశ్ 5, ఛత్తీస్‌గఢ్ 5, మహారాష్ట్ర 3, అస్సాం 1 వంతున తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆసక్తి వ్యక్తీకరణ లేఖ జారీ చేసిన కేవలం 9 నెలల్లోనే అస్సాం తన గనులను తవ్వకపు దశకు తెచ్చింది. తద్వారా పాలన సామర్థ్యాన్ని, సమర్థ సమన్వయాన్ని చాటుకుంది.

ఉత్పాదన ప్రారంభమైన గనులలో పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన విభిన్న ఖనిజాలు లభ్యమవుతాయి. ఈ మేరకు 47 గనులలో ఇనుప ఖనిజం, 29 గనులలో సున్నపురాయి లభ్యమవుతాయి. అంతేకాకుండా ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాల ప్రగతికి దోహదం చేసే బాక్సైట్, మాంగనీస్, క్రోమైట్ వంటి ఇతర అనుబంధ ఖనిజాల గనులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

వేలం వేసిన గనులను ఉత్పాదక స్థాయికి తేవడంలో చురుగ్గా కృషి చేయడంతోపాటు విధానపరంగా మద్దతివ్వడంలో పాలన సామర్థ్యం ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అభినందించింది. దేశంలో 2015 నుంచి వేలం వేసిన 101 గనులలో విజయవంతంగా తవ్వకాలు ప్రారంభం కావడం భారత మైనింగ్ పాలన వ్యవస్థ బలోపేతం కావడాన్ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు దీర్ఘకాలిక వనరుల భద్రతకు భరోసాతోపాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారదర్శక, సమర్థ, సుస్థిర ఖనిజ రంగం ప్రగతిపై ప్రభుత్వ నిబద్ధత మరోసారి రుజువైంది.

 

***


(రిలీజ్ ఐడి: 2258907) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati