మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూడిల్లీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) మార్గదర్శకాలను ఆవిష్కరించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
సామాజిక భాగస్వామ్యాన్ని, పాఠశాల నిర్వహణను బలోపేతం చేయడానికే పాఠశాల నిర్వహణ సంఘం మార్గదర్శకాలు-2026: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
విద్యను బలోపేతం చేయడానికి పాఠశాల నిర్వహణ సంఘాలను ప్రజా ఉద్యమంగా మార్చాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 6:00PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో పాఠశాల నిర్వహణ సంఘం (ఎస్ఎంసీ) మార్గదర్శకాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. ఢిల్లీ ఎన్‌సీటీ విద్యామంత్రి శ్రీ ఆశిష్ సూద్, చత్తీస్‌గఢ్ పాఠశాల విద్యా మంత్రి శ్రీ గజేందర్ యాదవ్, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీవోఎస్ఈఎల్) కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ కుమార్ మీనా, డీవోఎస్ఈఎల్ అదనపు కార్యదర్శి శ్రీమతి అర్చనా ఎస్. అశ్వతి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 15 లక్షల పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 లక్ష్యాలను ఆచరణలోకి తీసుకురావడంలో పాఠశాల యాజమాన్య సంఘం (ఎస్ఎంసీ) మార్గదర్శకాలు-2026 కీలకపాత్ర పోషిస్తాయన్నారు. విద్యారంగంలో బలమైన సామాజిక భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యతతో బాలల సమగ్రాభివృద్ధి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజాల మధ్య ముఖ్యమైన వారధిగా ఎస్ఎంసీలు వ్యవహరించేలా చేయడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని తెలిపారు.

ప్రత్యేకావసరాలున్న బాలలకు (సీడబ్ల్యూఎస్ఎన్) విద్య, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ పాఠశాలలను బలోపేతం చేయడంలో చేయూతకు, మార్గదర్శకత్వానికి, సమాజ భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఎస్ఎంసీ మార్గదర్శకాలు గుర్తించాయని శ్రీ ప్రధాన్ స్పష్టం చేశారు. విద్యాఫలితాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కొనసాగే సంస్కృతిగా, ప్రజా ఉద్యమంగా ఎస్ఎంసీలను అభివృద్ధి చేయడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమన్నారు. సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో విద్యాంజలి లాంటి కార్యక్రమాలు పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. చరిత్రలో భారతదేశ విద్యా వ్యవస్థ సామాజిక నాయకత్వంలోనే అభివృద్ధి చెందిందనీ, నూతన ఎస్ఎంసీ మార్గదర్శకాలు సైతం పాఠశాలలను సామాజిక భాగస్వామ్యానికి కేంద్రంగా మరోసారి నిలపడం ద్వారా ఆ స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తాయన్నారు.
కొత్త మార్గదర్శకాలను జారీ చేయడానికే ఈ కార్యక్రమం పరిమితం కాలేదనీ, ఇది భారత విద్యా వ్యవస్థలో వస్తున్న ఒక లోతైన, పరివర్తనాత్మక మార్పును సూచిస్తుందనీ శ్రీ ఆశీష్ సూద్ తెలియజేవారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలంటే దానికి అవసరమైన మార్గం పాఠశాలల మీదుగా వెళ్లాలన్నారు.
ఈ పరివర్తన ప్రయాణంలో నూతనంగా ఆవిష్కరించిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు-2026ను ముఖ్యమైన అనుసంధానంగా శ్రీ సూద్ వర్ణించారు. విద్యాహక్కు చట్టం అనంతరం ప్రవేశపెట్టిన మునుపటి ఎస్ఎంసీ విధానం.. నిధులనూ, మౌలిక వసతులనూ పర్యవేక్షించడానికి, పరిపాలనా సంబంధమైన ప్రక్రియలకే పరిమితమైందన్నారు. ప్రస్తుత కాలంలో సవాళ్లు, అంచనాల తీరు గణనీయంగా మారిపోయింది. బాలల భద్రత, మానసిక ఆరోగ్యం, ప్రాథమిక అక్షరాస్యత-గణితంపై అవగాహన (ఎఫ్ఎల్ఎన్), డిజిటల్ పారదర్శకత, అభ్యాస ఫలితాలు, సమాజ భాగస్వామ్యం తదితర అంశాలు అత్యంత కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని ఆయన తెలియజేశారు. ఈ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఎస్ఎంసీ మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి ఎస్ఎంసీలను కేవలం పర్యవేక్షణ సంస్థల నుంచి నిజమైన ‘‘పాఠశాల సామాజిక పాలక సంస్థలు’’గా మారుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై బాలల సంపూర్ణాభివృద్ధికి, విద్యా నాణ్యతకు, విద్యార్థి సంక్షేమానికి, భద్రతకు, సమ్మిళిత్వానికి, డిజిటల్ పరిపాలనకు, పారదర్శకతకు ఎస్ఎంసీలు చురుగ్గా దోహదపడతాయి. ఎస్ఎంసీ మార్గదర్శకాలు-2026 సమాజ భాగస్వామ్యాన్ని, పారదర్శకతను, విద్యా నాణ్యతను పెంపొందిస్తాయనీ, వికసిత భారత్ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయనీ విశ్వాసం వ్యక్తం చేస్తూ శ్రీ సూద్ తన ప్రసంగాన్ని ముగించారు.
బాలల్లో అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సమాజం నుంచి చురుకైన భాగస్వామ్యం అవసరమని శ్రీ గజేంద్ర యాదవ్ అన్నారు. పాఠశాలల నిర్వహణ, కార్యకలాపాల్లో స్థానిక సంరక్షకుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తల్లిదండ్రులకు, పాఠశాలలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) మార్గదర్శకాలు తోడ్పడతాయని ఆయన అన్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యా మంత్రులు ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. వారిలో హరియాణా పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా మంత్రి శ్రీ మహిపాల్ ధండా, మహారాష్ట్ర పాఠశాల విద్య, మరాఠీ భాష మంత్రి శ్రీ దాదాజీ బూసే, మిజోరాం పాఠశాల విద్య, ఉన్నత, సాంకేతిక విద్యా మంత్రి డాక్టర్ వన్లాల్‌థ్లానా, త్రిపుర ఉన్నత విద్యా శాఖ మంత్రి శ్రీ కిషోర్ బర్మన్, ఉత్తరాఖండ్ విద్యా మంత్రి శ్రీ ధన్ సింగ్ రావత్, నాగాలాండ్ ఉన్నత విద్యా మంత్రి శ్రీ తెంజిన్ ఇమ్నా అలోంగ్ ఉన్నారు.
పాఠశాల నిర్వహణ సంఘం (ఎస్ఎంసీ) మార్గదర్శకాల కోసం దిగువ లింక్‌ను క్లిక్ చేయండి https://dsel.education.gov.in/sites/default/files/guidelines/School_Management_Committee_Guidelines.pdf
***
(రిలీజ్ ఐడి: 2258676)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6